8, అక్టోబర్ 2024, మంగళవారం

వ్యూహం మార్చుకున్న వైసిపి నాయకులు

జగన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దు 

ఊపిరి పీల్చుకున్న పోలీసులు 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

పుంగనూరులో జరిగిన మైనారిటీ  బాలిక అస్పియా  కిడ్నాప్, హత్య విషయంలో వైసీపీ పార్టీ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అస్పియా  కిడ్నాప్, హత్యకు నిరసనగా బుధవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చుతారని మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అయితే పోలీసులు కేసును  ఛేదించడం, నిందితులను గుర్తించడం చరవేగంగా జరిగిపోయాయి.  వైసీపీ పార్టీ అనుకున్న విధంగా అత్యాచారం జరగలేదని పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడి అయింది. తొలి నుండి వైసిపి నాయకులు  బాలిక మీద అత్యాచారం జరిగిందని ఆరోపణలు చేస్తూ వచ్చారు. అత్యాచారం జరగలేదని తెలియడంతో వైసిపి పార్టీ తమ రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బుధవారం పుంగనూరుకు రావాల్సిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దయినట్లు మాజీమంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. 


ఈనెల రెండవ తారీఖున పుంగనూరు కి చెందిన బాలిక అస్పియా  కనిపించకుండా పోయింది. ఈ విషయం అదే రోజు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సంఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గాలించారు. అయితే ఈ విషయాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసిపి భావించింది. ఇందులో భాగంగా పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నెల 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుంగనూరు రానున్నట్లు వారు అదే రోజు వెల్లడించారు. జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆదివారం నాడు ముగ్గురు రాష్ట్ర మంత్రులు పుంగనూరుకు విచ్చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి షరీఫ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దోషులు ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ఫోన్లో మాట్లాడి తన ప్రగాఢ సంతాపన్న వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే రోజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాలికను కిడ్నాప్, హత్య చేసిన వారిని గుర్తించామని ప్రకటించారు. బాలిక తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తూ హసీనా అనే మహిళకు 3.6 లక్షల రూపాయలను అప్పు ఇచ్చారని, అప్పు తిరిగి చెల్లించకపోవడంతో బాలిక తండ్రి ఫోనులో కఠినంగా మాట్లాడాలని తెలిపారు. ఇది అవమానంగా భావించిన హసీనా ఆమె కుమార్తె రేష్మ మరో యువకుడు కలిసి ఈ ఘాతకానికి పాల్పడ్డారని జిల్లా అధికారులు వివరించారు. దీనితో కిడ్నాప్, హత్య చిక్కుముడి విడిపోయింది. రాష్ట్ర హోం మంత్రి అనిత మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్టులో ఎక్కడ అత్యాచారం జరిగినట్లు లేదని, ముక్కు, నోరు మూసి ఆ బాలికైన హత్య చేశారని, హత్య చేసిన తర్వాత మూడు కిలోమీటర్లు తీసుకెళ్లి చెరువులో పడవేశారని స్పష్టంగా వివరించారు. దీంతో ఇప్పటివరకు బాలికపైన అత్యాచారం జరిగిందని ఆరోపించిన వైసీపీ నాయకుల నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పుంగనూరుకు  వస్తే బాలిక మీద అత్యాచారం జరిగిందని చేసిన దుష్ప్రచారాన్ని బాధిత కుటుంబం నిలతీస్తారని భావించినట్లు తెలుస్తోంది. జరగని విషయాన్ని జరిగినట్లు వైసిపి నాయకులు ఆరోపించడం, అని కొన్ని పత్రికల్లో  రావడం పట్ల ఆ కుటుంబం ఆవేదనతో ఉంది. కావున జగన్ వచ్చినా, వారు తమతో మాట్లాడుతారో లేదో అన్న మీమాంస వైసిపి నాయకులలో ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు ప్రజాపక్ష నేత హోదాలో సాగు నీటి ప్రాజెక్టుల  సందర్శనకు వచ్చినప్పుడు పుంగనూరుకు రాకుండా వైసీపీ నాయకుల అడ్డుకున్నారు. రెచ్చగొట్టే విధంగా నినాదాలు, ర్యాలీలు నిర్వహించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక పోలీసు జీపు దగ్దం కాగా, పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమా, చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఇక జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీద సుమారు 200 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరి మీద హత్యాయత్నం కేసులను నమోదు చేశారు. నెలరోజుల పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కోర్టు నుండి బెయిల్ తీసుకుని వచ్చిన తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి బుధవారం పుంగనూరుకు వస్తే,  తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీద భారీగా కేసులు బనాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ సంఘటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద కూడా ఎక్కడ కేసును  బనాయిస్తారో  అని వైసిపి నేతలు ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జగన్మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటనకు  వస్తే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాగూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆందోళనలు, నినాదాలు చేస్తారు. దీంతో పోలీసులు చాలా టెన్షన్ పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దయిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. జగన్ వస్తే, జిల్లాలో టెన్షన్ వాతావరణ ఏర్పడేది. జిల్లా నలుమూలల నుంచి పుంగనూరులో పోలీస్ బలగాలను మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో పోలీసులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *