బిసిల అభ్యున్నతికి నూతన పధకాలు
పాత పధకాలు రద్దయ్యే అవకాశం
లబ్దిదారుల అవసరం మేరకు నూతన పధకాల రూపకల్పన
జిల్లా స్థాయిలో బిసి కుల సంఘ నాయకులతో సమావేశాలు
చిత్తూరు జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నూతన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గతంలో ఉన్న పథకాలు చాలావరకు రద్దయ్యే అవకాశం ఉంది. కొత్తగా లబ్ధిదారుల భాగస్వామ్యంతో వాళ్లకి ఎటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అవసరమో తెలుసుకొని వాటికి అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపకల్పన చేయడానికి బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో బిసి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. బీసీ నాయకులుఅభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నూతనంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయడానికి కూటమి ప్రభుత్వం సమాయుత్తమవుతుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బలహీన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, నగర - ఉప్పర, కృష్ణబలిజ, వాల్మీకి - బోయ, బట్రాజుల, మేదర, కుమ్మర, విశ్వబ్రాహ్మణ, కల్లు గీత సహకార సంఘాల సమాఖ్యలు పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ లో ఉన్నాయి. గత ప్రభుత్వము వీటి కథనంగా 56 కుల సంఘాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినా, ఆ కార్పొరేషన్ లకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇవి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఒక్కొక్క కార్పొరేషన్ కు ఒక చైర్మన్, పదకొండు మంది డైరెక్టర్లను నియమించారు. చైర్మన్ లకు ప్రతినెల 1.5 లక్షలు, డైరెక్టర్లకు 15 వేల రూపాయల వేతనాలను అందజేశారు. అయితే వారి ద్వారా కుల సంఘాలకు కలిగిన లబ్ది మాత్రం శూన్యం. కుల సంఘాల నాయకులతో సంబంధం లేని వ్యక్తులను, రాజకీయ నాయకుల సిఫారసు మేరకు చైర్మన్, డైరెక్టర్లు గా నియమించారు. వీరి వల్ల ఉపయోగం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. అలాగే టిడిపి ప్రభుత్వం గతంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీసీ కార్పొరేషన్ అమలు చేసింది. ఇందులో ఎక్కువ ఇందులో ఎక్కువ కిరాణా దుకాణాలు, పాడి ఆవులు, స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద చేతివృత్తుల వారికి వారికి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అధునాతన పనిముట్లను అందజేశారు. ఈ పథకం మీద కూడా విమర్శలు వచ్చాయి. కులవృత్తుల వారు ఎప్పటికీ వాటి మీద ఆధారపడాల్సిందేనా రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదల ఎప్పుడు అంటూ పలువురు బిసి నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి నూతన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు జిల్లా స్థాయిలో వివిధ బిసి సంక్షేమ సంఘాల నాయకుల సమావేశాలను ఏర్పాటు చేసి, వారి ద్వారా ఆ కులాల యువతకు అభివృద్ధికి అవసరమైన పథకాలను తెలుసుకొని, వాటిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులకు తెలియజేశారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో బీసీ సంఘం నాయకులు అందర్నీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి అవసరాలను తెలుసుకోవాల్సిందిగా కోరారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి, బీసీల సంక్షేమానికి నూతన పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వంఉంది. జాతీయ బిసి కార్పొరేషన్ నుంచి అత్యధిక నిధులను రాబట్టి దానికి మ్యాచింగ్ రెంటు కింద జిల్లాలో మరికొంత నిధులను ఇచ్చి బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బీసీల వృత్తులను మెరుగుపరచడానికి పీఎం విశ్వకర్మ పథకాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కూడా భావిస్తోంది. గత ప్రభుత్వం బాకీ ఉన్న డైట్ చార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే వసతి గృహాల్లో విద్యార్థులకు వ్యక్తిగతంగా ఇస్తున్న ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్డింగ్ మెటీరియల్ కోసం నిధులను విడుదల చేసింది. హాస్టల్లో డిజిటల్ కంటెంట్ విద్యా ప్రణాళికను అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద నాణ్యమైన విదేశీ విద్యాసంస్థల్లో అత్యధిక విద్యార్థులకు అవకాశం కల్పించాలని, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని పునర్దించాలని నిర్ణయం తీసుకుంది. బీసీ స్టడీ సర్కిళ్ళ బలోపేతానికి 10 కోట్ల రూపాయలను కేటాయించింది. చిత్తూరులో అసంపూర్తిగా ఉన్న బిసి సంక్షేమ భవన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఐదు చోట్ల డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కులాల వారిగా తలసరి ఆదాయం ఆధారంగా బిపిఎల్ కుటుంబాలను గుర్తించి, వారి ఆర్థిక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక నిర్ణయించాలని నిర్ణయించింది. ఈ మెరకలు చిత్తూరు జిల్లాలో కూడా బిసి నాయకులతో బిసి కార్పొరేషన్ అధికారులు సమావేశం కానున్నారు.

