జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి
పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా కట్టడి చేయడమే లక్ష్యం
టిడిపిని స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయడమే వ్యూహం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాయచోడు నుంచి గెలుపొందిన రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన వెలువడింది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టడి చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రాంప్రసాద్ రెడ్డిని జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ గా నియమించినట్లు తెలుస్తోంది. తొలినుంచి జిల్లా వ్యవహారాలను రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సమయంలో కూడా రాంప్రసాద్ రెడ్డి హాజరవుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతరేకి అయిన రాంప్రసాద్ రెడ్డిని ఆచితూచి జిల్లా ఇన్చార్జి మంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి రాంప్రసాద్ రెడ్డి సరైన వ్యక్తి అని ముఖ్యమంత్రి భావించినట్లు తెలుస్తోంది. కావున చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పరిచయాలు ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాంప్రసాద్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఆధిపత్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని, తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి రాంప్రసాద్ రెడ్డిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో తనకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కట్టడి చేయడానికి సిఎం చంద్రబాబు నాయుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి తనకు ప్రత్యర్థిగా ఉన్న పెదిరెడ్డిని ఎదుర్కొనే సమర్ధులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. త్వరలో ఇవ్వబోయే నామినేటెడ్ పదవులలో కూడా ప్రాధాన్యత కల్పిస్తారని తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగా రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి గెలుపొందిన ఆయన మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకి. ఆయన గండికోట శ్రీకాంత్ రెడ్డిపై 2,495 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయినా ఆయన పోరాట పటిమ నచ్చి చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు జిల్లా ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో చంద్రబాబు మదనపల్లి, పుంగనూరు నియోజక వర్గాలలో ప్రాజెక్టుల పరిశీలన కోసం వచ్చిన సందర్భంలో వైసిపి నేతలు అల్లర్లు సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులను అడ్డు పెట్టుకొని టిడిపి నేతలపై దాడులకు తెగబడ్డారు. ఆ దశలో రాంప్రసాద్ రెడ్డి అనుచరులు చంద్రబాబుకు అండగా నిలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనుషులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో రాంప్రసాద్ రెడ్డి ప్రదర్శించిన ధైర్య సాహసాలు చంద్రబాబును ఆకట్టు కున్నాయి. దీనితో ఆయనకు మంత్రి పదవితో పాటు ఇంచార్జి బాధ్యత అప్పగించారు. జిల్లాలో ఉన్న ఏడు నియోజక వర్గాలలో పుంగనూరు నుంచి వైసిపి అభ్యర్థి రామచంద్రా రెడ్డి విజయం సాధించారు. మిగిలిన ఆరు చోట్ల చంద్రబాబుతో సహా టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో పలమనేరు నుంచి గెలిచిన ఎన్ అమరనాద రెడ్డి మంత్రి పదవి ఆశించారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కొన్ని రాజాకీయ కారణాల వల్ల ఆయనకు పదవి ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఆయన తమ్ముడు శ్రీనాథ్ రెడ్డి, మరదలు అనీషా రెడ్డి వైసిపికి చేరి పెద్దిరెడ్డి విజయానికి కృషి చేసారు. అలాగే అమరనాద రెడ్డి పెద్దిరెడ్డిని ఓడించడానికి తగిన కృషి చేయలేదని చంద్రబాబు భావించారు. ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవులలో నియామకంలో కూడా జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి వ్యతిరేకులకు ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. పెద్దిరెడ్డి పాటు మాజీ ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, మంత్రి రోజా రెడ్డి లాంటి బలమైన నాయకులను ఎదుర్కునే నాయకుల అవసరం ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి జి డి నెల్లూరులో పోటీ చేసి టిడిపి అభ్యర్ధి డాక్టర్ వి ఎం థామస్ చేతిలో ఓటమి పాలయ్యారు. రోజా నగరిలో టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో ఘోర పరాభవం చవి చూశారు. అయినా ఆ నేతలు ఇద్దరూ కూటమి పరిపాలనపై తరచూ విమర్శలు సందిస్తున్నారు. రోజను వైసిపి అధికార ప్రతినిధిగా నియమించారు. రెండేళ్లలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి నేతలను ఎదుర్కోవడానికి సమర్ధుడైన ఒక రెడ్డి నేతకు పదవీ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీని కోసం తొలి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యతిరేకులైన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి కె బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సి కె బాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రామచంద్రా రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించారు. డిసిసి అధ్యక్షుడు అయిన పెద్దిరెడ్డిని చిత్తూరులో సమావేశం కూడ పెట్టకుండా నిలువరించారు. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. జిల్లాలో రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సీకే బాబు ముద్రపడ్డారు. ఆ కారణంగానే ఆయనను వైసిపి నుంచి బయటకు పంపించారు. అప్పటిలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుధాకర్ రెడ్డి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పని చేసారు. ఈ నేపథ్యంలో వీరిలో ఒకరికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి, మరొకరికి మార్చిలో ఖాలీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే జిల్లాకు చెందిన బలిజ, బిసి ఇతర సామాజిక వర్గాలకు చెందిన మరో ఇద్దరికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి, కొందరికి జిల్లా స్థాయి పదవి ఇస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పోటీ చేసి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డి కూడా పదవిని ఆశిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో చల్లా బాబు అనుచరించిన వైఖరి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చల్లా బాబుకు వ్యతిరేకంగా పలువురు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో మంత్రి లేని లోటును భర్తీ చేయడానికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆచితూచి వ్యవహరిింనున్నట్లు సమాచారం. బలమైన నేతకు రాష్ట్రస్థాయి పదవుని ఇచ్చి, జిల్లా నాయకత్వాన్ని కూడా అప్పగించే అవకాశం ఉందని జిల్లా టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి.