3, అక్టోబర్ 2024, గురువారం

దేవి నవరాత్రులకు ముస్తాబవుతున్న చిత్తూరు

 తొమ్మిది రోజుల పాటు రంగరంగా వైభవంగా ఉత్సవాలు 

రోజుకు ఒక అవతారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవార్లు 

దుర్గమ్మ, చౌదేశ్వరమ్మ, పోన్నెమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి
విజయదశమితో  ముగియనున్న దేవీ నవరాత్రులు 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి  దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా నిర్వహించే దేవి నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతాయి.  శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వీటికి ధీటుగా చిత్తూరు జిల్లా కేంద్రంలో వెలసిన అమ్మవార్లకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చిత్తూరు గిరింపేటలోని దుర్గమ్మ, చౌడేశ్వరమ్మ, పాత బస్టాండ్ సమీపంలోని పోన్నెమ్మ, తేనేబండలో వెలసిన ముత్యాలమ్మకు తొమ్మిది రోజుల పాటు రంగరంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. వందలాదిగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. శ్రీ దేవీ భాగవతం ప్రకారం నవరాత్రి తొమ్మిది రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనవి. అందుకే వీటిని దేవి నవరాత్రులని, శరత్కాలంలో వచ్చే నవరాత్రులును శరన్నవరాత్రులని అంటారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేసి, ఒక్కోరోజు ఒక  రంగు వస్త్రంను సమర్పిస్తారు. విజయదశమితో దేవీ నవరాతరులు ముగుస్తాయి. 

మొదటి రోజు : ఈ రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు క్షీరాన్నం సమర్పిస్తారు. ఈ రోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు.

రెండో రోజు : ఈ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు. ఈ రోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు.

మూడో రోజు : ఈ రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు.

నాలుగో రోజు : ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు.

ఐదో రోజు : ఈ రోజు అమ్మవారు శ్రీ చండీ దేవిగా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీ దేవీ అవతారం. ఈ రోజు అమ్మవారి ఎర్రని పూలతో పూజించాలి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి.

ఆరో రోజు : ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు.

ఏడో రోజు : ఈ రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దధ్యోదనం నివేదిస్తారు.

ఎనిమిదో రోజు : ఈ రోజు దుర్గాష్టమి పర్వదినం. ఈ రోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.

తొమ్మిదో రోజు : ఈ రోజు మహర్నవమి పర్వదినం. ఈ రోజునే మహిషుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్ధినిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఈ రోజు ఆకు పచ్చని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు చక్ర పొంగలి నివేదిస్తారు.

విజయదశమి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులవుదాం.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *