వితంతువులకు శుభ వార్త
మే నెల నుండి వితంతువులకు కొత్త పించన్లు
గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు ప్రక్రియ ప్రారంభం
ఇక భర్త చనిపోతే మరుసటి నెల నుండి పించన్
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
పింఛన్ల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. భర్తకు పింఛన్ వస్తుండి అతను మరణిస్తే ఆ పింఛను భార్యకు బదలాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం 2023 డిసెంబర్ వరకు మాత్రమే కొత్త పెన్షన్లను అందజేసింది. అప్పటి నుండి కొత్త పెన్షన్ల మంజూరు కాలేదు. వితంతువులకు మేలు చేయాలని భావించిన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భర్త చనిపోయిన భార్యలు కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనుంది.
గత ఏడాది నవంబరు నుంచి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఈ కేటగిరి కింద లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.4 వేల చొప్పున చెల్లిస్తోంది. అయితే అంతకుముందు గత ప్రభుత్వం హయాం 2023 డిసెంబరు 1 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబరు 31 మధ్య ఉన్న స్పౌజ్ కేటగిరీకి చెందిన అర్హులకూ పింఛన్ అందించాలని సెగ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ కేటగిరిలో అర్హురాలైన మహిళ భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డుతో పాటుగా మిగిలిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలని అధికారులు సూచించారు . శుక్రవారం నుంచే ఈ వివరాలను గ్రామ, వార్డు సచివాయాల్లో స్వీకరిస్తారు. ఈ నెల 30లోపు అర్హులు ఈ వివరాలు సమర్పిస్తే, మే 1న పింఛను సొమ్ము అందుతుందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఆలోపు నమోదు చేసుకోలేకపోతే వారికి జూన్ 1 నుంచి పింఛన్ డబ్బుల్ని చెల్లిస్తారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది. 2014- 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కొత్త పింఛన్ నమోదు ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించారు. అర్హత ఉంటే చాలు లబ్ధిదారులు వారంలో ఏ రోజైనా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఆ వెంటనే అధికారులు దరఖాస్తుల్ని పరిశీలించి ఏ వారానికి ఆ వారం నెలాఖరుకు పింఛన్ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేవారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పింఛన్ పొందే అవకాశం ఉండేది. గత ప్రభుత్వ హయాంలోఆరు నెలలకు ఒకసారి జూన్, డిసెంబర్ మాత్రమే లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ నిబంధనను మార్చేసింది. స్పౌజ్ కేటగిరిలో భర్త చనిపోతే భార్యకు ఆ మరుసటి నెల నుంచి పింఛన్ అందించేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి ఆ నెల 15వ తేదీ లోపు మరణించిన వింతతు మహిళకు తరుపరి నెల ఒకటో తేదీనే రూ.4వేల చొప్పున పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 15 రోజుల్లో మరణించిన వారికి మరుసటి నెలలో పింఛన్ అందిస్తారు.

