అడ్డదారిపై విజిలెన్స్
బ్యాక్ డోర్ పోస్టుల భర్తీకి శస్ర్త చికిత్స
ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత కమిటీ బిజీబిజీ
చిత్తూరు డీఎంహెచ్ వోకు షాక్
ఆరోగశ్రీ సమన్వయ కర్తపై వేటు
విచారణలో రెండు ఏజెన్సీలు నిమగ్నం
మాజీ మంత్రి పాత్రపై ఆరా
ఆయన కుమారుడిపైనా ఆరోపణలు
బ్యాక్ డోర్ ఉద్యోగుల గుండెల్లో గుబులు
( ఆంధ్రప్రభ , చిత్తూరు బ్యూరో)
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో భారీ స్థాయిలో అవినీతి, అవకతవకలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. గత ఐదేళ్లల్లో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో బ్యాక్ డోర్ ఉద్యోగాల భర్తీపై సమగ్ర విచారణ జరిపించాలని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ కరీముల్లా షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా సర్కిల్ ఇన్స్ పెక్టర్ చంద్రశేఖర్ ను నియమించారు. 2023లో జరిగిన ఉద్యోగాల భర్తీ మీద విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. నోటిఫికేషన్, ఉద్యోగాల భర్తీలో పూర్తి వివరాలను తమకు అందజేయాలని ప్రస్తుత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతిని కోరారు. పలు రికార్డులను ఇప్పటికే పరిశీలించారు. ఈ విషయమై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరిని విచారణ అధికారిగా నియమించారు. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో పలు ఫైళ్లను స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించింది. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా విచారణను ప్రారంభించారు.
డొంక కదిలిందోచ్..
2023 లో చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉద్యోగ నియమకాలు జరిగాయి. ఇందుకు ప్రభుత్వం ఐదు నోటిఫికేషన్ లను విడుదల చేసింది. జనవరి 5న, ఏప్రిల్ 23న, మే 11న, అక్టోబర్ 23న, నవంబర్ 5న వరుస నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ల ద్వారా మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆఫీస్ సబార్డినేట్స్, పారా మెడికల్ సిబ్బంది, టెక్నికల్ సిబ్బందిని భర్తీ చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అప్పటి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జిల్లా వైద్య సేవల సమన్వయకర్త మీద విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన ఉద్యోగుల భర్తీలో అవకతవకలు, అక్రమాలు, అవినీతి, నిబంధనలను పాటించకపోవడం, మెరిట్ ను, రోస్టర్ ను తుంగలో తొక్కి అనర్హులకు ఉద్యోగాలను కట్టబెట్టడం మీద దృష్టిని సారించింది. అప్పటి అవకతవకలకు బాధ్యుడైన జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీహరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రభావతిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమించింది. జిల్లా వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మీద వేటును వేసింది. ఆయనను మాతృ సంస్థ ఆరోగ్యశ్రీ తిరుపతికి పరిమితం చేసింది. జిల్లా వైద్య సేవల సమన్వయకర్తగా నగరిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభావతిని ఇన్చార్జిగా నియమించారు. ఆమె రాజశేఖర్ రెడ్డి నుంచి జిల్లా వైద్య సేవల సమన్వయకర్తగా బాధ్యతలను స్వీకరించారు.
తెర మీదకు మాజీ మంత్రి పాత్ర
గత ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగాల భర్తీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, లక్షలాది రూపాయలు చేతులు మారాయని భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అర్హులను పక్కనపెట్టి, అనర్హులను అందలం ఎక్కించారని, ఇందుకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి తెరవెనక చక్రం తిప్పారని ఫిర్యాదులు అందాయి. తమ అనుచరులకు ఉద్యోగాలు రావడం కోసం తొలిత జారీ చేసిన నోటిఫికేషన్లను సైతం రద్దుచేసి, కొత్తగా నోటిఫికేషన్ ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు సహకరించడానికి అర్హత లేకున్నా జూనియర్ వైద్యుడు శ్రీహరిని వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమించి, తమకు అనుకూలంగా ఉద్యోగాలను ఇప్పించుకున్నారని విమర్శలు వచ్చాయి. తిరుపతిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్త రాజశేఖర్ రెడ్డిని జిల్లా వైద్య సేవల సమన్వయకర్తగా నియమించి అర్హత లేకుండా అందలం ఎక్కించారని విమర్శలు వచ్చాయి. ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల భర్తీలో జరిగిన అవినీతి అవకతవకులపై విచారణకు ఉపక్రమించింది.
