30, సెప్టెంబర్ 2024, సోమవారం

టిడిపి నేతలతో నామినేటెడ్ పదవుల భయం

ఎక్కడ తమ స్థాయిని తగ్గిస్తారో అని ఆందోళన

మాజీ మంత్రిని డైరెక్టర్ గా నియమించడం పట్ల దిగ్బ్రాంతి 

తమకు డైరెక్టర్ పదవులు ఇస్తే ఏమి చేయాలన్నా సందిగ్ధం 

మొదటి జాబితాతో అసంతృప్తి బహిర్గతం 

ఆచితూచి అడుగులు వేస్తున్న అధిష్టానం


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం నామినేటెడ్ పదవులు అంటేనే భయపడుతున్నారు. ఎక్కడ తమ స్థాయిని తక్కువ చేసే విధంగా డైరెక్టర్, సభ్యుడు పదవులు ఇస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మొదటి జాబితాలో ఒక మాజీ మంత్రికి డైరెక్టర్ పదవి లభించింది. మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ కూడా డైరెక్టర్ అయ్యారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిని కూడా డైరెక్టర్ పదవితోనే సరిపెట్టారు. మాజీ మంత్రులను, మున్సిపల్ మాజీ మేయర్లను డైరెక్టర్ పదవులకు పరిమితం చేస్తుండడంతో రానున్న జాబితాలో తమ పరిస్థితి ఏమిటని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. తమకు నామినేటెడ్ పోస్టులు అవసరం లేదని కొందరు బహిరంగంగానే అంటున్నారు. మరికొందరు తమ స్థాయిని తక్కువ చేసే విధంగా డైరెక్టర్, సభ్యుడు పదవులు ఇస్తే అంగీకరించేది లేదని చెబుతున్నారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో, నామినేటెడ్ పదవుల తదుపరి జాబితా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్న కారణంగా తదుపరి జాబితా విషయంలో అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తమ శ్రమకు గుర్తింపుగా పదవులు వస్తాయని ఆశించారు. ఇప్పుడు సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నామినేటెడ్ పదవులు ఆశించిన టిడిపి నేతలు ఇప్పుడు పదవి అంటే భయపడుతున్నారు. తమ స్థాయిని దిగజార్చే విధంగా పదవుల పందేరం జరిగితే ఏమి చేయాలన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన నామినేటెడ్ పదవుల నియామకం చూసిన కీలక నేతలు కొందరు జడుసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ఆశించిన తమకు డైరెక్టర్, సభ్యుడు లాంటి పదవులు ఇస్తే ఏమి చేయాలి అన్న మీమాంస వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో 20 సంస్థలకు చైర్మన్, డైరెక్టర్ పదవుల నియామకం జరిగింది. ఇందులో ఉమ్మడి జిల్లాకు ఒక చైర్మన్ పదవీ, ఏడు డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఇందులో  తిరుపతికి చెందిన రవి నాయుడుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. చంద్రగిరి మండలానికి చెందిన ఆయన తిరుపతిలో కాపురం ఉన్నారు. విద్యార్థి నాయకునిగా పనిచేసిన ఆయన రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక సారి మంత్రిగా ఉన్న పరసా రత్నంకు రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదవి ఇచ్చారు. చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలతకు కూడా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవితో సరిపెట్టారు. వీరిద్దరూ ఈ పదవి తీసుకోవాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు. కాగా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి నరసింహ ప్రసాద్ తనను  రాష్ట్ర డైరెక్టర్ గా నియమించడాన్ని స్వీకరించ లేక పోతున్నారు. తనకు ఉన్న పార్టీ పదవి చాలని, డైరెక్టర్ పదవి వద్దని సున్నితంగా తిరస్కరించారు. మాజీ ఎంపీ ఎన్ శివ ప్రసాద్ అల్లుడు అయిన ఆయన జగన్ పాలనపై ఎన్నో స్కిట్స్ చేసారు. 2019 ఎన్నికల్లో కోడూరు అభ్యర్థిగా పోటీ చేశారు. డైరక్టర్ పదవి తన శ్రమ, స్థాయికి తగదని ఆయన భావిస్తున్నారు. మిగిలిన వారు కూడా అయిష్టంగానే డైరెక్టర్ పదవులను స్వీకరిస్తారని తెలిసింది. ఉమ్మడి జిల్లాలో చైర్మన్ పదవి కమ్మ సామాజిక వర్గానికి దక్కింది. డైరెక్టర్లుగా ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు బీసీలు, ఇద్దరు బలిజ సామాజిక వర్గం వారికి అవకాశం దక్కింది. కాగా జిల్లాలో రెడ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఇచ్చిన పదవులలో లోకేష్ ముద్ర బాగా కనిపిస్తున్నది. ఆయన తన సన్నిహితులకు పెద్ద పీట వేస్తున్నారన్న భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ఆశిస్తున్న కొందరు నేతలు చిన్న పదవులు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా లేరు. నామినేటెడ్ పదవి కోసం తాను దరఖాస్తు చేయకపోవడమే మంచిది అని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు వ్యాఖ్యానించారు. దరఖాస్తు చేసి ఉంటే తనకు కూడా ఒక డైరెక్టర్ పదవి లభించేదని వ్యంగ్యంగా అన్నారు. ఈ వ్యాఖ్యలు నామినేటెడ్ పోస్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మనోగతాన్ని బహిర్గతం చేస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *