31, జులై 2024, బుధవారం

పెద్దిరెడ్డి కట్టడికి 'బాబు' వ్యూహం !

* జిల్లా ఇన్చార్జి మంత్రిగా  రాంప్రసాద్ రెడ్డి

* పెద్దిరెడ్డి  అక్రమాలపై వరుస కేసులు 

* పెద్దిరెడ్డి శత్రువులకు అందలం 

* తొలుత పెద్దిరెడ్డి  అనుచరుల కట్టడి 

* చివరి లక్ష్యంగా పెద్దిరెడ్డి 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని పూర్తిగా కట్టడి చేయడానికి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు వ్యూహం ప్రకారం పావులు కదుపుతున్నారు. తొలుత అయన అక్రమాలను వెలికి తీయడం, అనుచరులను కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసి, ఆయనకు దూరం చేయడం, చివరిగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడం. ఈ మేరకు హ్యుహాన్ని పకడ్భందిగా రచించి, అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు జిల్లా ఇంచార్జి మంత్రిగా రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని నియమించనున్నారు. మొత్తం వ్యూహాన్ని రాంప్రసాద్ రెడ్డి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా  మదనపల్లిలో రికార్డులు దగ్ధం విషయం తెలియగానే, పోలీసు ఉన్నతాధికారులను హుటాహుటిన హెలికాప్టర్ లో పంపంపారు. రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శిని పంపించి, కాలిన దస్త్రాలను చాలా వరకు రికవరీ చేశారు. కేసు దర్యాప్తు యుద్దప్రాతిపతికన జరుగుతోంది. మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరి ప్రసాద్‌, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ లను  సస్పెండ్ చేశారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్ళలో పోలీసుల తనిఖీలు ముమ్మరంగా జరుతున్నాయి. జిల్లాలో ఆయనను రాజకీయంగా ఎదుర్కోవడంలో పాటు కేసులను పకడ్భందిగా నమోదుచేసి, శిక్షలు పడేలా చూడాలని భావిస్తున్నారు. కక్ష సాధింపు చర్యగా కాకుండా చట్ట బద్ధంగా పెద్దిరెడ్డి పని పట్టాలని, రాజకీయంగా, వ్యాపారపరంగా కూడా డెబ్భ తీయాలని భావిస్తున్నారు.


పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అక్రమాలపై కేసులు పెట్టి శిక్షలు వేయించడంపై దృష్టి పెట్టారు. మదనపల్లి జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం సంఘటనలో వెళ్లన్నీ పెద్దిరెడ్డి వైపే చూపిస్తున్నాయి. పెద్దిరెడ్డి పిఎ శశికాంత్ ఇంట్లో పోలీసులు నాలుగు పెట్టెల దస్త్రాలు స్వాదీనం చేసుకున్నారు.ఎంపి మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు అక్కులప్పను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు.  దొరికిన ఆధారాల ఆధారంగా ఇప్పటి వరకు 229 కేసులు పెట్టారని తెలిసింది. ఇందులో రామచంద్రా రెడ్డిపై 20, ద్వారకనాద రెడ్డిపై ఎనిమిది, మాధవ రెడ్డిపై తొమ్మిది, వైసిపి నేతలపై 27 కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేశారు. అలాగే ఇతరుల పేర్లతో 96, పేర్లు ప్రస్తావించ కుండా 69 కేసులు పెట్టనున్నారని తెలిసింది. సేకరించిన కీలక ఆధారాల ఫోరెన్సిక్ నివేదికలు రాగానే పెద్దిరెడ్డి, ఇతర ముఖ్య నేతలను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఇంచార్జి  మంత్రిగా రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డికి చిత్తూరు జిల్లా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధం అయ్యింది. ఆయన అయితేనే జిల్లా పరిషత్ సమావేశాలు, ఇతర అంశాలలో పెద్దురెడ్డిని, వైసిపి నేతలను సమర్థవంతంగా ఎదుర్కొగలరని భావిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు ఐదవ తేదీన చంద్రబాబు అంగళ్ళు, పుంగనూరు పర్యటనకు వచ్చిన సందర్భంలో అల్లర్లు జరిగిన సందర్భంలో రాంప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను సేకరించి అండగా నిలిచారు. దీనితో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల అక్రమాలపై కేసులు పెట్టడంలో కూడా ఆయన గట్టిగా ఉంటారని నమ్ముతున్నారు.


ఇక   జిల్లాపరిషత్, మండల పరిషత్ లు ఇతర పదవులు వైసిపి చేతిలో ఉన్నాయి. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ సభ్యునిగా ఉన్నారు. ఆయన లోక్ సభ పరిధిలోని పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉన్నందున ఆయన ఇక్కడ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి చిరకాల వ్యతిరేకులు కీలక పదవులు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. వజ్రాన్ని వజ్రం తో కోయాలన్నట్టు రెడ్డి సామాజిక వర్గం నేతలు అయితే మంచిదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు మాజీ ఎమ్మేల్యే సి కె బాబుకు రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టిలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. 1994లో జిల్లా నుంచి ఆయన ఒకరే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయనను కాదని పీసీసీ అధ్యక్షుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పెడ్డిరెడ్డిని డిసిసి అధ్యక్షునిగా చేశారు. దీనితో విభేదించిన సి కె బాబు పెద్దిరెడ్డిని చిత్తూరు కాంగ్రెస్ కార్యాలయంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. ఈ వైరం వల్లనే పెద్దిరెడ్డి సి కె బాబుకు వైసిపిలో చోటు లేకుండా చేశారు. ఆయన టిడిపిలో చేరినప్పటి టిక్కెట్టు రాలేదు. అయినా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిత్తూరు అభ్యర్థి గురజాల జగన్ మోహన్ నాయుడు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా అందరూ భయపడుతున్న సమయంలో పెద్దిరెడ్డి, ఇతర మంత్రులు, నేతలపై పోరాటం చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డికి కీలక పదవి ఇస్తారని సమాచారం. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెదిరెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. పోటీ  జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ప్రకటించుకుని పెదిరెడ్డిని ఇబ్బంది పెట్టారు. 1999 ఎన్నికల్లో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని పెద్దిరెడ్డి పట్టుబట్టి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా సుధాకర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనను 2020 లో చంద్రబాబు పిలిచి పార్టీ పదవి ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పెద్దిరెడ్డితో పోటీ చేసి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డికి పదవి వచ్చే అవకాశం ఉంది. ఒక వైపు పెద్దిరెడ్డి వైరి పక్షాన్ని బలోపేతం చేస్తూ, మరో వైపు ఆయనను, కుటుంబ సభ్యులను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీయడానికి పకడ్భందిగా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారు. 

పో రై  గంగ 1 రామచంద్రా రెడ్డి

గంగ 2 రాంప్రసాద్ రెడ్డి  

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *