26, అక్టోబర్ 2024, శనివారం

బిపిఎల్ కుటుంబాలకే ఉచిత గ్యాస్

జిల్లాలో 5 లక్షల మందికి లబ్ది  

29 నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం 

వినియోగదారుడు తొలుత డబ్బులు చెల్లించాలి 

రెండు రోజుల్లో ఆ డబ్బు బ్యాంకు ఖాతాకు జమ 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ

ఉచిత గ్యాస్ పథకాన్ని తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఎవరైనా ఉచిత గ్యాస్ పొందాలనుకుంటే గ్యాస్ కలెక్షన్ తో పాటు ఆధార్ కార్డు, తెలుపు రంగు రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, తెలుపు రంగు రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్లకు అనుసంధానమై ఉండాలి. అలా ఉంటేనే పుణ్యాగదారులకు ఉచిత గ్యాస్ పథకం అమలు అవుతుంది. అలాగే వినియోగదారుని బ్యాంక్ అకౌంట్ గ్యాస్ కనెక్షన్ కు అనుసంధానమై ఉండాలి. ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమల్లో భాగంగా ఈ నెల 29 నుంచి గ్యాస్‌ బుకింగ్స్‌ ప్రారంభమవుతాయి. జిల్లాలో  అర్హులైన వారందరికీ దీపావళి నుంచే మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్‌పీజీ కనెక్షన్‌, తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు అర్హతగా ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో  ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే రోజు జిల్లాలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ఇంటికీ మొదటి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేయడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోగానే ఒక ఎస్‌ఎంఎస్‌ సంబంధిత లబ్ధిదారుని ఫోన్‌ నంబర్‌కు వస్తుంది. బుక్‌ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో , 48 గంటల్లో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిలిండర్‌ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుంది. ఇందుకు  సంబంధిత మార్గదర్శకాలు, విధి విధానాలపై ఉత్తర్వులను జారీ అయ్యాయి. జిల్లాలో  5.80 లక్షల  గ్యాస్‌ కనెక్షన్లు, 5.43 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరిలో అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు. జిల్లాలో ఐదు లక్షల మంది కి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ఒక అంచనా.

ఏడాదికి మూడు సిలిండర్లు

ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్‌ మార్చి 31లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చును. ఈ పథకం అమలు కోసం ఏడాదిని మూడు బ్లాక్‌ పీరియడ్లుగా విభజించారు. మొదటి బ్లాక్‌ పీరియడ్‌ ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31 వరకు, రెండో బ్లాక్‌ పీరియడ్‌ ఆగస్టు 1 నుంచి నవంబరు 31 వరకు, మూడో బ్లాక్‌ పీరియడ్‌ డిసెంబరు 1 నుంచి మార్చి 31 వరకు పరిగణిస్తారు. ఈ పథకం అమల్లో లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఎదురైతే టోల్‌ ఫ్రీ నంబరు 1967 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా పౌరసరఫరాల అధికారి శంకర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో 47 వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిల్లో 5.80 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెక్కెర కార్డు ఉన్నవారికి, ఆదాయపన్ను చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *