ఇంటింటికి రేషన్ సరఫరాపై జిల్లాలో సర్వే
రేషన్ షాపు డీలర్లకే ఓటు వేసిన కార్డుదారులు
ఎండిఆర్ వాహనాలు ఇబ్బందికరంగా ఉన్నట్లు వెల్లడి
ప్రభుత్వానికి నివేదించిన అధికారులు
త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
జిల్లాలో అమలు జరుగుతున్న ఇంటింటికి రేషన్ విధానం మీద జిల్లా పౌరసరఫరాల అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో రేషన్ డీలర్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ, ఎండిఆర్ వాహనాలు ద్వారా రేషన్ పంపిణీ గురించి కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వే కార్యక్రమంలో పౌరసరఫరాలు శాఖ అధికారులతో పాటు రెవిన్యూ అధికారులు కూడా పాల్గొన్నారు. ఎక్కువమంది కార్డుదారులు తమకు పాత విధానమే అంటే రేషన్ షాప్ డీలర్ల ద్వారా తీసుకోవడమే అనుకూలంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్ సరఫరా మీద త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. కొత్త విధానాన్ని రద్దుచేసి పాత విధానంలోనే నిత్యవసర వస్తువులు పంపిణీకి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
చిత్తూరు జిల్లాలో 1379 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా 5.43 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. కిలో రెండు రూపాయలు బియ్యం పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి రేషన్ షాప్ డీలర్ల ద్వారానే నిత్యవసర వస్తువులు సరఫరా జరుగుతుంది. అయితే వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఇంటింటికి నిత్యవసర వస్తువుల సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు గాని జిల్లాలో ఎండిఆర్ వాహనాలను కార్పొరేషన్లో ద్వారా కొనుగోలు చేసింది. ఈ వాహనాల ద్వారా ప్రతినెల ఇంటింటికీ నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే జిల్లాలో ఈ పథకం ఘోరంగా విఫలమైంది. పేరు ఇంటింటికి నిత్యవసర వస్తువుల సరఫరా అయినా, ఎండిఆర్ వాహనాలను వీధిలో ఒక చోట నిలబెడుతున్నారు. వినియోగదారులు వచ్చి తమ రేషన్ తీసుకొని వెళ్తున్నారు. రేషన్ బండి వచ్చినప్పుడు వినియోగదారులు లేకుంటే, వారు ఆ నెలలో నిత్యావసర వస్తువులను నష్టపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీనాలీ చేసుకుని కార్డుదారులు నిత్యవసర వస్తువులను పొందలేక నానా అకచాట్లు పడుతున్నారు. అలాగే ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఎలాగో రేషన్ షాప్ డీలర్లకు కమిషనర్ ఇస్తున్నారు. దానికి తోడు అదనంగా రేషన్ బండ్లకు నెలకు ఒక్కొక్క దానికి 18 వేల రూపాయలను అందజేస్తున్నారు. రెండు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతుంది. రేషన్ షాప్ డీలర్లు రేషన్ ఇచ్చే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఒకటవ తేదీ నుంచి 10వ తేదీ వరకు జిల్లాలోని 1,379 రేషన్ షాపులు ఓపెన్ అవుతాయి. పది రోజులపాటు ఈ రేషన్ షాపుల ద్వారా నిత్యాసర వస్తువులు సరఫరా జరుగుతుంది. కార్డుదారులకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్లి నిత్యవసర వస్తువులను తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఎండిఆర్ వాహనాలు కేవలం 336 మాత్రమే ఉన్నాయి. కావున ఈ 336 వాహనాల ద్వారా మాత్రమే నిత్యవసర వస్తువులను తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ వాహనాలు ఒక్కొక్క గ్రామంలో ఒకరోజు మాత్రమే ఉంటాయి. ఆ సమయంలో కార్డుదారులు నిత్యవసర వస్తువులను తీసుకోకపోతే ఆ నెలలో వారు నష్టపోవాల్సి వస్తుంది. ఫలితంగా పాత విధానానికి జిల్లాలోని కార్డుదారులు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో 2021 ఫిబ్రవరి నెల నుంచి ఎండిఆర్ వాహనాలు ద్వారా నిత్యవసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఈ వాహనం ద్వారా రోజూ 90 బియ్యం కార్డులకు నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. నెలలో 10 రోజులకు పాటు ఈ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తున్నారు. మిగిలిన 20 రోజులు పాటు ఈ వాహనాలు వృధాగా ఉంటున్నాయి. దశాబ్దాలుగా