చిత్తూరు జిల్లాలో రాజకీయ శూన్యత
కనిపించని రాజకీయ కార్యక్రమాలు
ఆచూకీ లేని ధర్నాలు, రాస్తారోకోలు
ఆగుపించని రాజకీయ ప్రత్యర్థుల సవాళ్లు
అధికార పార్టీలో లోపించిన హంగు ఆర్భాటం
పరాజయం నుంచి కోలుకొని ప్రతిపక్షం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లా రాజకీయ ఉద్దండుల ఖిల్లా. జిల్లాలో అధికారపక్షం ఎంత పటిష్టంగా ఉంటుందో, ప్రతిపక్షం కూడా అంతే పటిష్టంగా ఉంటుంది. ఒకనాడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో డీ అంటే డీ అనేవి. జిల్లా స్యి సమావేశాలు సైతం సవాల్లో ప్రతి సవాళ్లతో ధ్వనించేది. ఎవరు అధికారంలో ఉన్న అధికారపక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షం అవినీతి అక్రమాల గుట్టు విప్పేది. ఒకరికి ఒకరు తీసుకొని విధంగా సవాల్లో ప్రతి సవాల్లో ఉండేవి. ప్రజా సమస్యల మీద అధికార పక్షాన్ని నిల తీసేవారు. రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు స్వంత జిల్లా అయిన చిత్తూరులో ప్రస్తుతం రాజకీయ ఉలుకు పలుకు కనిపించడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరి పరిధిలో వారు పనిచేసుకుంటున్నారు. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో జిల్లాలో ఎక్కడ మంత్రి పర్యటనలు లేవు. హంగు ఆర్భాటం కటౌట్లు, బ్యానర్లు కనిపించడం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జిల్లా కేంద్రానికి పరిమితమయ్యారు. ఇంతవరకు జిల్లాకు ఇన్చార్జి మంత్రిని నియమించలేదు. మంత్రి పదవి రాకపోవడంతో అలకబూనిన సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు. జిల్లా స్యిలో నిర్వహించే సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు. ఇతర నాయకులు నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాకు రెండు నామినేటెడ్ పోస్టులు వచ్చినా, అవి వారిని సంతృప్తి పరచలేదు. ఆ పదవులను అంగీకరించాలా వద్దా అనే మీమాంఛతో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి పక్ష వైసిపి నేతలు కనీసం ఉనికి చాటు కోవడం లేదు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకున్న సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి యుద్ధ విరమణ చేసిన వీరుల్లా ఉన్నారు. జిల్లాకు మంత్రి లేక పోవడంతో హడావుడి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ఆరు చోట్ల టిడిపి అభ్యర్థులు గెలువగా పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విజయం సాధించారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఉప ముఖ్య మంత్రిగా ఉన్న నారాయణ స్వామికి టికెట్టు రాలేదు. ఆయన బదులు ఆయన కూతురు కృపా లక్ష్మిని జి డి నెల్లూరులో పోటీ పెట్టినా ఓటమి తప్ప లేదు. తనకు టికెట్ రాకపోవడంతో మాజీ ఉప ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అంత క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా నగరిలో ఓడిపోయారు. చాలా కాలం విరామం తర్వాత ఇప్పుడిప్పుడే రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి పదవి వస్తుందని భావించిన మాజీ మంత్రి ఎన్ అమరనాద రెడ్డికి నిరాశ ఎదురయ్యింది. జి డి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కూడ ఎస్సీ కోటాలో మంత్రి పదవి కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయుడు, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ మోహన్ ఎవరి పని వారు చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఎవరు నోరు మెదపడం లేదు. అధికార ప్రతి నిధులు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్ టీవీ డిబేట్లకు పరిమితం అయ్యారు. సప్తగిరి ప్రసాదు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ, అప్పుడప్పుడు జిల్లా అధికారులకు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్ చొరవ చూపడం లేదు. బిజెపి, జనసేన నేతలు ఎక్కడా కనిపించడం లేదు. కార్యకర్తలను పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక ప్రతి పక్ష వైసిపి నేతలు కనీసం పత్రికా సమావేశాలు కూడా పెట్టడం లేదు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇప్పటి వరకు కార్యకర్తల సమావేశం కూడ పెట్టలేదు. జిల్లా అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నది, లేనిది స్పష్టం చేయలేదు. జిల్లా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను చేపట్టలేదు. ఒకరకంగా చెప్పాలంటే పుంగనూరుకే పరిమితమయ్యారు. అధికార ప్రతినిధి ఆర్ కె రోజా చెన్నైలోని తన స్వగృహం నుంచి వీడియోలు విడుదల చేస్తున్నారు. ఎమ్మెల్సీలు భరత్, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కనీసం ఉనికి చాటుకునే పని కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలు చప్పగా మారాయి. జిల్లాలోని కరువు పరిస్థితుల గురించి, రైతులను సమస్యల గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తున్న వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కరువు జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా వినిపించడం లేదు. పాల రేటు తగ్గించినా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రజాపక్ష వాణీ వినిపించడం లేదు. జిల్లాలో వేరుశెనగ పంట పూర్తిగా నష్టపోయినా, కనీసం నష్టపరిహారం గురించి కూడా ఎవరు ఆలోచించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే జిల్లాలో ప్రతిపక్షం తన బాధ్యతలను పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. జిల్లాలో అధికార పక్షం హంగూ ఆర్భాటం లేదు. ప్రతిపక్ష పార్టీల ధర్నాలు, రాస్తారోకోలు సవాల్లు, ప్రతి సవాళ్ల ఊసే లేదు. జిల్లాలో రాజకీయ శూన్యత కనిపిస్తుది. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలే పోరాటం చేయాల్సిన విచిత్రమైన పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొంది.