ఎమ్మెల్సీ బరిలో ముగ్గురు టిడిపి నేతలు
బలిజ సామాజిక వర్గం నుండి ఏ ఎస్ మనోహర్
రెడ్డి సామాజిక వర్గం నుండి సీకే బాబు, ఎన్ బి సుధాకర్ రెడ్డి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
వైసిపి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ రాజీనామాతో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ పదవిపై జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు విజయాన్ని కృషి చేసిన వీరు తమకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి బలిజ కులస్తులకు ప్రాధాన్యత లేకపోవడం, రెడ్ల ప్రాధాన్యత తగ్గడంతో ఈ పర్యం ఈ రెండు కులాల వారికి ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలతో ప్రాధాన్యత ఇవ్వాలని బలిజ కులానికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు చూస్తే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ పేరు అగ్స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. పెద్దిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఆయన రాజకీయ శత్రువు అయిన సీకే భవనం బలపేతం చేయాలని మరికొందరు భావిస్తున్నారు. వైసిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రోజాను దీటుగా ఎదుర్కోవాలంటే, పార్టీ పైన వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ, పార్టీకి వెన్నుదండగా నిలుస్తున్న ఎన్ బి సుధాకర్ రెడ్డి పేరును మరి కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత పటిష్టంగా లేదు. జిల్లాలో సమన్వయం కూడా కొరవడింది. పార్టీని ముందుండి నడిపించే నాయకత్వం కూడా కరువైంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ పదవి అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుందని రాజకీయ పరిశీలన భావిస్తున్నారు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ నియామకంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యేలు సి కె బాబు, ఏ ఎస్ మనోహర్, అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వైసిపి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నెల రోజుల క్రితం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అయితే మండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఇంతవరకు ఆమోదించ లేదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన ఆమె గవర్నర్ ను కలసి ఇష్ట పూర్వకంగానే రాజీనామా చేసినట్టు తెలపనున్నారు. ఆమోదం తెలిపిన వెంటనే ఆమె టిడిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి చంద్రబాబు కూడా సమ్మతించారు. అయితే తిరిగి ఆమెకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో చంద్రబాబు స్వంత జిల్లా అయిన చిత్తూరు నేతలు ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడి రాజాకీయ పరిస్థితులను బట్టి జిల్లా వ్యక్తికి ఎమ్మెల్సీ పదవీ ఇస్తారని భావిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి జిల్లా లోని పుంగనూరు నుంచి నాలుగవ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత పాలనలో తిరుగులేని శక్తిగా చక్రం తిప్పారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నుంచి మూడవ సారి విజయం సాధించారు. వారి ప్రభావం ఇప్పటికీ జిల్లాలో ఎక్కువగానే ఉంది. మాజీ మంత్రి ఆర్ కె రోజా నగరిలో ఓటమి చవి చూసినప్పటికీ వైసిపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆమె నిత్యం కూటమి ప్రభుత్వం, నేతలపై విమర్శల వర్షం కురిపిస్తోంది. అలాగే జిల్లాకు చెందిన భరత్, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. జిల్లా పరిషత్, అన్ని మున్సిపాలిటీల ఛైర్మన్ ల, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మెజారిటీ సర్పంచ్ లు వైసిపి వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసిపి నేతలను ఎదుర్కోవడానికి గట్టి నాయకునికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. దీనితో మాజీ ఎమ్మెల్యే సి కె బాబు పేరును కొందరు తెరపైకి తెచ్చారు. విద్యార్థి నాయకునిగా ఎదిగిన ఆయన నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో టిడిపి టికెట్టు ఆశించి పార్టీలో చేరినప్పటి అవకాశం దొరకలేదు. ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గురజాల జగన్ మోహన్ నాయుడు గెలుపు కోసం కృషి చేసారు. పెద్దిరెడ్డి బద్ద శత్రువు అయిన ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే మంచిదని కొందరు అంటున్నారు. కాగా మరో మాజీ ఎమ్మెల్యే ఏ ఎస్ మనోహర్ పేరు కూడ పరిశీలనలో ఉందని తెలిసింది. ఆయన 2004 లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మూడు సార్లు ఓటమి పాలయ్యారు. చిత్తూరు మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు. జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి సరైన ప్రాధాన్యత లేనందున ఆయనకు అవకాశం దక్కుతుందని కొందరు భావిస్తున్నారు. పెనుమూరుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని తొలినుంచి చంద్రబాబును కోరుతున్నారు. సైకాలజిస్ట్ అయిన ఆయనకు 2020 లో అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. అందరూ భయపడుతున్న దశలో ఆయన వైసిపి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. 1983 లో పుత్తూరు నుంచి జనతా అభ్యర్థిగా, 2011 లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసారు. గత ఎన్నికల్లో తనకు గాని తన కుమారుడు హర్ష వర్ధన్ రెడ్డికి గాని నగరి లేదా చంద్రగిరి టికెట్టు కావాలని కోరారు. అయితే చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా నుంచి అభ్యర్థి ఎంపికలు ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. కులాల సమీకరణతో పాటు పార్టీ పటిష్టత కూడా దృష్టిలో పెట్టుకొని అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చంద్రబాబునాయుడు ప్రాధాన్యత ఇస్తారా? ఇస్తే ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.
పో రై గంగ 1 ఏ ఎస్ మనోహర్,
గంగ 2 సికె బాబు
గంగ 3 ఎన్ బి సుధాకర్ రెడ్డి