పెద్దిరెడ్డి పోయే ... కరుణాకర్ రెడ్డి వచ్చే
జిల్లాలో సంస్థాగతంగా చాతికిలపడ్డ వైసిపి
నెల రోజులైన అధ్యక్ష భాధ్యతలు చేపట్టని పెద్దిరెడ్డి
జిల్లా అధ్యక్షుడిగా కరుణాకర్ రెడ్డి నియామకం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చుని నాలుగు నెలలు అవుతున్న చిత్తూరు జిల్లాలో పార్టీని గాడిలో పెట్టడంలో విఫలమవుతోంది. నెల రోజులకు ముందు మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా నియమించారు. ఆయన ఇప్పటివరకు పదవి బాధ్యతలను చేపట్టలేదు. దీంతో తిరిగి చిత్తూరు జిల్లాకు, తిరుపతి జిల్లాలోని 4 నియోజకవర్గాలకు అధ్యక్షుడిగా టిటిడి మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఉమ్మడి జిల్లా పార్టీ పరిశీలకులుగా టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని నియమించారు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలకు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాలకు కో ఆర్డినేటర్ గా నియమించారు.
నెలరోజుల కిందట వైసిపి చిత్తూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. అయితే ఆయన ఇప్పటివరకు పదవి బాధ్యతలను చేపట్టలేదు. జిల్లాలో ఎక్కడ పర్యటించలేదు. జిల్లా కార్యవర్గం కూర్పు గురించి ఆలోచించ లేదు. దీంతో ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి మీద ఆసక్తి లేదని గ్రహించిన అధిష్టానం తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గం జిల్లా అధ్యక్షులుగా నియమించారు. తిరుమల లడ్డులో ఉపయోగించి నెయ్యిలో కల్తీ జరిగిందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తీవ్ర కలకలాన్ని లేపాయి. ఈ విషయంలో వైసిపి పార్టీ ఆత్మ రక్షణలో పడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు ప్లాన్ చేసి, పరిస్థితులు అనుకూలించక చివరకు విరమించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నాయకులు తమ పరిపాలనలో టిటిడి లడ్డులో కల్తీ జరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన తనయుడు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డిలు ఎక్కడ ఈ విషయం గురించి నోరు మెదపలేదు. అసలు ఈ విషయాన్ని గురించి పట్టించుకున్నట్లే కనిపించలేదు. అయితే టిటిడి చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. తిరుమలకు వెళ్లి ఆఖండం దగ్గర తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రమాణం చేశారు. లడ్డు విషయంలో కల్తీ జరిగి ఉంటే, తాను, తన కుటుంబం రాజకీయంగా సర్వనాశనమైపోతుందని కూడా ఆయన శ్రీవారి ఎదుట ప్రమాణం చేశారు. దీంతో కొంతవరకు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు తిప్పి కొట్టగలిగారు. వరుసగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి, లడ్డు విషయంలో కల్తీ జరగలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిని పరీక్షించే వ్యవస్థ ఎలా ఉంటుందో భూమన ప్రజలకు వివరించారు. దీంతో వైసిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నెలరోజులు సమయం ఇచ్చినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు చేపట్టికపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి 1972 నుంచి రాజకీయాలలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నమ్మినబంటుగా ఆయనకు పేరు ఉంది. జిల్లా వ్యాప్తంగా భూమన కరుణాకర్ రెడ్డికి అనుచరులు, పరిచయస్తులు ఉన్నారు. అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేయడంతో ఆ పార్టీ నాయకులతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనను చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కొనవచ్చని జగన్ భావించినట్లు తెలుస్తోంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీని ఎదుర్కొంటూ, మరోవైపు వైసీపీని పటిష్టం చేయాల్సిన బాధ్యత జగన్ కరుణాకర్ రెడ్డికి అప్పగించారు. ఆయన ఈ విషయంలో ఎంత మేరకు విజయవంతం అవుతారో వేసి చూడాల్సిందే.