మే 1 నుండి ఒకే రాష్ట్రం - ఒకటే గ్రామీణ బ్యాంకు
విలీనం కానున్న నాలుగు గ్రామీణ బ్యాంకులు
ఇక రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సేవలు
ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు
ఖాతాదారుల అకౌంటు నెంబర్, సేవలు యథాతథం
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
ఒకే రాష్ట్రం, ఒకటే గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలో మే ఒకటవ తేది నుండి అమలులోకి రానుంది. బ్యాంకుల విలీనంతో రాష్ట్రంలోని నాలుగు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉన్నాయి. వీటిని విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. మే 1 నుండి ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కనిపించవు. అయితే బ్యాంకుల విలీనం ద్వారా ఖాతాదారులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. వారి ఖాతా విలీన బ్యాంక్ నుంచి ప్రధాన బ్యాంకుకు మారుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో అకౌంట్ కొనసాగుతుంది. ఈ విలీనానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం లబించడంతో విలీన ప్రక్రియ చకచకా జరిగిపోయింది.బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ పేరు మాత్రమే మారుతుంది. మిగిలి సేవలన్నీ యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సౌకర్యాలను అందించే లక్ష్యంతో అర్ ఆర్ బి చట్టం, 1976 కింద గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. చట్టం 2015లో సవరించారు. దీని ప్రకారం అటువంటి బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర బ్యాంకుల నుండి కాకుండా ఇతర వనరుల నుండి మూలధనాన్ని సేకరించేందుకు అనుమతించింది. దేశంలో ప్రస్తుతమున్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ లను 28కి తగ్గించాలని ఆర్థికశాఖ యోచించింది. ఇందుకోసం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదంతో కేంద్రం రోడ్ మ్యాప్‌ను రూపొందించింది.. ఈ సంప్రదింపుల బాధ్యతను నాబార్డుకు అప్పగించింది. గ్రామీణ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 50 శాతం వాటా ఉంది. మరో 35 శాతం స్పాన్సర్ బ్యాంక్‌కు, మిగతా 15 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది. భారత ప్రభుత్వ నోటిఫికేషన్ 2006 జూన్ 1 ప్రకారం రాయలసీమ గ్రామీణ బ్యాంకు, శ్రీ అనంత గ్రామీణ బ్యాంకు, పినాకిని గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉనికిలోకి వచ్చింది. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో ఉంది. అనంతపురం, వైయస్ఆర్ కడప, కర్నూలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం అనే 5 జిల్లాల అధికార పరిధితో ఉంది. ఈ బ్యాంకుకు 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని కదిరి, వైయస్ఆర్ జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. బ్యాంకు తన 552 శాఖలతో బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు, కృష్ణా జిల్లా గుడివాడ కనకదుర్గ గ్రామీణ బ్యాంకు విలీనంతో సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏర్పడింది, దీని ప్రధాన కార్యాలయం చిత్తూరులో ఉంది. రాష్ట్రంలోని చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, కృష్ణా జిల్లాల్లో బ్యాంక్ కార్యనిర్వహణ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ బ్యాంకుకు 246 శాఖలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో 68 శాఖలు, ఎన్టీఆర్ జిల్లాలో 52 శాఖలు, తిరుపతి జిల్లాలో 47 శాఖలు, కృష్ణా జిల్లాలో 36, అన్నమయ్య జిల్లాలో 31 శాఖలు, ఏలూరు జిల్లాలో 12 శాఖలతో బ్యాంకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకు, నాగార్జున గ్రామీణ బ్యాంకు, సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు, మంజీరా గ్రామీణ బ్యాంక్, కాకతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా, 2006లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వరంగల్ లో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేయబడింది, ఇది ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో పనిచేస్తోంది. అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లె, ఏలూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో సేవలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 278 శాఖలు , 1297 బ్యాంక్ మిత్ర పాయింట్లతో గ్రామీణ ప్రజలకు సేవలను అందిస్తోంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ 2006 సెప్టెంబర్ 1న స్థాపించబడింది. ఇది చైతన్య గ్రామీణ బ్యాంక్ , గోదావరి గ్రామీణ బ్యాంక్‌లను విలీనం చేయడం ద్వారా ఏర్పడింది. ప్రధాన కార్యాలయం గుంటూరు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, గుంటూరు, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 275శాఖల నెట్‌వర్క్‌తో పనిచేస్తోంది. నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు నాలుగు బ్యాంకులకు ప్రధాన కార్యాలయాలుగా కొనసాగినవి ఇక ప్రాంతీయ కార్యాలయాలుగా అవతరించనున్నాయి.
పో రై. గంగ 1 నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనం

