హిందూ సంసృతి, సంప్రదాయాలలో అంతర్భాగం శ్రీరాముడు
నేడు శ్రీరామనవమి
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైన నిరంతరం అమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పిన మహాపురుషుడు శ్రీరాముడు. అందుకే తల్లిదండ్రులు తమకు శ్రీరాముడు లాంటి పుత్రుడు కలగాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తనకు శ్రీరాముడు లాంటి భర్త రావాలని ప్రార్థిస్తారు. శ్రీరాముడు లాంటి పాలకుడు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తారు. శ్రీరాముడు లాంటి సద్గుణాల రావాలని తమ పిల్లలకు శ్రీరాముని పేరు పెట్టుకుంటారు. శ్రీరామాయణ గ్రంథం, శ్రీరాముని ఫోటో ఉండని హిందూ కుటుంబం ఉండదు. శ్రీరాముని గుడి లేని గ్రామం ఉండదు. తమకు ఎలాంటి కష్టాలు రాకూడదని తాము నివసిస్తున్న గ్రామాలకు రామాపురం అని కాలనీలకు రాంనగర్ అని పేర్లు పెట్టుకుంటారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ఒక అంతర్భాగం శ్రీరాముడు.
ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి, దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుంది. తండ్రి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్లిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ మూర్తే. రామాయణంలో రాముడి లక్షణాలు గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు. అయితే రాముడితోపాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక, లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక, హనుమంతుడు భక్తికి ప్రతీక. తన అంచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికీ చిరంజీవిగా ఉన్నాడు. స్వామి భక్తి పరాయణుడైన వాయు నందనుడు నిరంతరం రామ నామ స్మరణతోనే గడిపాడు. ఇక లక్ష్మణుడు అన్నావదినల సేవ కోసం పద్నాలుగేళ్లు నిద్ర లేకుండా ఉండేలా వరం పొందాడు. రాముడిలోని ఉన్న ఈ పదహారు గుణాలే మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి. శ్రీరాముడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, సకల ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు అని రామాయణం ప్రబోధిస్తోంది. దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. రాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ రామ నవమిగా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజు శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. రామాలయంలో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయని ప్రజల నమ్మకం. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయని పండితులు చెపుతారు. శ్రీ రామనవమి రోజున పానకం, వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు, పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది.పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడడెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.
పో రై గంగ 1 శ్రీరాముడు
గంగ 2 చిత్తూరు శ్రీరామనవమి శోభా

