నేటి నుండి పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు
ప్రతి పంచాయతిలో గ్రామసభ నిర్వహణ
పనుల మంజురుపై గ్రామ సభల్లో సమాచారం
మంజురైన పనుల ప్రారంభం
20 వరకు కొనసాగనున్న పల్లె పండుగ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో జిల్లా అధికారులు, ప్రజప్రదినిధులు పాల్గొననున్నారు. ప్రతి పంచాయతిలో గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఆ గ్రామానికి మంజూరు చేసిన పనులను వెల్లడిస్తారు. అధికారులు మంజూరు చేసిన పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమలు కోసం ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాల మేరకు, పల్లెల్లో పనులు ప్రారంభిచాలని ఆదేశించారు. పెండింగ్లో సీసీ రోడ్లు, తారు రోడ్లుతో పాటు రైతులకు ఉపయోగపడేలా పంట కుంటలు, పశువుల షెడ్డులు, ఇంకుడు గుంతల నిర్మాణం పనుల్ని చేపట్టనున్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పేరిట సోమవారం ప్రారంభించనున్నారు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నారు. ఆగష్టు 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీల్లో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించారు. దీనికి వరల్డ్ రికార్డ్ దక్కింది. అప్పటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లెల్లో పనులు చేపడుతున్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భారీగా పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కార్యక్రమ నిర్వహణపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కొద్దిరోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లెపండగ – పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల పనులకు భూమి పూజ చేయాలని సూచించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, సర్పంచులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, ఉద్యాన పంటల సాగు, నీటి కుంటలు, గోకులాలు నిర్మించనున్నారు. అలాగే నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచులను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, హార్టికల్చర్, ఫార్మ్ పాండ్లు,గోకులాలు, ట్రెంచులు కొన్ని ప్రారంభం అయ్యాయి. మిగతా పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయనున్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో ఉపాధి హామీ పనుల ఉపయోగంపై ప్రజలకు తెలియజేస్తారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలు తెలియపరిచే సిటిజెన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేస్తారు.