సంచార జాతుల అభివృద్దిపై ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ద
సంచార జాతులను గుర్తిస్తున్న జిల్లా అధికారులు
వారికి అదార్, రేషన్ కార్డు, బ్యాంకు ఎకౌంటు ఏర్పాటు
ఆర్థిక అభివృద్దికి మార్గాల అన్వేషణ
అభివృద్ధి, సంక్షేమ పధకాలు అందించడానికి చర్యలు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
కూటమి ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తుంది. వారిని గుర్తించి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల బీసీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఎక్కడెక్కడ సంచార జాతుల్లో ఉన్నది గుర్తించి, వారి స్థితిగతులను తెలియజేయాల్సిందిగా కోరింది. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి బీసీ సంఘం నాయకులతో మాట్లాడి ఒక నివేదికను అందజేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం సంచార జాతుల మీద దృష్టిని కేంద్రీకరించింది. సంచార జాతులు ఎక్కడెక్కడ ఉన్నది ఆరా తీస్తున్నారు. వారి స్థితిగతులు, జీవన విధానం, ఆర్థిక పరిస్థితుల మీద అధ్యయనం జరుగుతోంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల అభివృద్ధికి ఒక బృహత్తర పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం, బంగారుపాళ్యం, నగరి ప్రాంతాలలో సంచార జాతులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఏడాదికో చోట సంచార జీవనం గడుపుతూ ఉండే ఈ జనాలకు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు వంటి గుర్తింపులు కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలకూ నోచుకోవడం లేదు. అందుకే గత ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలకు సంబంధించిన పథకాల్లో వీరెవరూ లబ్ధిదారులు కాలేకపోయారు. యాచక వృత్తి ప్రధానంగా ఉన్న ఈ కులాలను ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆయా కులాలకు సంబంధించిన సర్వేలను కూడా నిర్వహించింది. వారు ఏయే ప్రాంతాల్లో ఉంటున్నారు? వారి జీవన విధానమేంటి? వారికి ఏయే ఆర్థిక కార్యక్రమాలు నిర్వహిస్తే అభివృద్ధి చెందుతారన్న విషయంపై ప్రభుత్వం అధ్యయనం నిర్వహించింది. 32 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా ప్రభుత్వం గుర్తించింది. అసలు ఈ కులాలకు చెందిన జనాభా ఎంత మంది ఉన్నారన్న లెక్కలు తీయాలని నిర్ణయించారు. బాలసంతు/బాహురూపి, బండార, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గందిరెద్దులవారు, జంగం, జోగి, కాటిపాపల, కొర్చ, మొండివారు/బండ/మొండిబండ, పిచ్చిగుంట్ల/వంశీరాజ్, పాముల, పార్థి, పంబల, దమ్మాలి, వీరముష్టి/నెట్టికోటల/వీరభద్రేయ, గూడల, కంజార-భట్టా, కొప్మారే/రెడ్డిక, మొండిపట్ట, నొక్కార్, పరికి ముగ్గుల, యాట, చోపేమారి, కైకాడి, జోషినందివాలా, మందుల, కునపులి, పట్రా, రాజనాల/రాజన్నలు, కాసికపాడి/కసికపూడి కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించారు. బీసీ-ఏ కేటగిరీకి చెందిన ఈ కులాలు రాష్ట్రంలో బాగా వెనుకబడిన జాబితాలో ఉన్నాయి. వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో చాలా వరకూ ప్రభుత్వ పథకాలు చేరడం లేదని అప్పటి ప్రభుత్వం గుర్తించింది. వారి సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ స్థాయి చాలా తక్కువగా ఉండటంతో వారు ప్రభుత్వాల దృష్టిలో పడటం లేదు. వారిలో ఎక్కువ మంది నిర్దిష్ట వృత్తి లేకపోవడంతో యాచకవృత్తికి అలవాటుపడ్డారని పలు సర్వేల్లో తేలింది. వారికి తగిన వనరులు, నైపుణ్యం, సామాజిక స్థాయి లేకపోవడంతో ప్రధానమైన వృత్తుల్లో