1, అక్టోబర్ 2024, మంగళవారం

చిత్తూరు జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు

జిల్లాలో భారీగా తగ్గిన వర్షపాతం 
ఎండిపోయిన వాగులు, వంకలు, చెరువులు, కుంటలు 
ఎండిపోయిన పచ్చిక మైదానాలు 
జిల్లాలో పూర్తిగా దెబ్బతిన్న ఖరీఫ్ పంటలు 
మేపలేక పాడే ఆవులను అమ్ముకుంటున్నా రైతులు
ఖరీఫ్ నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ 
కరువు ప్రాంతంగా ప్రకటించాలని వినతి

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు జిల్లాలో కరువు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్నాయి. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం పడకపోవడంతో జిల్లాలో ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతింది. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. పశువుల మేత కూడా కరువయ్యింది. పచ్చిక బయళ్ళు అన్ని ఎండిపోయాయి. జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. పశువులకు తాగునీటి సమస్య కూడా ఏర్పడుతుంది. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం.

2024 వ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జనవరి నెలలో 14.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 9.7 మిల్లీమీటర్ల మాత్రం నమోదయింది. ఫిబ్రవరిలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా చుక్క వాన కూడా పడలేదు. మార్చి నెలలో 9.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా వర్షం జాడే లేదు. ఏప్రిల్ నెలలో 19.5 మిల్లీమీటర్లు వర్షం పడాల్సి ఉందిగా పూర్తిగా వర్షం పడలేదు. మే నెలలో మాత్రం 67.2 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 103.3  మిల్లీమీటర్లు పడింది. జూన్ నెలలో 80.9 పడాల్సి ఉందిగా 188.7 మిల్లీమీటర్లు నమోదయింది. జూలై నెలలో 103.5  పడాల్సి ఉండగా 88.3 మిల్లీమీటర్లు మాత్రం పడింది. ఆగస్టు నెలలో 121.2 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 136.3 పడింది. సెప్టెంబర్ నెలలో 153.1 మిల్లి మీటర్లు పడాల్సి ఉండగా కేవలం15.3 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. ఇలా జిల్లాలో వర్షపాతం తగ్గడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. పశువులకు నీళ్లు కూడా ఇబ్బంది అవుతుంది. జిల్లాలోని పచ్చీక మైదానాలు కూడా ఎడారులుగా మారాయి. పచ్చదనం అన్నది కనిపించడం లేదు. పశువులను మెపడం కూడా కష్టం అవుతుంది. జిల్లాలో 5.4 లక్షల ఆవులు, 4,900   ఎనుములు, 52 వేల గొర్రెలు, 22 వేల మేకలు ఉన్నాయి. వీటికి వీటికి పోషణ కూడా రైతులకు కష్టమవుతుంది. పాడి రైతులకు వాటి పోషణ భారం కావడంతో ఆవులను అమ్ముకునే పరిస్థితి నెలకొంది. జిల్లాలో పచ్చదనం కనిపించకపోవడంతో పాల దిగుబడి కూడా తగ్గింది. ఈ ఖరీఫ్ కు  జిల్లాలో 1.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావలసి ఉండగా 60 వేల హేక్టర్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వేరుశనగ పంట జిల్లాలో సాగవుతుంది. చిత్తూరు జిల్లాలో వేరుశనగ సాగు చేసిన తర్వాత  నెల రోజులు పాటు వర్షాలు సక్రమంగా పడ్డాయి. కాయలు ఏర్పడే దశ నుంచి జిల్లాలో వర్షాలు పూర్తిగా పడలేదు. నెలన్నర రోజులు పూర్తిగా వర్షం పడకపోవడంతో  జిల్లాలో 60 వేల ఎకరాల్లో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు పెట్టుబడి కూడా చేతికి అందలేదు. వేరుశనగ పంట దిగుబడి చేసుకున్న తర్వాత వేరుశనగ తొండును పశువులకు పశుగ్రాసంగా వినియోగిస్తారు. ఇందువల్ల రైతులకు భారీగా పశుగ్రాసం ఆదా అయ్యేది. ఈ సంవత్సరం జిల్లాలో వేరుశెనగ పంట పూర్తిగా ఎండిపోవడంతో పశుగ్రాసం కూడా కరువైంది. జిల్లాలో ఖరీఫ్ లో వేరుశనగ తో పాటు కందులు, ఉలవలు, వు, అలసందలు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు వంటి మెట్ట పంటలను పండిస్తారు. వర్షాభావం  కారణంగా జిల్లాలో వరి తప్ప మిగిలిన పంటలు అన్నీ ఎండిపోయాయి. వరిని మాత్రం బావులు, బోర్ల కింద పండిస్తారు. మిగిలిన పంటలు మెట్టపంటలుగా సాగవుతాయి. ఇవి పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడి పండుతాయి. ఈ సంవత్సరం వర్షాలు భారీగా తగ్గడంతో జిల్లాలో వేరుశనగ తో పాటు కందులు, ఉలవలు, అలసందలు, అనపగింజలు, రాగి జొన్న, సజ్జలు వంటి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని రైతులకు అపారమైన నష్టం వాటిల్లింది. అయినా జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ఎవరు రైతులకు జరిగిన కష్టనష్టాలు గురించి ప్రభుత్వానికి నివేదించకపోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా క్రమంగా కరువు కౌగిలిలో ఒదిగిపోతుంది. జిల్లాలో తాగునీటి సమస్య కూడా క్రమంగా ఎక్కువ అవుతుంది. కరువు కారణంగా పంటలు దెబ్బ తినడంతో పాటు, పశుగ్రాసం లేకుండా పశువులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు కూడా ఇంకిపోయాయి. ఫలితంగా బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. భావుల్లో నీళ్లు చూద్దామన్నా, కనిపించడం లేదు. జిల్లాలోని కరవు పరిస్థితులను అధ్యయనం చేసి చిత్తూరు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాల్సిందిగా జిల్లాలోని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాభావం కారణంగా జిల్లాలో దెబ్బతిన్న ఖరీఫ్ పంటలకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *