చిత్తూరు జిల్లాలో కరవు పరిస్థితులు లేవా?
రాయలసేమలో అన్ని జిల్లాలో కరవు మండలాల ప్రకటన
చిత్తూరు జిల్లాలో కరవు మండలాలు నిల్
జిల్లాలో ప్రారంభమైన తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత
జిల్లా ప్రజలకు, రైతులకు దక్కని ఉరట
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్ కు ప్రకటించిన కరవు మండలాల్లో చిత్తూరు జిల్లాకు స్థానం దక్కలేదు. వాస్తవంగా చిత్తూరు జిల్లాలో కరవు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ లో రాయలసీమలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కుంటలు, చెరువులు పూర్తిగా నిండాయి. చిత్తూరు జిల్లాలో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా ఖరీఫ్ సీజన్ కు 18 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా మొత్తాన్ని కరువు మండలాలుగా ప్రకటించలేదని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.
ఖరీఫ్ సేజన్ కు చిత్తూరు జిల్లాలోని పెనుమూరు, గుడిపాల, యాదమర్రిని తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా చిత్తూరు, పూతలపట్టు, కుప్పం, రామకుప్పం సోమల, పుంగనూరు, పలమనేరు, శాంతిపురం, శ్రీరంగరాజపురం, రొంపిచర్ల, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. అయితే, రబీ సీజన్ కు వచ్చేసరికి కరవు మండలాల జాబితాలో ఒక చిత్తూరు జిల్లాకు మాత్రం స్థానం లభించలేదు. దీంతో జిల్లాలోని రైతులు తీవ్ర ఆవేదనకు గురవతున్నారు. జిల్లా అధికారుల అలసత్వం కారణంగానే చిత్తూరు జిల్లాలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటించలేదని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయిందని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలుస్తోంది. అయితే జూలై నెలలో 103.5 సెంటీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా, 88.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే సెప్టెంబర్ నెలలో 153.1 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా, 83.6 మిల్లీమీటర్లు పడింది. ఫిబ్రవరి నెలలో 2.8 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఒక చుక్క కూడా పడలేదు. అలాగే మార్చి నెలలో 9.4 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా, 2.4 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. మిగిలిన నెలలో మాత్రం సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదయింది. ఇప్పటికే జిల్లాలో కరవు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికీ ఐదారు మండలాల్లో నీటి ట్యాంకుల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. భూగర్భ జలాలు సగానికి పైగా అడుగంటి పోయాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో పశువులకు పశుగ్రాసం సమస్యతోపాటు తాగునీరు కూడా లభించడం లేదు. జిల్లాలో పంటల సాగు కూడా అంతంత మాత్రమే. రబీ సీజన్ కు 10,983 హెక్టార్లలో వారి సాగు కావలసి ఉండగా, 5,886 హెక్టార్లలో మాత్రమే సాగు అయింది. అంటే 54 శాతం మాత్రమే వరి సాగయింది. రాగులు 509 హెక్టార్ లో సాగు కావాల్సి ఉండగా, 81 హెక్టార్ మాత్రమే సాగయింది. అంటే 16 శాతం మాత్రమే సాగయింది. మొక్కజొన్న 460 యాక్టర్లలో సాగు కావలసి ఉండగా, కేవలం 166 హెక్టార్లలో మాత్రమే సాగింది. కందులు, ఉద్దులు కూడా అదంతా మాత్రమే సాగయింది. అలాగే జిల్లాలో వేరుశనగ పంట 2,818 హెక్టార్లలో సాగు కావలసి ఉండగా 1,117 హెక్టార్లలో మాత్రమే సాగయింది. అంటే 40 శాతం మాత్రం స్టార్ట్ అయింది. జిల్లాలో ఉలవలు మాత్రం 14,356 హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ లెక్కలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి జిల్లాలో పంటల సాగు సాధారణంగా ఉందని, వర్షపాతం కూడా సాధారణంగా ఉందని తెలియజేశారు. అధికారులు పంపిన ఈ లెక్కల ఆధారంగా చిత్తూరు జిల్లా కరువు మండలాల ప్రకటనకు నోచుకోలేదు. వాస్తవంగా ఉలవలు ఖరీఫ్ సీజన్లో వేరుశనగ పంట చేతికి అందకపోవడంతో ప్రత్యామ్యాయ పంటగా ఉలవలను రైతులు సాగు చేశారు. ఆ పంట ఎప్పుడో చేతికి వచ్చింది. ఖరీఫ్ సీజన్ల సాగు అయిన ఉలవల్ల పంటను రబీ సీజన్లో కూడా సాగు అయినట్లు చూపి, జిల్లాలో కరవు పరిస్థితులు లేవని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఫలితంగా రాయలసీమలో అన్ని జిల్లాల్లో కరువు మండలాలను ప్రకటించగా చిత్తూరు జిల్లా మాత్రం కరువు మండలాల ప్రకటనకు నోచుకోలేదు. అయితే, రబీ సీజన్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల్లో రాయలసీమలోని అన్ని జిల్లాలకు స్థానం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం 51 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది. 37 మండలాల్లో తీవ్రమైన కరువు, 14 మండలాల్లో సాధారణ కరువు ఉన్నట్లు తెలిపారు. రబీ సీజన్ 2024-25కు సంబంధించిన కరువు మండలాలపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో కరువు ప్రభావ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల నివేదికలను కమిటీ పరిశీలించింది. వర్షపాతం లోటు, పంట నష్టం, భూగర్భ జలాల స్థాయి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సిసోడియా తెలిపారు. ఆవివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తీవ్ర కరువు మండలాల జాబితాలో నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల, కర్నూలు జిల్లాలో ఆస్పిరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి ఉన్నాయి. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో రొద్దం, అనంతపురం జిల్లాలో బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాడికి.. ప్రకాశం జిల్లాలో పుల్లలచెరువు, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, కంభం, తర్లుపాడు, పెద్దారవీడు, సంతనూతలపాడు, ఒంగోలు, వెలిగండ్ల, బెస్తవారిపేటలు ఉన్నాయి. కడప జిల్లాలో దువ్వూరు, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, కాశినాయన, ఖాజీపేట, చాపాడు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తొండూరు ఉన్నాయి. మధ్యస్థ కరువు మండలాల్లో కర్నూలు జిల్లాలో పత్తికొండ, అనంతపురం జిల్లాలో విడపనకల్లు, కడప జిల్లాలో మైలవరం, శ్రీసత్యసాయి జిల్లాలో తనకల్లు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో బేతంచర్ల, బనగానపల్లి, సంజామల, ఉయ్యాలవాడ, ప్రకాశం జిల్లాలో కొనకనమిట్ల, మార్కాపురం, చీమకుర్తి, చంద్రశేఖరపురం, పామూరు, రాచర్ల ఉన్నాయి. ఈ మండలాల రైతులు రుణాలు తీసుకోవడానికి, ఇతర సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా గెజిట్లను విడుదల చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీని ద్వారా రైతులు ప్రభుత్వ సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. చిత్తూరు జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించక పోవడంతో రైతుల రుణాలు వాయిదా పడే అవకాశం లేదు. అలాగే కరవు సహాయం కింద జిల్లాకు అదనపు నిధుల విడుదల కూడా ఉండదు. ఇలా జిల్లాలోని ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