ఇక్కడ పెద్దలదే రాజ్యం
చిత్తూరు జిల్లాలో సుమారుగా 820 ఉద్యోగాలను వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. అందులో 200 స్టాఫ్ నర్స్ పోస్టులుగా కాగా, మిగతావి ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్లు కూడా వివాదంగా మారాయి. ఒకటికి రెండుసార్లు నోటిఫికేషన్ రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్లను ఇచ్చి తాము కోరుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం. దరఖాస్తు చేసిన వారిలో సీనియార్టీని పక్కనపెట్టి, సిఫార్సులకు పెద్దపీట వేసినట్లు విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో అప్పటి అధికారులు నిబంధనలను పక్కన పెట్టి, జిల్లాకు చెందిన మాజీ మంత్రికి అనుకూలంగా పనిచేశారని విమర్శలు ఉన్నాయి. జిల్లాకు చెందిన మంత్రి, ఆయన కుమారుడు చెప్పినవారికి ఉద్యోగాలను కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం సుమారుగా 2500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కాంట్రాక్టు పద్ధతులు ఈ ఉద్యోగాలను ఇచ్చారు. వారికి అనుకూలంగా ఉద్యోగాలు ఇవ్వడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలోని వ్యక్తిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా, జిల్లా ఆరోగ్య సమన్వయకర్తగా నియమించి అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది.
పుంగనూరుకే పెద్ద పీట
వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేసిన పోస్టులలో ఎక్కువ పుంగనూరు ప్రాంతానికి ఉన్నాయని సమాచారం. కొంతమంది అధికారులు మాజీ మంత్రి సిఫారసుతోపాటు తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చి, ఒక్కొక్కరి నుండి మూడు లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇదే విధంగా నిబంధనలను, మెరిట్ ను, పక్కనపెట్టి తమకు అనుకూలమైన వ్యక్తులకు ఉద్యోగాలను ఇచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. మాజీ మంత్రి చెప్పినట్లు అప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఉన్న ప్రకాశం చేయడానికి నిరాకరించడంతో, ఆయనను సెలవుల్లో వెళ్ళమని తమకు అనుకూలంగా ఉన్న శ్రీహరిని ఇన్చార్జిగా నియమించి, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో భారీ ఎత్తున పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదుల అందినా, స్పందించలేదు. లోకాయుక్త కూడా ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల మీద దృష్టిని సాధించారు.
ఆ ఫైళ్లు లేవట.. వాళ్లే తీసుకెళ్లారట
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీలో అవినీతి అక్రమాలపై
ఫిర్యాదులను పరిశీలించి వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చిత్తూరు జిల్లాలో ఉద్యోగ నియమకాల ఫైళ్ళను తమకు అందజేయాలని కోరారు. ఇందుకు ప్రస్తుత జిల్లా వైద్య శాఖ అధికారులు సమాధానం ఇస్తూ, ఆ ఫైళ్లు ఏవి తమ వద్ద లేవని, ఉద్యోగాలు ఇచ్చిన అధికారులు ఆ ఫైళ్లను తీసుకెళ్లారని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల నియామకంలో ముందుగా ప్రొవిజనల్ జాబితా విడుదల చేయలేదని సమాచారం. అడ్డగోలుగా తమకు నచ్చిన వ్యక్తులకు నచ్చిన విధంగా పోస్టింగులు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయంగా భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తమకు నచ్చినవారికి పోస్టింగ్ చెప్పించుకోవడానికి జిల్లా వైద్య శాఖ అధికారిని, జిల్లా వైద్య సేవల సమన్వయకర్తను పావులుగా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయాల మీద ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా వైద్య సేవల సమన్వయకర్త మీద వేటు పడింది. విచారణ పూర్తయితే మరికొందరు అధికారుల మీద వేటుపడే అవకాశాలుు ఉన్నాయి. అలాగే ఆక్రమంగా ఉద్యోగాలు పొందిన పలువురు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.