26, అక్టోబర్ 2024, శనివారం

పెరుగుపోతున్నపెళ్లికాని ప్రసాదులు

 మెజార్టీ కమ్యూనిటీల్లో అమ్మాయిల కొరత 

కష్టమవుతున్న పెండ్లి సంబంధాలు 

పరిచయ వేదికలకు పెరుగుతున్న క్యూ 

అబ్బాయిల తల్లిదండ్రుల్లో ఆందోళన 

భవిష్యత్‌లో  కన్యాశుల్కం తప్పదా ?

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

మూడుముళ్లతో ఏకం కావాలని కోరుకునే ఎంతో మంది అబ్బాయిలకు ఇటీవలి కాలంలో జోడి దొరకడం లేదు. మూడు పదుల వయసు దాటుతున్నా పెండ్లి కావడం లేదు. ఒకటి రెండు కాదు మెజార్టీ కమ్యూనిటీల్లో అమ్మాయిల కొరత వేధిస్తున్నది. ఫలితంగా పెళ్లికాని ప్రసాదుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కొన్ని కమ్యూనిటీల్లో ఉన్నా.. యువతుల అభిరుచులకు అబ్బాయిలు సరిపోక అక్కడా సమస్యే వస్తున్నది. ఎటొచ్చీ తమ శ్రీమతి కోసం యువకులు పడుతున్న పాట్లను చూసి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. జిల్లా బాలబాలికల నిష్పత్తిని ఓ సారి నిశితంగా పరిశీలిస్తే.. భవిష్యత్తులో కన్యాశుల్కం తప్పదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

పెళ్లి అనే  శుభఘడియల కోసం ఎంతో మంది అబ్బాయిలు ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం కనిపించిన మ్యారేజ్ బ్యూరోల తలుపులు తట్టుతున్నారు. మధ్యవర్తులకు  వేల నుండి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో  అందజేస్తున్నారు. అబ్బాయిల అవసరాన్ని ఆసరాగా తీసుకుని పలు మ్యారేజ్ బ్యూరోలు సోమ్ము చేసుకుంటున్నాయి. పెళ్లి సంబంధాలను కుదరచడంలో మాత్రం విఫలమవుతున్నాయి. దీంతో ఆన్ లైన్ లో  కనిపించిన ప్రతి మ్యారేజ్ బ్యూరో పోర్టర్ లో  తమ బయోడేటాను పొందుపరుస్తున్నారు. వేలాది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో చెల్లిస్తున్నారు. తమకు వచ్చిన ప్రతి ప్రొఫైల్ ను కాంట్రాక్ట్ చేస్తున్నారు. అబ్బాయికి ఆస్తి లేదని, జీతం తక్కువ, బట్టతల ఉందనో, పొట్ట ఉందనో ఏదో ఒక కారణంతో అమ్మాయిలు అబ్బాయిలను రిజెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అమ్మాయిలని ఇస్తామని కొంతమంది తేల్చి చెప్తున్నారు. మరి కొందరు ఆస్తిపాస్తులు భారీగా ఉండాలని షరతులు పెడుతున్నారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించిన తొలుత ఉన్న ఉత్సాహము అబ్బాయిలలో, వారి తల్లిదండ్రులు క్రమంగా కనుమరుగు అవుతుంది. మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ, మిడియేటర్ల  చుట్టూ తిరగలేక అబ్బాయిలు తల్లిదండ్రులు విసిగిపోతున్నారు. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులే వారి పిల్లలకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. మూడు పదులు  దాటిన తర్వాత కులం, గోత్రం పట్టింపు లేకుండా ఎవరైనా పర్వాలేదని పరిస్థితికి అబ్బాయిలు వస్తున్నారు. తక్కువ కులమైన, ఉద్యోగం లేకున్నా, చదువుకు సంబంధం లేకుండా పెళ్లికి సిద్ధమైపోతున్నారు. అవసరమైతే అమ్మాయిల తల్లిదండ్రులకు ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకుని పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఏదో ఒక సంబంధం చూసి వివాహం చేసుకుంటున్నారు.

