ఉత్సవ విగ్రహాలుగా జిల్లా, మండల పరిషత్ అధ్యక్షులు
ప్రభుత్వం మారడంతో కార్యాలయాలకు దూరం
పట్టని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
ఎంఎల్ఏ ల కనుసన్నల్లో ప్రభుత్వ పధకాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
రాష్ట్రంలో అధికారం మారడంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. వారికి విధులు, నిధులు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పలువురు కార్యాలయాలకు కూడా హాజరు కావడం లేదు. ఏదో మొక్కబడిగా వచ్చి మమ అనిపించుకుంటున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు మండల పరిషత్ కార్యాలయాలకు ముఖం చాటు వేయడంతో ఆ కార్యాలయాలు వెలవెల పోతున్నాయి. ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి అధికారులను ఆశ్రయిస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా పరిషత్, 65 మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా విభజన జరిగినా, ఇప్పటివరకు జిల్లా పరిషత్ విభజన జరగలేదు. చిత్తూరు కేంద్రంగానే 65 మండలాలకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికలలో జిల్లా పరిషత్తును, అన్ని మండల పరిషత్తులను వైసిపి కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరగడంతో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించింది. దీంతో జిల్లా పరిషత్ ను, జిల్లాలోని అన్ని మండల పరిషత్తులను వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్తో పాటు మండలాల మీద కూడా వైసిపి జండాలను ఎగురవేసింది. జిల్లా పరిషత్ అధ్యక్షుడికి క్యాబినెట్ హోదా ఉంటుంది. గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా పరిషత్ అధ్యక్షునికి జిల్లాలో ఎనలేని గౌరవం ఉండేది. ప్రభుత్వ కార్యక్రమాలలో జిల్లా పరిషత్ చైర్మన్ అగ్రస్థానంలో ఉండేవారు. జిల్లాలో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లు, అధికారిక కార్యక్రమాలు జిల్లా పరిషత్ చైర్మన్విదుగా హాజరయ్యేవారు. ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ సమావేశాలకు, జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలకు మాత్రం పరిమితం అవుతున్నారు. జిల్లాలో జరిగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కు జిల్లాలోని అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు మీద సమీక్షతో పాటు సర్వాధికారాలు ఉంటాయి. జిల్లాలోని ఏ అధికారి అయినా జిల్లా పరిషత్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి. చైర్మన్ ఎప్పుడైనా ఏ కార్యాలయానికి అయినా వెళ్లి తనిఖీ చేయవచ్చు. ఏ అధికారిని అయినా పిలిచి సమీక్ష చేయవచ్చు. ఆకస్మికంగా మండల పరిషత్ కార్యాలయాలను, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేయవచ్చు. జిల్లాలో ఇదివరకు జిల్లా అధికారుల బదిలీలు, మండలాల్లో బదిలీలు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కనుసన్నల్లో జరిగేవి. గతంలో ఉపాధ్యాయుల బదిలీలు కూడా జిల్లా పరిషత్ నియంత్రణలో ఉండేవి. అప్పుడు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో జిల్లా పరిషత్ కార్యాలయం బిజీ బిజీగా ఉండేది. జిల్లాలోని శాసనసభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు జడ్పిటిసి సభ్యులు టీచర్ల విషయంలో భారీగా సిఫార్సులు చేసేవారు. అలాగే ఇసుక తవ్వకాలు సంబంధించిన అనుమతి కూడా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచే అమలు జరిగేది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడప్పుడు మాత్రమే జిల్లా పరిషత్ కార్యాలయానికి విచ్చేస్తున్నారు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతున్నారు. జిల్లా పరిషత్ అధికారులతో, కానీ ఎంపీడీవోలు, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే జిల్లా పరిషత్ కార్యాలయం బోసిపోయినట్లు కనిపిస్తుంది. గతంలో జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఎప్పుడు అధికారుల, ప్రజాప్రతినిధుల హడావిడి బాగా ఉండేది. ప్రభుత్వం మారడంతో ఈ హడావిడి అంతా తగ్గింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇతర అధికారుల బదిలీలు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలోనే జరిగేవి. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ తన పిఏని కూడా తన ఇష్టానుసారంగా నియమించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న పీఏను గంగాధర నెల్లూరుకు ఎన్నికల సమయంలో బదిలీ చేశారు. తిరిగి ఆయనను పీఏ గా నియమించాల్సిందిగా జిల్లా పద్ధతి చైర్మన్ జిల్లా పరిషత్ సీఈవోకు సిఫారసు చేశారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్న కారణంగా అతనిని నియమించకూడదని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుపడ్డారు. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ సొంతంగా పీఏని కూడా నియమించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు కార్యాలయాలకు రావడమే తగ్గించేశారు. అభివృద్ధి కార్యక్రమాలు సంబంధిత శాసనసభ్యుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. వైసీపీ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలకు ఏమాత్రం నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం నిధులు మంజూరు అవుతున్న, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యుల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీ వారోత్సవాలు నడుస్తున్నాయి. మండలంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యులు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలలో కూడా జిల్లా పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యులు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొనడం లేదు. శాసనసభ్యులందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎన్నికయ్యారు. అయితే స్థానిక సంస్థల్లో మాత్రం వైసిపి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీంతో పార్టీ విభేదాలు కారణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం లేదు. తన పదవులు ఎప్పుడు అయిపోతాయా అన్న విధంగా ఇంట్లో కూర్చొని రోజులు లెక్కిస్తున్నారు. వారికి అందవలసిన గౌరవ వేతనం కూడా సకాలంలో అందడం లేదు. జడ్పిటిసి సభ్యులు, జిల్లా పరిషత్ సమావేశాలకు స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతున్నారు. అలాగే మండల స్థాయిలో సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సమావేశానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. మండల పరిషత్ కాదు సమావేశాలలో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవి రావడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆమడ దూరంలో ఉన్నారు.
పో రై గంగ 1 జిల్లా పరిషత్ కార్యాలయం