వేసవిలో తాగునీటి సమస్య తీర్చడానికి రూ.9.25 కోట్లతో ప్రణాళిక
494 గ్రామాలకు ప్రజలకు టాంకర్ల ద్వారా నీటి సరఫరా
389 గ్రామాలలో పశువులకు టాంకర్ల ద్వారా నీటి సరఫరా
36 గ్రామాలలో బోర్ల ఫ్లషింగ్, 62 గ్రామాల్లో బోర్ల లోతు,
40 గ్రామాల్లో అద్దెకు వ్యవసాయ బోర్లు
ఆంధ్రప్రభ బ్యూరోతో ఆర్డబ్యూఎస్ ఎస్ఇ విజయ్ కుమార్
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
వేసవిలో చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను నివారించడానికి రూ.9.25 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించామని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం సుపరింతెంట్ ఇంజినీర్ కె. విజయ్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికను ఆమోదం నిమిత్తం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపమన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 494 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. 40 గ్రామాల్లో బోర్లను అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉన్న బోర్లను 36 గ్రామాల్లో ఫ్లషింగ్ చేయడానికి, మరో 62 గ్రామాల్లో బోర్లను లోతు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేశామని వివరించారు.
చిత్తూరు జిల్లాలోని 16 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆ మండలాల్లో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించిన చిత్తూరు, గుడిపాల, పెనుమూరు, గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, బైరెడ్డిపల్లి, పలమనేరు. వి.కోట, పుంగనూరు, సోమల, పూతలపట్టు, యాదమరి, పులిచెర్ల మండలాల మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. అలాగే గంగాధర నెల్లూరు, పాలసముద్రము, గంగవరం, పెద్దపంజాణి, బంగారు పాల్యం, ఐరాల, తవణంపల్లి, సదం మండలాల్లో కూడా తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. ఈ 23 మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. 23 మండలాల్లోని 494 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా వేశమన్నారు. ఈ గ్రామాలకు 1,03,353 ట్రిప్పులు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాల్సి వస్తుందన్నారు. ఒక్కొక్క ట్రిప్పుకు 570 రూపాయల వంతున మొత్తం ఈ సంవత్సరానికి 5.89 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని వివరించారు. అలాగే పశువులకు 389 గ్రామాలకు 36,458 ట్రిప్పులను నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని, ఇందుకు 5.70 కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. జిల్లాలో 40 గ్రామాలకు సంబంధించి 6433 బోర్లను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని, ఎందుకు 22.52 లక్షల రూపాయలు అవసరమని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని 36 బోర్లను ఫ్లషింగ్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు 19.10 లక్షల రూపాయలు అవసరమవుతాయన్నారు. జిల్లాలోని 62 బోర్లను లోతు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 86.90 లక్షల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయడానికి ఒక ట్రిప్పుకు 570 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తాగునీటి నిమిత్తం బోర్లను స్వాధీనం చేసుకొనే ఒక్కొక్క బోరుకు రోజుకు 350 రూపాయలు చెల్లించాలని ప్రతిపాదించినట్లు వివరించారు. జిల్లాలోని తాగునీటి సమస్య మీద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తరచుగా సమీక్ష నిర్వహిస్తున్నారని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం సుపరింతెంట్ ఇంజినీర్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేసి, ఫోటోలు తీసి జిల్లా కలెక్టర్ కు పంపుతున్నట్లు తెలిపారు. త్రాగునీటి పైపులు లీకేజీ ఉన్న వాటిని వెంటనే రీప్లేస్మెంట్ చేస్తున్నామని, డీ ఈ లు వారి పరిధిలోని మండలాల్లో పర్యటించి గ్రామాలలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఏఈలు మండల పరిధిలోని పంచాయతీ సెక్రెటరీ తో సమయం చేసుకొని ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రం చేయించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తాగునీటి సరఫరా అయ్యే పైప్ లు మరమ్మత్తులకు గురి అయితే మురుగు నీరు కలసి కలుషితంతో రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందన్నారు. త్రాగునీటిని నిరంతరం ల్యాబ్ లకు పంపిణిచి టెస్టింగ్ చేపిస్తున్నామని అన్నారు. ఏఈ లు, పంచాయతీ సెక్రెటరీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ లతో సమన్వయంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన చోట బోర్లు వేసి ఉంటే మోటర్లు బిగించి, వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో గత 15 రోజుల వ్యవధిలో లీకేజీ అయిన 105 పైపులను గుర్తించి వెంటనే 105 లీకేజీ పైపులను సరిచేయడం జరిగిందన్నారు. 185 పంపు సెట్ లు మరమ్మత్తులను గుర్తించి, 185 పంపు సెట్ లకు మరమ్మత్తులు చేపట్టామన్నారు. ప్రస్తుతం 95 గ్రామాలకు టాంకర్ ల ద్వారా నీటి సరఫరా చేపట్టామని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం సుపరింతెంట్ ఇంజినీర్ విజయ్ కుమార్ తెలిపారు.
పో రై గంగ 1 ఆర్ డబ్యూ ఎస్ ఎస్ ఇ విజయ్ కుమార్

