జిల్లాలోని మద్యం దుకాణాలకు 2266 దరఖాస్తులు
పాలసముద్రం మండలంలో గరిష్టంగా 82 టెండర్లు
రొంపిచెర్లలో కనిష్టంగా 5 టెండర్లు
పుంగనూరు మున్సిపాలిటీలో తగ్గిన టెండర్లు
ప్రభుత్వానికి రూ. 45 కోట్ల ఆదాయం
నేడే లక్కి డిప్ ద్వారా దుకాణాల కేటాయింపు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
చిత్తూరు జిల్లాలో మద్యం దుకాణాలకు 2266 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. సగటున ఒక్కొక్క దుకాణానికి 22 దరఖాస్తులు అందాయి. వీటి కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి 45 కోట్ల రూపాయల ఆదాయం లభించిం.ది జిల్లాలోని పాలసముద్రం, యాదమరి, ఐరాల మండలాలకు భారీగా దరఖాస్తుల దాఖలు కాగా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మున్సిపాలిటీ రొంపిచర్లలకు, వి. కోట మండలాలకు తక్కువ సంఖ్యలో టెండర్లు దాఖలు అయ్యాయి
పాలసముద్రం మండలంలోని మద్యం దుకాణానికి గరిష్టంగా 82 టెండర్ల రాగా, యాదమరి మండలంలోని దుకాణానికి 43, ఐరాల మండలంలోని దుకాణానికి 40 దరఖాస్తులు వచ్చాయి. కనిష్టంగా రొంపిచర్ల మండలంలోని రెండు దుకాణాలకు ఐదేసి వంతున దరఖాస్తులు వచ్చాయి. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని మూడు దుకాణాలకు 9 వంతున దరఖాస్తులు లాగా, ఒక దుకాణానికి 8, వి.కోట మండలంలోని రెండు దుకాణాలకు 9 వంతున దరఖాస్తులు అందాయి. జిల్లాలోని మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ అయిన వారం రోజుల వరకు చాలామంది మందకొడిగా టెండర్లు దాఖలు అయ్యాయి. ఒక్కొక్క దుకాణానికి రెండు, మూడు టెండర్లు కూడా దాఖలుకాలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. చిత్తూరు జిల్లాలో పలువురు మద్యం వ్యాపారస్తులు సిండికేట్ గా తయారైన విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సిండికేట్లను సహించేది లేదని చెప్పింది. సిండికేట్లకు సహాయపడితే సంబంధిత ఎక్సైజ్ అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయని కఠినంగా హెచ్చరించింది. ఈ మేరకు మద్యం సిండికేట్లకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులను అధిష్టానం హెచ్చరించింది. మద్యం విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరింది. సిండికేట్ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని, ఈ విషయంలో తలదొడ్చడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఎవరైనా సిండికేట్ చేసే ప్రయత్నంలో ఉంటే విరమించుకోవాల్సిందిగా కోరింది. ఈ విషయం నిర్ధారణ అయితే, టిడిపి నాయకుల పైన కఠిన చర్యలు ఉంటాయని కూడా కేంద్ర పార్టీ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సిండికేట్ల నుంచి కొంత వెనక్కి తగ్గారు. ఎవరికి వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సంకేతాలను పంపారు. దీంతో జిల్లాలో మద్యం దుకాణాలకు ఒకసారిగా దరఖాస్తులు పెరిగాయి. దీంతో 8వ తారీఖున జిల్లాల్లో భారీ ఎత్తున మద్యంతో దుకాణాలకు టెండర్లు వేశారు. భారీగా వస్తున్న స్పందన చూసి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజులపాటు మద్యంతో దుకాణాలకు టెండర్లను పొడిగించింది. దేనితో జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల సంఖ్య 2266కు చేరింది. పలువురు నేరుగా దరఖాస్తు చేయగా, మరి కొంతమంది ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారు. కొన్ని మండలాల్లో మాత్రం తగ్గువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో సగటున ఒక్కొక్క దుకాణానికి 22కి పైగా దరఖాస్తులు దాఖలు అయ్యాయి. ఈ దరఖాస్తులకు దరావత్తుగా రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుసుమును ప్రభుత్వం తిరిగి చెల్లించదు. ఇది ప్రభుత్వానికి ఆదాయమే. కావున దరఖాస్తు రూపంలో 45 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికలు పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పనిచేయలేదని తెలుస్తోంది. పుంగనూరు నియోజకవర్గంలో మద్యం దుకాణాలను తమ ఆధీనంలో ఉంచుకున్న ఒక నాయకుడు ఇతరులు మద్యం దుకాణాలకు టెండర్లు వేయకుండా అడ్డుపడినట్లు సమాచారం. ఒకవేళ టెండర్లు వేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించడంతో, ఆ నియోజకవర్గంలో మాత్రం మద్యం టెండర్లు తగ్గాయి. పుంగనూరు మున్సిపాలిటీలోని నాలుగు దుకాణాలకు 9 దరఖాస్తుల వంతున దాఖలు కావడం ఎందుకు నిదర్శనం. ఆ నియోజకవర్గానికి చెందిన రొంపిచర్ల మండలంలో సైతం రెండు దుకాణాలకు 5వంతున దాఖలయ్యాయి. ఈ విషయాలను పరిశీలిస్తే పుంగనూరు నియోజకవర్గంలో మద్యం వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడినట్లు విదితమవుతుంది. అలాగే అక్కడ ఆధిపత్యం చాలా ఇస్తున్న ఒక నాయకునికి వ్యతిరేకంగా ఇతరుల నామినేషన్లు వేయడానికి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పలమనేరు నియోజకవర్గంలో కూడా మద్యం వ్యాపారస్తులు సిండికేట్ అయినట్లు సందేహం కలుగుతుంది. ఈ మండలంలోని రెండు దుకాణాలకు 9 వంతున దరఖాస్తుల రావడం ఎందుకు ఊతమిస్తోంది. జిల్లా స్థాయిలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందినా, పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం దరఖాస్తుల సంఖ్య తగ్గదాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మద్యం దుకాణాలకు వచ్చిన టెండర్లను సోమవారం జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీసి, మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. చిత్తూరు కాణిపాకం రోడ్డులోని ఆర్ ఆర్ గార్డన్ లో ఈ లక్కి డ్రా తీయనున్నారు. ఇందుకు ఇప్పటికి జిల్లా వ్యాప్తం టెండర్లు వేసిన వారు చిత్తూరు చేరుకున్నట్లు సమాచారం.