సాఫీగా సాగిపోతున్న రేషన్ సరఫరా వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుదిపేసింది. ఇంటింటికీ రేషన్ అంటూ వాహనాలతో హైరానా చేసింది. ఇకపై ఇంటివద్దే రేషన్ తీసుకోచ్చనుకున్న లబ్ధిదారుల ఆశలకు సమస్యలు కళ్లెం వేశాయి. ఎక్కడో వీధి చివరన వాహనం ఆగితే అక్కడి దాకా వెళ్లాల్సి రావడం తలనొప్పిగా మారింది. వాహనాలు ఎప్పుడొస్తాయో తెలియకపోవడం పనులు మానుకొని ఎదురుచూడటం రాకపోతే ఉసూరుమనడం సర్వసాధారణంగా మారిపోయాయి. సాంకేతిక సమస్యలు తలెత్తి పరికరాలు పని చేయకపోయినా ఆ పాపం లబ్ధిదారులపైనే పడుతోంది. ఈ పోస్ మిషన్‌లో ప్రతి కార్డుదారుడి వేలిముద్ర తీసుకుని అందులో వారికి కావాలిసన సరుకులను నమోదు చేసి రేషన్ పోయాల్సి ఉంది. చాలా సార్లు సర్వర్‌లు మొరాయించడంతో ఎండీయూ ఆపరేటర్లు, కార్డుదారుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. సర్వర్ మొరాయించ డంతో గంటల పాటు కార్డుదారులతో పాటు ఆపరేటర్లు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిళ్లకు ఆపరేటర్లు గురవుతున్నారు. రేషన్ బియ్యం కోసం పనులకు వెళ్లకుండా వేచిచూడాల్సి వస్తోంది. దీనికి తోడు రేషన్ తీసుకోకపోతే కార్డు తొలగిస్తారని తద్వారా ప్రభుత్వ పథకాలకు దూరమవుతామనే భావన ప్రజల్లో ఉండడంతో పడిగాపులు తప్పడం లేదు. వీటికి తోడు కొన్ని రేషన్‌కార్డులకు సంబంధించి బియ్యం, పంచదారకు వేర్వేరుగా రెండు వేలిముద్రలు సేకరించాల్సి వస్తోందని, దీనివల్ల మరింత సమయం పడుతోందని, సర్వర్‌లు పని చేయకపోవడం, ఇలా రెండు వేలిముద్రలు తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటోందని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన రేషన్ పంపిణీ ప్రారంభిస్తే దాదాపు 10 తేదీ దాటే వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఇక సిగ్నల్స్ సరిగ్గా లేని ప్రాంతాల్లో, ఇళ్లు దూరం దూరంగా ఉండే ప్రాంతాలకు చెందిన ఆపరేటర్ల బాధలు అన్నీ, ఇన్నీ కావు. ఈ కారణంగానే చాలా మంది ఆపరేటర్లు మానేస్తున్నారు. వచ్చే జీతానికి పడే కష్టం, ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని ఆపరేటర్లు ఆవేదన చెందుతున్నారు. వీటితో పాటు సర్వర్‌లు మొరాయించడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. డీలర్ ఊరిలోనే ఉంటాడు కాబట్టి వీలున్నప్పుడు వెళ్లి రేషన్ దుకాణానికి వెళ్లి సరకులు తెచ్చుకునే వెసులుబాటు ఉండేదని కార్డుదారులు చెబుతున్నారు. వాహనాల వ్యవస్థ వచ్చాక గందరగోళం మొదలైంది. ఇంతకుముందు బియ్యంతోపాటు, గోధుమపిండి, కందిపప్పు, వంటనూనె, చక్కెర వంటి నిత్యావసరాలను తక్కువ ధరకే ఇస్తుండగా వైఎస్సార్సీపీ సర్కారు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తూ వచ్చిన క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాలను కనుమరుగు చేసింది. రేషన్ వాహనం వచ్చే సమయానికి ప్రజలు ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అధిక ఖర్చు చేసి బయట కొనవలసిన పరిస్థితి. రేషన్ వాహనం ఏ టైంకు వస్తుందో తెలియదు. వీటి కోసం ప్రజలు పనులకు వెళ్లకుండా ఉండాలి. ఈ వాహనం ద్వారా రేషన్ పంపిణీ అయ్యే ఖర్చును నిత్యావసర వస్తువులను అధికంగా ఇస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. గత ప్రభుత్వ హయాంలో బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర లాంటివి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కో ఎండీయూ వాహనానికి 2, 3 రేషన్ షాపులను అధికారులు కేటాయించారు. ఒక్కో వాహనానికి ఆపరేటర్, డీలర్, హమాలీ, వీఆర్ఓలను బాధ్యులుగా ఉంచారు. రెట్టింపు ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతోందా అంటే అదీ లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానం వల్ల కార్డుదారులతో పాటు తామూ తీవ్రంగా నష్టపోతున్నామని రేషన్ డీలర్లు కూడా వాపోతున్నారు. ఈ విధానంతో విసిగిపోయిన ప్రజలు పాత విధానాన్నే తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో ఇంటింటికి రేషన్ విధానానికి స్వస్తి పలికి పాత విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.