కరవు మండలాల్లో దంచికోట్టిన అకాల వర్షాలు
తవణంపల్లి మండలంలో నాలుగు చోట్ల దెబ్బతిన్న కాజ్ వేలు
పొంగి పొర్లిన బాహుదా, గార్గేయ నదులు
పూర్తిగా నిండిన ఎన్టీఆర్ జలాశయం
గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలుతున్న అధికారులు
ప్రవాహాన్ని ప్రారంభించిన నీవా నది
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
నిత్యం కరువుతో సతమతమయ్యే ఐరాల, తవణంపల్లి మండలాల్లో భారీ వర్షాలు దంచి కొట్టాయి. మండలంలో కురిసిన అకాల వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బాహుదా, గార్గేయ నదులు కూడా తన ప్రవాహాన్ని ప్రారంభించాయి. బహుదానది ఉదృతంగా ప్రవహించడంతో ఒకచోట కాజ్ వే పూర్తిగా దెబ్బతింది. మరో మూడు చోట్ల కాజ్ వేలు పాక్షికంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బాహుదా, గార్గేయ నదులు ప్రవహించడంతో చిత్తూరు ఎన్టీఆర్ జలాశయానికి వరదనీరు భారీగా చేరింది. చిత్తూరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. చిత్తూరు జలాశయానికి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఇరిగేషన్ అధికారులు రెండు గేట్లను ఎత్తి నీళ్లను కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నీవా నది కూడా తన ప్రవాహాన్ని ప్రారంభించింది. పూర్తిగా నిండిన ఎన్టీఆర్ జలాశయానికి బుధవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ జల హారతులు ఇచ్చి ఘనంగా సారే అందజేశారు. తవణంపల్లి మండలంలో దెబ్బతిన్న కాజ్ వేల పునరుద్ధరణను ఆర్ అండ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
ఐరాల, తవణంపల్లి మండలాలు ఎప్పుడు కరువుతో సతమతమవుతూ ఉంటాయి. సకాలంలో వర్షాలు పడవు. పంటలు చేతికి రావు. జిల్లాలో ఎప్పుడు కరువు మండలాలను ప్రకటించినా, ఐరాల, తవణంపల్లి కచ్చితంగా ఉంటాయి. అలాంటి ఈ రెండు మండలాల్లో గత వారం రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు లేవు. తుఫాను ప్రభావం కూడా జిల్లా మీద లేదు. ఆయనా, ఈ రెండు మండలాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఐరాల మండలంలో ఈనెల మూడవ తారీఖున 120.8 మిల్లీమీటర్ల, 20న 56.7, 21న 25.2, 22న 8.2, 23న 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో ఐరాల సమీపంలోని గార్గేయ నది ఉదృతంగా ప్రవహించింది. ఐరాల తాసిల్దార్ కార్యాలయం వద్ద కాజ్ వే మీద కూడా నీరు ప్రవహించింది. దీంతో కొంత సమయం వాహనాల రాహపోకలను కూడా నిలిపివేశారు. మండలంలో చిన్నాచితక వంకలు కూడా ప్రారంభమయ్యాయి. తవణంపల్లి మండలంలో ఈనెల మూడవ తారీఖున 36.4 మిల్లీమీటర్లు, 5వ తేదీన 22, 14వ తేదీన 24.2, 15న 14, 16న 26, 20న 37.4, 22న 103.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో అరగొండ నుంచి ప్రారంభమయ్యే బహుదానది ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ నెల 21న పడిన భారీ వర్షాలకు అరగొండ - తొడతర కాజ్ వే పూర్తిగా దెబ్బతింది. 20 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. వెంటనే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూర్ ఆర్డీవో శ్రీనివాసులు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ అధికారులు పర్యటించారు. అలాగే అరగొండ, గాజులపల్లి, పుణ్య సముద్రం వద్ద కూడా కాజ్ వేలు 75 శాతం దెబ్బతిన్నాయి. ఇక్కడ కూడా తాత్కాలికంగా రాకపోకులను నిలుపుదల చేసి, మరమ్మతులను చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ అండ్ బి అధికారులు యుద్ధ ప్రాతిపదికన కాజ్ వేల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. అరగొండ గాజులపల్లి మధ్య కూడా కాజ్ వే దెబ్బతిండడంతో స్థానికులు ఆ రహదారిలో రాకపోకలను నిలిపివేశారు.
ఐరాల, తవణంపల్లి మండలాల నుంచి బాహుదా, గార్గేయ నదులు ప్రవహించడంతో చిత్తూరు పట్టణానికి తాగునీటి తాగునీటి అవసరాలకు నిర్మించిన ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. చిత్తూరు పరిసర మండలాల్లో భారీ వర్షాలు కురువకపోయినా, ఐరాల, తవణంపల్లి మండలాల్లో పడిన వర్షాల కారణంగా ఎన్టీఆర్ జలాశయం నిండుకుండను తలపిస్తుంది. ఎన్టీఆర్ జలాశయం పూర్తి నీటిమట్టం 294.25 మీటర్ల కాగా ఇప్పటికీ 294.1 మీటర్ల లోతు నీళ్లు చేరింది. అంటే పూర్తిగా నిండిపోయింది. ఇప్పటికి 500 క్యూసెక్కుల నీరు ఎన్టీఆర్ జలాశయంలోకి ప్రవేశిస్తుంది. ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇరిగేషన్ అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. 255 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో నీవా నది కూడా ప్రవహిస్తుంది. ఐరాల, తవణంపల్లి మండలాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో ఎన్టీఆర్ జలాశయం పూర్తిగా నిండిపోయింది. మండలాల్లోని చిన్న చిన్న వాగులు, వంకలు కొంతమేరకు సాగుతున్నాయి. ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఈ మండలాల్లో చెరువులో నిండి రానున్న కాలంలో తాగు, సాగునీటి సమస్య తీరే అవకాశం ఉంది.
పో రై గంగ 1 ఐరాల మండలంలోని గార్గేయ నది ప్రవాహం (ఫైల్ ఫోటో)
గంగ 2 అరగొండ వద్ద దెబ్బతిన్న కాజ్ వే
గంగ 3 అరగొండ గొల్లపల్లి రహదారి మూసివేత
గంగ 5 పూర్తిగా నిండిన ఎన్టీఆర్ జలాశయం