500 దుకాణాలకు కొత్త డీలర్లు
ప్రభుత్వం మారడంతో పాత డీలర్ల మార్పు
రాజకీయ రంగు పూసుకుంటున్న డీలర్లు
చిత్తూరు బ్యూరో, (ఆంధ్రప్రభ)
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో దాని ప్రభావం గ్రామాల్లోని రేషన్ షాపుల మీద కూడా పడుతుంది. జిల్లాలో పలువురు రేషన్ షాప్ డీలర్లు ఇప్పటికే రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్త డీలర్లను నియమిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 500 మంది కొత్త డీలర్లు నియమితులయ్యారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న డీలర్లను తొలగించి, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న డీలర్లను నియమించుకునే ప్రక్రియ జిల్లాలో జోరుగా జరుగుతోంది.
చిత్తూరు జిల్లాలో 1379 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాలోని ప్రజలకు 5.43 లక్షల కార్డుదారులకు నిత్యవసర వస్తువుల పంపిణీ జరుగుతుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాల్సిన రేషన్ షాప్ డీలర్లు ఈమధ్య రాజకీయ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. కొందరు రాజకీయంగా క్రియశిలకం అవుతున్నారు. రాజకీయ సభలు, సమావేశాల్లో రేషన్ షాపు డీలర్లుపాల్గొనకూడదు. అయితే, పలువురు రాజకీయ కార్యక్రమాలలో బహిరంగంగా పాల్గొంటున్నారు. ఎన్నికలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల అవతారం ఎత్తుతున్నారు. పలువురు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మారితే, అరేషన్ షాపుల డీలర్లు కూడా మారడం పలు గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికి మూడోవంతు పైగా రేషన్ షాపు డీలర్లు మారారు. ఇంకా పలువురు డీలర్లు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న డీలర్లను రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. వారి వత్తిళ్ళకు తలొగ్గి పలువుల డీలర్లు రాజీనామా చేస్తున్నారు. వారి స్థానంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్న డీలర్లను రాజకీయ పలుకుబడితో నియమించుకుంటున్నారు. కొంతమంది డీలర్లు నైతిక బాధ్యత వహించి మరి ప్రభుత్వం మారగానే రాజీనామా చేసి, పక్కకు తప్పుకుంటున్నారు. రాజకీయంగా తటస్థంగా ఉన్న డిలర్లకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. ఈ విషయం జిల్లాలోని పౌరసరఫరాల అధికారులకు తలనొప్పిగా మారింది డీలర్లు రాజీనామా చేయగానే ఆ షాపును ఖాళీగా ప్రకటించాలి. ఆ షాపు డీలర్ భర్తీకి సంబంధించిన రెవెన్యూ డివిజన్ అధికారి నోటిఫికేషన్ జారీ చేయాలి. దానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూ నిర్వహించి, అందులో అర్హత ఉన్న వారిని రేషన్ షాప్ డీలర్లుగా నియమించాలి. వారు అన్ని రకాల లైసెన్సు లను తీసుకోవాలి. పేరుకు రేషన్ షాప్ డీలర్లకు ఇంటర్వ్యూలు జరుగుతున్న రాజకీయ సిఫార్సుల మేరకే డీలర్లు నియమితులవుతున్నారు. మండలంలో పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు లేక సంబంధిత శాసనసభ్యులు సిఫార్సు మేరకు రేషన్ షాప్ డీలర్లను నియమిస్తున్నారు. రేషన్ షాప్ డీలర్లకు ప్రతి నెలా కమీషన్ వస్తుండడంతో పలువురు రేషన్ షాప్ డిలర్లుగా ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. గ్రామంలో రేషన్ షాప్ డీలర్ అంటే వారిని అందరూ గౌరవిస్తారు. రానున్న కాలంలో రాజకీయంగా అరంగ్రేటం చేయడానికి రేషన్ షాప్ డీలర్ పోస్టులను సోపానంగా పలువురు భావిస్తున్నారు. ఈ కారణంగా ప్రజలతో సత్సంబంధాలను ఏర్పరచుకొని, ఎన్నికలలో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. రేషన్ షాప్ డీలర్లను పలువురు రాజకీయంగా తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. వీరు అధికార పార్టీ తరఫున ఆ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా పనిచేస్తారు. అలాగే గ్రామాల్లో ప్రభుత్వం తరఫున జరిగే సభలు, సమావేశాలు ఏర్పాటు, అందుకే ఖర్చులు కూడా సాధారణంగా రేషన్ షాప్ డీలర్ల మీదనే వేస్తుంటారు. వీరు రేషన్ షాప్ ద్వారా అక్రమ మార్గంలో సంపాదించి, ఆ ఖర్చులను భరిస్తూ ఉంటారు. రేషన్ షాప్ డీలర్ అంటే అక్రమాలకు చిరునామ అని అభిప్రాయం ఉంది. అందరికి తగిన విధంగానే రేషన్ షాప్ డీలర్లు కూడా వ్యవహరిస్తుంటారు. సాధారణంగా తూకంలో తక్కువ వేయడం, కొంతమందికి ఉద్దేశపూర్వకంగా నిత్యవసర వస్తువులను సరఫరా చేయకుండా స్వాహా చేయడం, కొన్ని నిత్యాసర వస్తువులను నల్లబజారుకు తరలించడం సర్వసాధారణంగా జరుగుతున్న వ్యవహారాలు. రేషన్ షాప్ డీలర్ ఒక లాభదాయకమైన పోస్ట్ కావడంతో జిల్లాలో పలువులు ఇందుకు పోటీలు పడుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులకు కూడా రేషన్ షాప్ డీలర్లుగా తమ వారిని నియమించుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం మారినప్పుడల్లా గ్రామాల్లో రేషన్ షాప్ డీలర్లు కూడా మారుతున్నారు.