భాగస్వాములు కాలేకున్నారని, వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడం, పథకాలపై అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందలేకపోయారని గుర్తించారు. ఎక్కువ మంది రోజుకో చోట సంచరిస్తుండటంతో వారికి నిర్దిష్టమైన రేషన్‌కార్డులుగానీ, ఆధార్, బ్యాంకు ఖాతాలు పొందలేకపోయారని తెలిసింది. బ్యాంకుల నుంచి రుణ సదుపాయం లేకపోవడంతో చాలామంది వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగిపోతున్నారని, వారికి ఆర్థికంగా చేయూతనిస్తే అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం భావించింది. సంచారజాతులకు చెందిన వారు ముఖ్యంగా చిన్నచిన్న వీధి వ్యాపారాలు చేసుకుంటున్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా వారికి రుణాలు అందించగలిగితే వారి వ్యాపారం వృద్ధి చెంది జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ కులాలకు చెందిన సంచారజాతులు, యాచకులను ఉద్దరించేందుకు కులాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేశారు. రాష్ట్రంలో సంచార జాతులు, విముక్త జాతులకు సంబంధించిన 32 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా ప్రభుత్వం గుర్తించింది. వారి కోసం ‘ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్’ను 2016 జూన్‌లోనే బీసీ సంక్షేమశాఖ ద్వారా ఏర్పాటు చేసింది. మొదటగా ఈ కార్పొరేషన్ ద్వారా ఈ కులాలకు చెందిన వారికి ఒక్కో కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయం అందించింది. కార్పొరేషన్ ద్వారా 90శాతం సబ్సిడీ, ఎన్‌బీసీఎ్‌ఫడీసీ నుంచి 10 శాతం రుణం ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంది. ఈ కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసేందుకు ఉన్నతాధికారులు గ్రామాల్లో బస చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ 2016లో ప్రారంభించినప్పటికీ సర్వేలు, కార్యాచరణ ప్రణాళిక పూర్తయిన తర్వాత బడ్జెట్‌లో ఈ కార్పొరేషన్ కోసం భారీగా కేటాయింపులు చేశారు. ఆ తర్వాత కార్పొరేషన్‌కు పాలకవర్గాన్ని నియమించారు. లబ్ధిదారులను వెతికి వారికి గుర్తింపుపత్రాలు అందించి వారిని జనజీవనంతో కలిసిపోయేలా అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత వారికి ఆర్థికసాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో లబ్దిదారుడికి రూ.50వేల ఆర్థికసాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ కార్పొరేషన్ ద్వారా అందించిన ఆర్థిక సాయంతో పలువురు వీధి వ్యాపారాలు సమర్థవంతంగా వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లను రద్దు చేశారు. ఆ తర్వాత అదే కార్పొరేషన్లు, ఫెడరేషన్లు స్థానంలో కొత్త కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. అదే రీతిలో ఎంబీసీ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటుచేశారు. అప్పటికే టీడీపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఉండటంతో అదే బడ్జెట్‌ను కొనసాగించారు. బడ్జెట్‌లో కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఏ కార్పొరేషన్‌కూ నిధులు కేటాయించలేదు. ఎంబీసీ కార్పొరేషన్‌దీ అదే పరిస్థితి. ఈ 32 కులాలకు చెందిన పేదలు నవరత్నాల్లో పలు పథకాలకు అర్హత కలిగినప్పటికీ వారిలో చాలా మంది వాటి ఫలాలు అందుకోలేకపోతున్నారు. మళ్ళి కూటమి ప్రభుత్వం సంచార జాతుల మీద దృష్టిని కేంద్రీకరించింది. ఇందుకు ప్రభుత్వ అధిరరులు ఎంత వరకు సహకరిస్తారో, ప్రభుత్వం ఎలాంటి పధకాలను తీసుకోని వస్తుందో వేచి చూడాలి.