ప్రజల మద్డదు ఉన్న వారికే నామినేటెడ్ పదవులు
ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల, కార్యకర్తల అభిప్రాయాల సేకరణ
నాయకులలో గుబులు లేపుతున్న ఐవీఆర్ఎస్ సర్వే
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్లను ఇవ్వడానికి అనుసరించిన విధానాన్ని తిరిగి నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఐవీఆర్ఎస్ ద్వారా ముగ్గురి పేర్లను సూచించి, వారిలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపొందుతారో తెలియజేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు రాష్ట్ర మొత్తం మీద నాలుగైదు దపాలుగా ఎన్నికలలో టికెట్లను ఆశిస్తున్న నాయకుల గురించి అభిప్రాయన సేకరణ చేశారు. అభిప్రాయ సేకరణలో ఎక్కువ ప్రజల మద్దతు వచ్చినవారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను కేటాయించారు. దీంతో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇదే విధానాన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ముఖ్యమైన నేతల గురించి ఐవిఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. గత రెండు నెలలుగా అన్ని నియోజకవర్గాలలో ఈ సర్వే జరుగుతోంది.
ప్రజలు, కార్యకర్తల్లో 50 శాతం పైగా మద్దతు ఉన్న వారికే పదవులు ఇస్తామని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు కూడా ఇది వర్తిస్తుందని మంగళవారం చెప్పారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా సర్వే చేసి పలుకుబడి, సామర్థ్యం అంచనా వేసి తగిన పదవులు కేటాయిస్తామని చెప్పారు. దీనితో చిత్తూరు జిల్లా కార్యకర్తల్లో ఐవీఆర్ఎస్ టెన్షన్ నెలకొన్నది. ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న సమాచారం విశ్లేషించి పనిచేసిన వారికే పదవులు ఇస్తామని చెప్పారు. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే అనగానే కొందరిలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీల నాయకులు నామినేటెడ్ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఒక్కొక్క పోస్టుకు వంద మందికి పైగా పోటీలో ఉన్నారు. ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారు కూడా తిరిగి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. కొంతమంది ముఖ్య నేతల వద్ద పైరవీలు చేసుకొని నామినేటెడ్ పదవులు పొందవచ్చునని ఆశపడ్డారు. మరి కొందరు జిల్లాలో గెలుపొందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి సిఫార్సు లేఖలను సేకరించి అధిష్టానానికి అందజేశారు. జిల్లాలోని అందరు శాసనసభ్యులు తనకు లేఖ ఇచ్చారు కావున తమకే నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఇంకొందరు గత ఎన్నికలలో అభ్యర్థులకు ధన సహాయం చేశామని, వారి ద్వారా నామినేటెడ్ పోస్టులు పొందవచ్చని భావించారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రేక్ వేశారు. దీంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులలో అందోళన ప్రారంభం అయ్యింది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నాయకులపై వర్గాలు, కులాలు, పార్టీల ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీని వల్ల బాగా పనిచేసిన వారికి కూడా వ్యతిరేకంగా స్పందించే వారు ఉంటారని కొందరు అంటున్నారు. అయితే అన్ని కోణాలలో పరిశీలించిన తరువాత ఆఖరి దశలో ఐవీఆర్ఎస్ సర్వే ఉంటుందని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. గతంలో అనేక సందర్భాలలో ఐవీఆర్ఎస్ ద్వారా ఎంపిక చేసి ఎమ్మెల్యే, ఎంపి టికెట్లు కేటాయించారని అంటున్నారు. పార్టీకి సేవ సేసిన వారికి తగిన గుర్తింపు దొరుకుతుందని అంటున్నారు. కాగా పదవుల కేటాయింపులో అన్ని వర్గాల నేతలు, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తారని తెలిసింది. కాగా చిత్తూరు జిల్లాపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిసింది. జిల్లాలో ఉన్న వైసిపి నేతలు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె నారాయణ స్వామి, ఆర్ కె రోజా, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డిని సమర్ధ వంతంగా ఎదుర్కొనే నాయకుల కోసం అన్వేసితున్నారని అంటున్నారు. బలమైన ఈ నేతల విమర్శలను ఎదుర్కోవడంలో జిల్లా ఇంచార్జి మంత్రి, ఎమ్మెల్యేలు సఫలం కాక పోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో అద్భుత పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి సానుకూల ప్రచారం చేయడంలో కూడా నాయకులు విఫలం అవుతున్నారన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసిపి నాయకుల విమర్శలను తిప్పి కొట్టడంలో వెనకబడి ఉన్నారని చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఈ నేపధ్యంలో చిత్తూరు పార్లమెంటు అధ్యక్షునిగా బలమైన వ్యక్తిని నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆయనకు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. జిల్లాకు చెందిన నారాయణ స్వామి, రోజా వైసిపి రాజకీయ సలహా కమిటీ సభ్యులుగా ఉన్నందున టిడిపి పొలిట్ బ్యూరో సభ్యునిగా జిల్లాకు చెందిన ఒకరికి స్థానం కల్పిస్తారని అంటున్నారు. అలాగే టిడిపి జాతీయ అధికార ప్రతినిధిగా ఒకరికి అవకాశం ఉంటుందని సమాచారం. దీని కోసం కీలక నేతల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. ప్రధానమైన మూడు పదవులను మూడు వర్గాల నాయకులకు కేటాయిస్తారని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కొందరు నాయకులు తమ తమ అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు.కాగా ఇద్దరు లేక ముగ్గురు నాయకులకు రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే పదవుల పందేరం చాలా ఆలస్యం అయ్యిందని అంటున్నారు. ఈ నెలాఖరుకు కొన్ని రాష్ట్ర స్థాయి పదవులు, ఆలయాల పాలక మండళ్ళు, మార్కెట్ కమిటీలు వేస్తారని తెలిసింది. పార్టీలో కీలక పదవులను మహానాడు తరువాత ఏర్పాటు చేస్తారు. మే 27,28,29 తేదీలలో కడపలో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

