జిల్లాలో ఉత్సాహంగా ప్రారంభమైన పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు
జిల్లాలో రూ. 76.55 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు
కుప్పం నియోజకవర్గంలో రూ.23.58 కోట్లతో అభివృద్ధి పనులు
పలమనేరులో రూ. 14.79 కోట్ల పనులు మంజూరు
సంక్రాంతికి పూర్తి కానున్న పనులు
చిత్తూరు బ్యూరో, (ఆంధ్రప్రభ)
చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో, నియోజకవర్గాల్లో పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలలో శాసనసభ్యులు పాల్గొని పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు, తారు రోడ్లు, పంట కుంటలు, పశువుల షెడ్డులు, ఇంకుడు గుంటల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తున్నారు. ఉత్సాహమైన వాతావరణంలో జిల్లాలో పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో పండుగ వాతావరణంలో ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి.
పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో 76.55 కోట్ల రూపాయల పనులకు శాసనసభ్యులు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ వారోత్సవాలను జిల్లానీటిపారుదల అభివృద్ధి సంస్థ, జిల్లా పంచాయతీ అధికారులు సమన్వయం చేస్తున్నారు. శాసనసభ్యుల రూట్ మ్యాప్ ప్రకారం ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కుప్పం నియోజకవర్గానికి అత్యధికంగా 23.58 కోట్ల రూపాయల పనులను మంజూరు చేశారు. తర్వాత పలమనేరు నియోజకవర్గానికి 14.79 కోట్ల రూపాయల పనులను మంజూరు చేశారు. చిత్తూరు నియోజకవర్గానికి 9.35 కోట్లు, గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి 10 కోట్లు, నగిరి నియోజకవర్గానికి 2.75 కోట్లు, పుంగనూరు నియోజకవర్గం 6.4 6 కోట్లు, పూతలపట్టు నియోజకవర్గంకు 9.64 కోట్ల పనులు మంజూరయ్యాయి. ఈ పనులను శాసనసభ్యులతో కలిసి మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు శంకుస్థాపన చేయనున్నారు. వీటిని సంక్రాంతికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పనులను ద్వామా అధికారులు మంజూరు చేశారు. అవసరమైన నిధులను కూడా ద్వామా అధికారులు సమకూర్చుతున్నారు. పల్లెల్లో మౌలిక వస్తువులను సమకూర్చడానికి, రైతులకు అవసరమైన సిమెంట్ రోడ్లు, తారు రోడ్డు నిర్మాణం, ఇంకుడు గుంటలు, పశువులకు షెడ్లు తదితర నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జిల్లాలో వారం రోజులపాటు ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో పనులకు సంబంధించిన శంకుస్థాపనలు జరగనున్నాయి. శంకుస్థాపన తర్వాత పనుల ప్రారంభము, ప్రగతి గురించి ద్వామా అధికారులు పర్యవేక్షించనున్నారు. సంక్రాంతిలోపు ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులను కూడా విడుదల చేసింది. ఈ అభివృద్ధి పనులతో పల్లెల్లో ప్రగతి పరుగు పెట్టనుంది.