జిల్లా టిడిపి ఎమ్మెల్యేలలో టెన్షన్ టెన్షన్
నేడే ఎమ్మెల్యేలతో చంద్రబాబుతో భేటి
నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై చర్చ
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా వినకుండా ఇసుక, ఎర్ర చందనం, రేషన్ బియ్యం, గ్రానైట్, కర్నాట మద్యం, గంజాయి, మద్యం టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యేల అనుచరుల జాబితా చంద్రబాబుకు చేరినట్లు విశ్వసనియంగా తెలుస్తోంది. ఈ విషయాలపై ఎమ్మెల్యేలతో చర్చించడానికి శుక్రవారం చంద్రబాబు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చిత్తూరు, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం కు చెందిన 18 ఎమ్మెల్యేలు ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం.
అధిష్టానం ఆదేశించినా, కొన్ని నియోజకవర్గాలలో అక్రమాలు దందాలు జరుగుతున్నాయి. వీటి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేకంగా పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీకి నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమల మీద చంద్రబాబు నాయుడు రెండు మూడు రకాలుగా నివేదికలను తెప్పించుకున్నట్లు సమాచారం. రాబిన్ సన్ గ్రూప్ నుంచి, ఇంటెలిజెంట నివేదిక, గతంలో నియోజకవర్గ పరిశీలకులుగా వ్యవహరించిన వారి నుంచి, నియోజకవర్గంలోని ముఖ్య నేతలు నుంచి సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా నివేదికను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేల అనుచరుల అనుచరుల వ్యవహార శైలిపైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల అనుచరులు మద్యం, ఇసుక వ్యాపారాల్లో మితి మీరి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు వారికి హెచ్చరికలు చేసారు. ఎవరైనా మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేల అనుచరుల తీరుపై టీడీపీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారు. వారిని కట్టడి చేయాలంటూ చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీల భేటీ ఏర్పాటు చేసారు. ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల జాబితా చంద్రబాబు సిద్దం చేసుకున్నారు. ఎమ్మెల్యేల భేటీ తరువాత వారితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వారిలో చిత్తూరు కూడా ఉన్నట్లు సమాచారం. అక్రమ, అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు వారి కుటుంబసభ్యులూ ఎక్కడా తల దూర్చడానికి వీల్లేదని గట్టిగా చెప్పనున్నారు. తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలను మాత్రం విడి విడిగా ఒక్కొక్కళ్లను పిలిపించి మాట్లాడనున్నారు. ఇప్పటికే వైసీపీ మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. మద్యం టెండర్ల విషయంలోనూ సొంత పార్టీ నేతలు హెచ్చరించిన మారకపోవటాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. వీరి వ్యవహారశైలి క్యాడర్‌కు అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని అలాగే వదిలేస్తే 2014-19 మధ్య జరిగిన తప్పిదమే పునరావృతమవుతుందని పలువురు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అవినీతి ఎమ్మెల్యేలను చంద్రబాబు మందలిస్తారని సమాచారం. అందడంతో జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు టెన్షన్ కు గురవుతున్నారని తెలిసింది. నియోజక వర్గాల అభివృద్ది, ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ సభ్యత్వం ఇతర అంశాలపై మార్గ నిర్దేశనం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని కోరనున్నారు. ఒక నియోజకవర్గంలో పీఏల పాల నడుస్తుందని స్థానిక నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఇటీవల ఒక నియోజకవర్గంలో అక్రమంగా దాచిన ఎర్రచందనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా దాచిన రేషన్ బియ్యంను పట్టుకున్నారు. గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుండగా గనుల శాఖ అధికారులు సీజ్ చేశారు. జిల్లాలో కర్ణాటక మద్యం వ్యాపారం కూడా జోరుగా నడుస్తోంది. పోలీసులు అప్పుడప్పుడు భారీగానే కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాలో గంజాయి కూడా విస్తృతంగా దొరుకుతుంది. కొందరు గ్రానైట్ క్వారీ యజమానులతో మాట్లాడి తమకు వాటా ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇసుక రవాణాల్లో తమ అనుచరుల ట్రాక్టర్లను చొప్పింపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే ల అనుచరులు పలువురు మద్యం టెండర్లలో బాహాటంగా పాల్గొన్నారు. మద్యం షాపులు దక్కించుకున్న వారిని కమీషన్ల కోసం బెదిరిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతున్నది. వి.కోట మండలంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన బడా నాయకులకు నియోజక వర్గాన్ని అప్పగించినట్లు తెలిసింది. ట్రాక్టర్లు, టిప్పర్లు ఉన్న కార్యకర్తల ద్వారా అక్రమ వ్యాపారాలకు తెరతీసారని విమర్శలు ఉన్నాయి. వీరిలో ఒకరిద్దరిని ఇప్పటికే పార్టీ కార్యాలయ సిబ్బంది హెచ్చరించినట్టు సమాచారం. మొదటి సారి హెచ్చరిస్తారని అంటున్నారు. అప్పటికి దారికి రాని వారిని కట్టడి చేయడానికి నియోజకవర్గంలో ఇంచార్జిలను నియమిస్తారు అంటున్నారు.