9, అక్టోబర్ 2024, బుధవారం

రాజ్యసభ రేసులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన కిరణ్ కుమార్ రెడ్డి 

కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని ఊహాగానాలు 

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల అప్పగిస్తారని జోరుగా ప్రచారం 

క్రియాశీలకం కానున్న కిరణ్ కుమార్ రెడ్డి

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కెమెరా కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికలలో రాజంపేట నుండి పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి  రాష్ట్ర రాజకీయాలలో అంత క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోయిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన హోదాకు తగిన విధంగా రాజ్యసభకు పంపాలని బిజెపి అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. రెండు రోజుల కిందట కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి పలు విషయాలను చర్చించారు. అందులో ప్రధానంగా రాజ్యసభ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి కేంద్ర అధిష్టానం ఆదేశానుసారం కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసిపి కి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యత్వానికి, ఆ పార్టీకి రాజీనామా చేశారు. అందులో ఒక స్థానం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేటాయిస్తారని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. రాజ్యసభ సభ్యునిగా కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికైన ఆయనకు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర బిజెపి బాధ్యతలు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.


గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. సొంత బలం మాత్రం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా బలాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో రెడ్డి సామాజిక వర్గంపై ఫోకస్‌ చేసి, ఆ కులానికి చెందిన నేతను బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా చేయాలని బిజెపి భావిస్తుంది. అందుకోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాయలసీమకు చెందిన  కీలక నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బిజెపి పగ్గాలు అప్పగించాలని భావిస్తుంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో బిజెపి చెప్పుకోదగ్గ బలాన్ని సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ ఊహించిన విధంగా బలపడలేక పోతుంది. ఇందుకో సరైన నాయకత్వం లేకపోవడమే కారణమని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి రెడ్డి సామాజిక వర్గం చాలా కృషి చేసింది. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ నుంచి  జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ స్థాపించి అత్యధిక మెజారిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కావున రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి బిజెపి రాష్ట్ర బాధ్యతలను అప్పగిస్తే ఆ పార్టీ బలం పుంజుకోగలదని ఆ పార్టీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


 అధికారం కోల్పోయిన తర్వాతవైసిపికి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య తమ పదవులకు రాజీనామాలు చేశారు. అవి ఖాళీ అయ్యాయి. ఎన్నికల సంఘం రేపోమాపో ఉపఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ సందర్భంగా ఆ సీట్లు ఎవరికి కేటాయిస్తారన్నదానిపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే హైకమాండ్ ఈ అంశంపై ఓ స్పష్టతకు వచ్చిందని చెబుతున్నారు. ముగ్గురు పేర్లు ఖరారయ్యాయని.. ఒక స్థానం జనసేనకు, మరో స్థానం బిజెపికి  కేటాయిస్తారని చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కారణంగా బిజెపి రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. ఏపీ ప్రభుత్వంలో బీజేపి భాగస్వామిగా అంటూనే, భవిష్యత్‌లో రాష్ట్రంలో బలపడాలని  కమలనాథుల ఆశిస్తున్నారు. కీలకమైన రెడ్డి సామాజికవర్గంపై ఫోకస్‌ చేశారంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలంటే రెడ్డిల మద్దతు అవసరమని భావిస్తున్న కాషాయదళం మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని రంగంలోకి దింపాలని చూస్తోందని ఆ పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాయలసీమకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు రాజకీయాలకు కాస్త దూరంగా వ్యవహరిస్తూ వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజంపేట నుంచి లోక్‌సభకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేవారని భావించారు. కానీ, ఫలితం వేరేలా వచ్చినందున ఆయన సేవలను పార్టీకి వాడుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న పురందేశ్వరి స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించాలని కలమనాథులు ప్లాన్‌ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పురందేశ్వరి పదవీకాలం త్వరలో పూర్తికానుంది. పురందేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించింది. పురందేశ్వరి ఈ పదవిలో 2026 వరకు కొనసాగనున్నారు. పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ కమిటీ భారత ప్రాంతీయ ప్రతినిధిగానూ నామినేట్ అయ్యారు. దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని ఇప్పటికే ప్లాన్‌ చేస్తున్న బీజేపీ, కిరణ్‌కు ఇష్టం లేకపోయినా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలోని కిరణ్ కుమార్ రెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేయడానికి పురందేశ్వరిని ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్నికల పూర్తయి సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉంది. కర్ణాటక, తెలంగాణ లాగా బిజెపికి రాష్ట్రంలో సొంత బలం, బలగం లేదు. ప్రాంతీయ పార్టీలను నమ్ముకుని రాజకీయం చేయడానికి బిజెపి సిద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా సొంతంగా బలాన్ని పెంచుకోవాలని భావిస్తుంది. ఇందుకు బలమైన సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కిరణ్ కుమార్ రెడ్డి అని బిజెపి అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేకపోయినా ఆయనను ఒప్పించి బిజెపి బాధ్యతలు ఆయనకు అప్పగించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *