ఉచిత గ్యాస్ పధకం ఎవరికీ వర్తిస్తుంది ?
జిల్లా కేంద్రానికి అందని ఆదేశాలు
దీపం పధకానికి వర్తిస్తుందని కొందరు
తెలుపు రంగు రేషన్ కర్డుదరులకని మరి కొందరు
ప్రభుత్వం 'అర్హులకు' అనడంతో సందేహాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
దీపావళి నుండి రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా, ఇప్పటివరకు ఈ పధకానికి సంబంధించిన మార్గదర్శకాలు జిల్లా కేంద్రాలకు అందలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ లను అర్హులకు అందచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఎవరి అర్హులు అన్న విషయంలో జోరుగా ఉహాగానాలు కొనసాగుతున్నాయి. ఉచిత గ్యాస్ పథకాన్ని అందరికీ అమలు చేస్తారా లేక ఒక వర్గానికి మాత్రమే అమలు చేస్తారా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. అలాగే మూడు రకాల గ్యాస్ కనెక్షన్ లలో ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది అన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం జిల్లాలో అధికారులు ఎదురుచూస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో 47 వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిల్లో 5.80 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే, ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. కోటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి నాలుగు నెలల పాలన పూర్తిచేసుకుంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏ వర్గాలకు ఈ పథకం అమలు అవుతుందో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదు. గ్యాస్ కనెక్షన్లలో మూడు రకాలు ఉన్నాయి. సాదరణంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు, దీపం పథకం కింద తీసుకున్నవారు, ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం కింద గ్యాస్ పొందినవారు. ఈ మూడు వర్గాలలో ఎవరికి వర్తిస్తుంది అన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. అలాగే నిరుపేద కుటుంబాలకు మాత్రం అమలవుతుందా లేక ధనికులకు కూడా అమలు చేస్తారా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదు. పేదరికంలో ఉన్న వైట్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పధకం అమలు అవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కూడా టిడిపి నాయకులు భయపడుతున్నారు. అలాగే ప్రధానమంత్రి ఉజ్జల గ్యాస్ పథకం కింద ఇప్పటికే 200 రూపాయల సబ్సిడీని అందజేస్తున్నారు. కావున ఈ పథకం కింద ఉన్న లబ్ధిదారులకు వర్తిస్తుందా లేదా అన్నది స్పష్టత రాలేదు. డ్వాక్రా మహిళలకు మంజూరు చేసిన దీపం పథకం వరకు మాత్రమే ఉచిత సిలిండర్ల పథకం వర్తిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ ల అమలు విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్యాస్ సిలిండర్ల విషయంలో పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకున్న వ్యక్తులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఆధార కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు, నివాస ద్రువికరణ పత్రం అందజేయాలని ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పథకాన్ని ఒక వర్గానికో లేక దీపం కనెక్షన్ ఉన్నవాళ్ళకు పరిమితం చేస్తే ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం పార్టీకి భవిష్యత్తులో మంచిదన్న అభిప్రాయం ప్రజలలో, టిడిపి నేతలు వ్యక్తం అవుతుంది. పొదుపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని కోతలు విధిస్తే కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో నష్టపోతుందని అభిప్రాయపడుతున్నారు.