దీపావళి ధమాకా గా నామినేటెడ్ పోస్టుల భర్తీ
41 చైర్మెన్ పోస్టులను ప్రకటించనున్న చంద్రబాబు
ఉహాల పల్లకిలో ఊరేగుతున్న కూటమి నేతలు
జిల్లాకు రెండు లేక మూడు చైర్మన్ పోస్టులు వచ్చే అవకాశం
పోస్టుల ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న నేతలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
మొదటి విడతలో ఇచ్చిన 21 పదవులలో జిల్లాకు చెందిన ఎవరికి రాష్ట్ర చైర్మన్ పదవి ఇవ్వలేదు. దీపావళికి 41 కార్పొరేషన్లకు చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తారని ప్రకటించడంతో ఈ పర్యాయం చిత్తూరు జిల్లాకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరిస్తాయని భావిస్తున్నారు. మొదటి విడత పంపకంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన మునిరత్నంకు ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. చిత్తూరుకు చెందిన కటారి హేమాలతకు రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవి ఇచ్చారు. నగరికి చెందిన ఒకరిని కూడా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవి వరించింది. కుప్పంకు జగడం రత్నం మాత్రం ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవిని స్వీకరించారు. పర్యాటక శాఖ డైరెక్టర్ గా నియమితులైన కటారి హేమలత ఇంతవరకు ఆ పదవిని స్వీకరించలేదు. నగరికి చెందిన మరో నేత ఆ డైరెక్టర్ పదవి తనకు అవసరం లేదని సున్నితంగా తిరస్కరించారు. చిత్తూరు చంద్రబాబు స్వంత జిల్లా కావడంతో పలువురు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ఆశిస్తున్నారు. అయితే టీవీ 5 అధినేత బి ఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మరో మాజీ మంత్రి, వైసిపి అధికార ప్రతినిధి ఆర్ కె రోజా, మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామిని సమర్ధ వంతంగా ఎదుర్కోవడానికి ఒక రెడ్డి నేతకు కూడా రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారని ప్రచారంలో ఉంది. మంత్రి పదవి ఆశించిన మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి ఈ పర్యాయం రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి లభిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే చిత్తూరు మాజీ ఎమ్మెల్యేలు సికె బాబు, ఏ ఎస్ మనోహర్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, రాజేశ్వరి, పుంగనూరు ఇంచార్జి చల్లా రామ చంద్రా రెడ్డి రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నారు. ఇక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెట్ చైర్మన్, జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్, చూడా చైర్మన్, గ్రంధాలయ సంస్థ, కాణిపాకం బోయకొండ గంగమ్మ, కలికిరి కొండ ఆలయాల పాలక మండలి చైర్మన్ పదవులనుపలువురు ఆశిస్తున్నారు. ఈ పోస్టులకు భారీగా డిమాండ్ ఉంది. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు కూడా డిమాండ్ ఉంది. దీపావళికి చంద్రబాబు నాయుడు ఏ ఏ పోస్టులను భర్తీ చేస్తారనే విషయం మీద జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. 41 కార్పొరేషన్ లో చిత్తూరు జిల్లాకు రెండు లేక మూడు కార్పొరేషన్ చైర్మన్ లభించే అవకాశం ఉంది. అలాగే ఒక 15 వరకు డైరెక్టర్ పోస్టులు లభించవచ్చు. ఇందులో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలకు ఎన్ని కేటాయిస్తామన్నది మినీయన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రకటించే పోస్టులలో ఎవరి పేర్లు ఉంటాయన్న అంశం మీద సస్పెన్స్ కొనసాగుతోంది. మూడు పార్టీల నాయకులు ఎవరికి వారు ఊహాగానాల్లో తెలియాడుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఏ పోస్టులు ఉన్నాయి తమకు ఏ పోస్టు రావచ్చు అనే విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నారు. దీపావళి పోస్టుల బర్త్డే సందర్భంగా చిత్తూరు జిల్లాలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఈ అంచనాలను ఎంతవరకు నిజం చేస్తారో వేచి చూడాలి.