*చాలా కులాల్లో అమ్మాయిల కొరత*

జిల్లాలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన కమ్మ, బ్రాహ్మణ, కరణం, వైశ్య, పద్మశాలి, మొదలియార్  కమ్యూనిటీల్లో అమ్మాయిల కొరత అధికంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని.. ఆ సంఘాలు ఓ ఆలోచన చేసి.. వధూవరుల వివరాల సేకరణకు సంఘం ఆధ్వర్యంలో ఒక రిజిస్టర్‌ నిర్వహిస్తున్నారు. అయితే, వీటిల్లో అబ్బాయిలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నారు. అబ్బైలతో పోల్చితే, అమ్మాయిలు 10వ శాతం కూడా నమోదు కావడం లేదు.  వెలమ, రెడ్డి, మున్నూరుకాపు, ఎరుకల, యానాది, పిచ్చిగుండ్ల, క్షత్రియ, పాల ఏకిరి తదితర  కమ్యూనిటీల్లోనూ అమ్మాయిల కొరత కనిపిస్తున్నది. ఆయా సామాజికవర్గాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయా కుల సంఘాలు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నాయి. వీటికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. అంతే కాదు, ఆయా కుల సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడికీ సమాచారం ఇస్తూ.. పరిచయ వేదికల విషయాన్ని తెలియజేస్తున్నాయి. వేదికలు ఏర్పాటు చేసే రోజు ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ తరహా పరిచయ వేదికలకు అబ్బాయిలు క్యూ కడుతున్నారే తప్ప.. అమ్మాయిల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.

*శృతి మించుతున్న అమ్మాయిల ఆశలు*


అబ్బాయి మంచి విద్యావంతుడై ఉండి, మంచి ఉద్యోగం, ఆస్తులు ఉన్న వారిపట్ల అమ్మాయిల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి. ఒక్కడే కొడుకు ఉండాలి. లక్షకు పైగా జీతం ఉండాలి. ఆడపడుచులు ఉండకూడదు. పెళ్లి అయితే, వేరు కాపురం పెట్టాలి. ఆస్తులు తమ అమ్మాయి పేరు మీద రాయాలి అంటూ సవాలక్ష షరతులు పెడుతున్నారు. కొంత మంది అబ్బాయిల తల్లిదండ్రులు కూడా హద్దు మీరి కోరికలు కోరుతున్నారు. కట్నంతోపాటు బంగారం, భూములు ఇవ్వాలంటూ షరతులు పెడుతున్నారు. అయితే, ఈ షరతులు పెట్టే బంధాలను అమ్మాయిల తల్లిదండ్రులు పెద్దగా ఒప్పుకోవడం లేదు. దీంతో మూడు నాలుగు సంబంధాలు దూరమయ్యాక, ఆ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో అన్ని అర్హతలున్నా కొంత మంది అబ్బాయిలు కూడా పెళ్లికాని ప్రసాదుల్లా ఉండిపోవాల్సి వస్తున్నది.

*అమ్మాయికి నచ్చితేనే పెళ్లి*

ఇటీవలి కాలంలో యువతుల అభిరుచులూ మారుతున్నాయి. గతంలో అమ్మాయి తరఫువారికి అబ్బాయి నచ్చితే సరిపోయేది. కానీ, ఇప్పుడు అమ్మాయిలకు నచ్చితేనే పెండ్లికి ఓకే చేస్తున్నారు. అబ్బాయి వయసు, సంపాదన, బ్యాక్‌గ్రౌండ్‌ ఇలా అన్నీ చూసుకున్న తర్వాతనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కుటుంబాలను కోరుకునేందుకు ఇష్టపడడం లేదు. పెళ్లి కాగానే వేరు కాపురం పెడుతారా..? లేదా..? అన్న కోణంలోనే అమ్మాయిలు చూస్తున్నట్లుగా ఇటీవల జరిగిన అనేక సర్వేల్లో బయటపడింది. దీంతో ఎక్కువగా ఉమ్మడి కుటుంబంలోనే పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నట్లు ఆయా కుల పెద్దలు చెబుతున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులూ ఇదే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. తమ బిడ్డకు కష్టం వాటిల్లకుండా ఉండాలన్న తపననే ప్రదరిస్తున్నారు తప్ప.. ఉమ్మడి కుటుంబం వల్ల జరిగే ప్రయోజనాలను చాలా మంది పిల్లలకు వివరించడం లేదని సామాజిక తత్వవేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, భవిషత్తులో వివాహ వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అందోళన చెందుతున్నారు.





అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *