పార్టీ పటిష్టత మీద చంద్రబాబు దృష్టి
సమర్థ నేత కోసం అన్వేషణ
నేటి నుండి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం
పూర్తికాగానే జిల్లాకు నూతన కార్యవర్గం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
సొంత జిల్లా చిత్తూరులో పార్టీ పటిష్టత మీద ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిని పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షుడిని, జిల్లా కార్యవర్గాన్ని, అనుబంధ సంస్థల అధ్యక్షులను, కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. చిత్తూరు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ పార్టీ పటిష్టత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో సమర్థమైన నాయకత్వం లేకపోవడంతో అప్పుడప్పుడు పార్టీ పరాజయాన్ని చవిచూస్తోంది. మరో రెండు సంవత్సరాల్లో జమిలి ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని పట్టిష్టం చేయాల్సిన అవసరం చంద్రబాబునా గుర్తించినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో వైసిపి నాయకులు మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ప్రస్తుతం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డిలను సమర్థవంతంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవైపు ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ, మరోవైపు పార్టీని పటిష్టం చేస్తూ, ఇంకొక వైపు పార్టీ శాసనసభ్యులను, ఇతర ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పార్టీని నడపాల్సిన అవసరం ఉంది. ఇందుకు సమర్ధుడైన నాయకుడిని అన్వేషిస్తున్నారు. మాజీ మంత్రి, చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జిల్లాలోని పుంగనూరు నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి ఆర్ కె రోజా వైసిపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు అడుగడుగునా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చిత్తూరు జిల్లాలో టిడిపిని దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. దీనికై తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమించారు. మాజీ మంత్రి కె నారాయణ స్వామి, మాజీ ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చి జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా నిర్మాణం చేయాలని చూస్తున్నారు. అయితే టిడిపిలో పరిస్తితి కొంత నిరాశాజనకంగా ఉంది. చంద్రబాబు మినహా మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యునికి సమన్యయం లేదు.అత్యదిక మెజారిటితో గెలుపొందినా, ప్రజలకు అందుబాటులో ఉన్నది తక్కువన్న విమర్శలు ఉన్నాయి. శాసనసభ్యులు కొందరు సంపాదనే ద్యేయంగా ఇసుక, గ్రానైట్, కలప అక్రమ వ్యాపారులతో చేతులు కలిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొందరు మద్యం దుకాణాల యజమానులను బెదిరిస్తున్నట్టు సమాచారం. ముగ్గురు ఎమ్మెల్యేల పని తీరు ఆశించిన మేరకు లేదు. అన్ని అంశాలపై చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నెల 18 వ తేదీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాప్రతినిధుల సభలో చంద్రబాబు ఈ విషయాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా వేశారు. ఇప్పటి పరిస్థితులను పరిశీలిస్తే శనివారం నుంచి ప్రారంభం కానున్న పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం కూడా నత్త నడకన సాగే అవకాశం ఉందని కార్యకర్తలు చెపుతున్నారు. ఎమ్మెల్యేలు సరిగా పట్టించుకోక పోవడం, నామినేటెడ్ పదవులు ఇంక ఇవ్వక పోవడం లాంటి అంశాలు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలలో నిరాశకు కారణంగా కనిపిస్తోంది. వీటిని చక్కదిద్దక పోతే రెండేళ్లలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఒక వేళ 2027 లో జమిలీ ఎన్నికలు వస్తే కూడా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి సమయం పార్టీ కోసం పనిచేసే డైనమిక్ నాయకుడికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిసింది. పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన విధంగా రాష్ట్ర స్థాయిలో కేబినెట్ హోదా గల నామినేటెడ్ పదవి కూడా ఇవ్వాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పలమనేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎన్ అమరనాద రెడ్డి, చిత్తూరు మాజీ ఎమ్మెల్యేలు సి కె బాబు, ఎ ఎస్ మనోహర్, పెనుమూరుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే మాజీ మంత్రి ఎన్ అమరనాద రెడ్డికి రాష్ట్రంలో కీలక పదవీ అప్పగించే అవకాశం ఉందని సమాచారం. అమరనాధ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు, అయన జిల్లాలో క్రియాశీలకం అయితే, జిల్లాలో పరిస్థుతులు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.