16, జులై 2024, మంగళవారం

982 ఎకరాల ప్రభుత్వ అనాదీనం భూమి హం ఫట్

మాజీ మంత్రి అనుచరులకు కట్టబెట్టిన అధికారులు

నిబంధనలకు విరుద్దంగా కధ నడిపిన జేసి   

 విచారణ ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం 

శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు వెల్లడి 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

982 ఎకరాల ప్రభుత్వ భూములు ఒక మాజీ మంత్రి తన అనుచరులకు కట్టబెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం మీద లోతైన విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఎందుకు బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో విడుదల చేసిన ప్రకృతి వనరుల దోపిడీ శ్వేతపత్రంలో వివరించారు. శ్వేత పత్రం విడుదల సందర్భంగా పుంగనూరులో కబ్జాకు గురైన 982 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రముఖంగా ప్రస్తావించారు. పుంగనూరుతో పాటు కార్వేటినగరంలో కూడా వందలాది ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. ఈ విషయాలు మీద విచారణ జరుగుతుందని, ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాకుండా, నిందితుల మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. 


పుంగనూరు మండలం రాగానపల్లెలో 982 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూముల విషయమై కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. జమీందారీ పట్టా అంటూ కొంతమంది కోర్టుకు వెళ్లారు. దీనిలో కొంత భాగాన్ని వారు ఇతరులకు విక్రయించారు. కొంత భాగంలో ఉద్యానవన పంటలను పండిస్తున్నారు. విదుత్తు అధికారులు సర్వీసును కూడా ఇచ్చారు. ఈ భూములు వివాదాస్పదం కావడంతో ఈ భూములను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూముల మీద కన్ను పడింది. ఏకంగా 982 ఎకరాల భూమి ఉందని తెలిసి దానిని కబ్జా చేయడానికి పావులు కదిపారు. ఇందుకు ఒక మాజీ మంత్రి రంగంలోకి దిగి తన అనుచరులకు పట్టాల రూపంలో ఇప్పించడానికి ప్రయత్నం చేశారు. ఈ భూములలో సుమారు 600 ఎకరాలను తమ అనుచరులకు పట్టాలుగా ఇప్పించుకున్నట్లు సమాచారం. ఇందుకు అప్పుడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన, ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనతోపాటు ఒకరిద్దరు ప్రభుత్వాధికారులు కూడా మాజీ మంత్రికి  అనుకూలంగా పావులు కదిపారని సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. రాగానపల్లెలోని 982 ఎకరాల భూమిని 1907లో అప్పటి పుంగనూరు జమీందారు మహదేవరాయలు పేరుతో పట్టా ఇచ్చారు. 1948 చట్టం ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం ఎస్టేట్ అబాలిష్ యాక్టు ప్రకారం స్వాధీనం చేసుకుంది. అనంతరం సెటిల్మెంట్ అధికారులు దీనిపై సుమోటాగా విచారణ చేసి ఈ భూమికి మహాదేవరాయలు కుమారుడు శంకర్ రాయల్ పేరుతో 1958లో రఫ్ పట్టా ఇచ్చారు. తర్వాత ఆయన దీన్ని వెంకటస్వామి, రెడ్డప్పరెడ్డిలకు విక్రమించారు. రైతు వారి పట్టాలు వచ్చాయి. తర్వాత ఈ భూమిని పలుమార్లు పలువురికి విక్రయించారు. రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. 1973లో సెటిల్మెన్ డైరెక్టర్ ఈ భూమి అనుభవదారులకు నోటీసులు ఇచ్చి జమీందారీ పట్టా నిబంధనలకు విరుద్ధమని అది సాగుభూమి కాదని అడవి అని పేర్కొన్నారు. సాగుభూమిగా మార్చడానికి 1908 నాటి ఎస్టేట్ అబాలిష్ ల్యాండ్ చట్టప్రకారం అప్పటి కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. 1997లో శంకర్ రాయులకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు. అనంతరం వెంకటస్వామి, రెడ్డిప్ప రెడ్డి వారసులు ఈ భూమి హక్కుల కోసం కోర్టులో కేసును దాఖలు చేశారు. దీనిపై 2022లో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేష్ విచారణ చేపట్టారు. 1907 రఫ్ పట్టాను ధ్రువీకరించారని, దీన్ని మళ్లీ విచారించి పట్టా ఇవ్వనక్కర్లేదని పేర్కొన్నారు. 1908 ఎస్టేట్ అబాలిష్ యాక్టు ముందే పుంగునూరు జమీందారుకు పట్టా ఇచ్చారని, ఆయనకే ఆ భూమి మీద అధికారం  ఉందని తెలిపారు. దీనిపై అనేక లావాదేవీలు జరగడం ద్వారా పట్టా భూమిగా గుర్తించాలని జెసి స్పష్టం చేశారు. ఇవి వ్యవసాయ భూములే గాని ఈ భూముల్లో యుకలిప్టస్, మామిడి తదితరుల తోటలు పెంచుతున్నారని వివరించారు. అధికారులు శిస్తు కూడా వసూలు చేస్తున్నారని, విద్యుత్ కలెక్షన్లు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఫలితంగా ఇవి పట్టా భూములనీ, వీటిని ఎవరికైనా విక్రమించుకోవచ్చని, రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చని తెలిపారు. అయితే రఫ్ పట్టా చల్లదని న్యాయస్థానాలలు ఇచ్చిన తీర్పులను అప్పటి జేసి పట్టించుకోలేదు. కొత్త పట్టా అవసరం లేదని రఫ్ పట్టా సరిపోతుందని, నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించారు. దీనితో ఈ భూములను మాజీ మంత్రి అనుచరులకు పట్టాలుగా అందజేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ విషయమై ఏం జరుగుతుందోనని భయపడిన అధికారులు తిరిగి ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే అదే సర్వే నంబరు సబ్ డివిజన్లో  మాజీ మంత్రి అనుచరులకు ఇచ్చిన భూముల వివరాలు కూడా నమోదు చేశారు. దీనితో 982 ఎకరాలకు అదనంగా మరో 982 ఎకరాలను కలిపి ఒకే సర్వే నెంబర్లు రెట్టింపుగా నమోదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మాజీ మంత్రి అనుచరులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని సిఫారసు చేశారు. వీటి మీద తొందర్లోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగస్వామ్యం అధికారుల మీద కూడా చర్యలు తప్పవని తెలుస్తోంది. అయినా ఇప్పటికీ సమారు 600 ఎకరాలు మాజీ మంత్రి అనుచరుల పేర్లతోనే ఉండడం, వారి ఆధీనంలోనే కొనసాగడం విశేషం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *