సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా
సిద్దం అవుతున్న ఓటర్ల జాబితా
వారం, పది రోజుల్లో ఎన్నికలు
ఆంధ్రప్రభ, చిత్తూరు బ్యూరో
జిల్లాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు మరో వారం పది రోజుల్లో జరిగే అవకాశం ఉంది. తొలుత సాగనీటి సంఘాల ఎన్నికలను ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఇరిగేషన్ అధికారులకు సమాచారాన్ని అందజేసింది. ఎన్నికలకు సంసిద్ధం కావాల్సిందిగా కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు పాత ఓటర్ల జాబితాను మండల రెవెన్యూ అధికారులకు అందజేశారు. అందులో మార్పులు, చేర్పులు చేసి నూతన జాబితాను రూపొందించి తమకు అందజేయాల్సిందిగా కోరారు. జిల్లాలో ప్రస్తుతం సాగనీటి సంఘాల ఓటర్లు జాబితా సవరణ జరుగుతోంది. ఇది పూర్తి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలోని 225 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
రైతులకు సక్రమంగా సాగునీటిని అందించేందుకు, డ్రెయిన్లు, పంట కాలువల అభివృద్ధికి, పర్యవేక్షణకు 1997లో అప్పటి ప్రభుత్వం నీటి సంఘాలను ఏర్పాటు చేసింది. ఆయా కాలువల పరిధిలోని రైతులకు ఓటు హక్కు కల్పించి ఎన్నిక నిర్వహించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 581 సాగునీటి సహకార సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 16 సంఘాలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 565 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2015 సెప్టెంబరులో అప్పటి టిడిపి ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో నీటి సంఘాల పాలకవర్గాలను నియమించింది. ఇవి ఏకపక్షంగా జరిగాయంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. నామినేటెడ్ పాలక పాలక వర్గాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా, అప్పటి టిడిపి ప్రభుతం ఎన్నికలు నిర్వహించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నీటి సంఘాలకు త్రీమ్యాన్ కమిటీలను వేసింది. 2020 మార్చి వరకూ ఇవి కొనసాగాయి. నీటిపారుదల వ్యవస్థ పర్యవేక్షణలో సాగునీటి సంఘాలు కీలకంగా వ్యవహరించేవి. చెరువులు, కాలువల్లో పూడికతీత, తూముల నిర్మాణం, ఆధునీకరణ పనులు, పొలాలు ముంపునకు గురికాకుండా చూడడం వంటివి ఈ సంఘాలు చేసేవి. రూ.5 లక్షల్లోపు పనులను సంఘాలే నామినేషన్ పద్ధతిలో చేయించేవి. ప్రస్తుతం వీటికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో చిన్న సమస్యల పరిష్కారానికి సైతం అధికారులపైనే ఆధారపడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇరిగేషన్ శాఖాధికారులకు బాధ్యతలు అప్పగించడంతో ప్రతి పనికి వారే అంచనాలు రూపొందించి టెండర్లు పిలవాల్సి వస్తోంది. దీనివల్ల పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాజెక్టుల్లో గేట్లు, తూములు, కట్టలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంట కాల్వలు, ఫీడర్ చానళ్ళులో పూడికలు పేరుకుపోవడంతో పాటు ఆక్రమణల వల్ల నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ఆక్రమణలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. గత ఐదు సంవత్సరాలలో జగన్ సర్కార్ 2020లో సాగునీటి సంఘాల వ్యవస్థను రద్దు చేసింది. దీంతో జిల్లాలో సాగునీటి సంఘాలు నిస్తేజంగా మారాయి. కార్యవర్గాలు లేక సాగునీటి వనరుల నిర్వహణ లేక అచేతనంగా ఉన్నాయి. గతంలో చెరువులు, కాలువలు, ఆయకట్టు పరిధిలో ఏ చిన్న సమస్య వచ్చినా నీటి సంఘాల ప్రతినిధులు స్పందించేవారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సాగునీటి సమస్యలు పరిష్కారం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వేలాది చెరువులు వీటి పరిధిలో ఉన్నాయి. చెరువుల్లో పూడికతీత, తూముల నిర్మాణం, మరమ్మతులు, కాలువ విస్తరణ, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు నీటి సంఘాలు చేపట్టేవి. దాదాపు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి కార్యకలాపాలు నిలిచిపోయాయి. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో నీటి సంఘాల పాత్ర కీలకంగా ఉండేది. ఏటా ఖరీఫ్, రబీకి ముందు నీటి సంఘాల ఆధ్వర్యంలో రైతులతో గ్రామసభ నిర్వహించేవారు. చెరువులు, కాలువల అభివృద్ధి పనులను గుర్తించేవారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించేవారు. ప్రతిపాదనలు రూపొందించి ఇరిగేషన్ అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించేవారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. పనులు యుద్ధ ప్రాతిపదికన చేసేవారు. వాస్తవానికి సాగునీటి సంఘాలకు స్థానిక సంస్థల నుంచి నిధులు సమకూరుతాయి. రైతులు ఏటా చెల్లించే నీటి పన్నులు నీటి సంఘాల ఖాతాలకు జమ అయ్యేవి. వాటికి తోడు ప్రభుత్వం ప్రత్యేక నిధులు జోడించి విడుదల చేసేవి. గత ప్రభుత్వాల హయాంలో నీటి సంఘాలకు నిధులు పుస్కలంగా విడుదలయ్యేవి. రైతులకు అవసరమయ్యే పనులు శరవేగంగా పూర్తయ్యేవి. ఎన్నికలు కూడా రాజకీయాలకతీతంగా పారదర్శకంగా జరిగేవి. క్రియాశీలకంగా ఉండే రైతు ప్రతినిధులను ఎన్నుకునేవారు. భూమి కలిగి, పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతులను ఓటర్లుగా చేర్చేవారు. మేజర్, మీడియం, మైనర్ సాగునీటి సంఘాలుగా విభజించి టీసీ మెంబర్లను ఎన్నుకునేవారు. వారిలో ఒకరు సంఘ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. నిధుల విడుదలలో పారదర్శకత పాటించేందుకు ఉమ్మడి అకౌంట్ ఉండేది. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లింపు జరిగేది. యంత్రాల సాయంతో రైతుకు అవసరమైన పనులు చేపట్టే వారు. దీంతో చెరువులు, కాలువల పరిధిలో శివారు ఆయకట్టుకు సైతం సాగునీరు అందేది. ఏడాది పొడవునా ఎటువంటి ఇబ్బందులుండేవి కావు. ఐదేళ్లుగా ఆ పరిస్థితే లేదు. ప్రస్తుతం సంఘం స్థాయిని బట్టి ఏఈ, జేఈ, డీఈఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సంఘాలు నిర్వీర్యమై ప్రాజెక్టుల శివారు రైతులకు సాగునీరందక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడ్డారు. పంట కాల్వలు, మురుగు కాల్వల్లో పూడిక పెరిగి చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురికావడంతో రైతులు ఆపారంగా నష్టపోయారు. సాగునీటి సంఘాల ఆవశ్యకతను గుర్తించిన కూటమి ప్రభుత్వం రైతుల భాగస్వామ్యాన్ని పునరుద్ధరించే విధంగా ఎన్నికల నిర్వహణకు ఆమోదముద్ర వేసింది.