కోట్లాది రూపాయల వ్యయం - ఫలితాలు పూజ్యం
జిల్లాలో సాగునీటి పధకాల తీరుతేన్నులు
గత ఏడాది రూ. 676 కోట్ల వ్యయం
ఎకరా కూడా అదనంగా సాగులోకి రాని వైనం
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారుల పనితీరు విమర్శలకు దారితీస్తోంది. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఇరిగేషన్ పనుల నిమిత్తం వ్యయం చేస్తున్నారు. అయితే ఫలితం మాత్రం రావడం లేదు. సాగులో ఉన్న భూమిని స్థిరీకరించడం తప్ప కొత్తగా భూమిని సాగులోకి తీసుకొని రావడం లేదు. జిల్లాలో నీటి పరిధిలో శాఖ గుత్తేదారులకు అనుకూలంగా పనిచేస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. నీటిపారుదల శాఖ కారణంగా రైతులకు ఏమాత్రం మేలు జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల్లో ఈ విషయాలను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. ఇందుకు సమాధానం చెప్పలేకుండా అధికారులు మౌనం వహించారు.
గత ఆర్థిక సంవత్సరం చిత్తూరు జిల్లాలో వివిధ పథకాల కింద 139 పనులను ఇరిగేషన్ శాఖ అధికారులు చేపట్టారు. ఇందుకు 675.73 కోట్ల రూపాయలతో అంచనాలను తయారు చేశారు. వీటికి టెండర్లు వెలిసి పనులను ప్రారంభించారు. కొన్ని పనులు పూర్తిఅయ్యాయి. పలు పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ 676 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులలో 4 పధకాలలో ఎక్కడ అదనంగా ఒక ఎకరా కూడా అదనంగా సాగులోకి తీసుకొని రాలేదు. ఒక పధకం కింద మాత్రమే 18,734 ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే సాగు అవుతున్న 46,677 ఎకరాల భూమిని స్థిరీకరిస్తున్నట్లు మాత్రం నీటిపారుదల అధికారులు నివేదికలో తెలియజేశారు. ఈ నివేదిక మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్న, ఒక ఎకరా భూమి కూడా అదనంగా సాగులోకి తీసుకొని రాకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జీవనదులు, భారీ నీటినిపారుదల ప్రాజెక్టులు లేవు. వ్యవసాయం మొత్తం చెరువులు, బోరు బావుల మీదనే ఆధారపడి జరుగుతోంది. ఫలితంగా ఇరిగేషన్ పనులలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. భారీగా నిధులను విడుదల చేస్తోంది. అయితే ఈ విడుదలైన నిధులు చాలావరకు రైతులకు ఉపయోగపడడం లేదని తెలుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు ప్రతిపాదించిన పనులను చేయడానికి పరిమితమైనట్లు విధితమవుతుంది. కొన్నిచోట్ల నీటిపారుదల శాఖ అధికారుల నిర్మించిన చెరువులు ఇప్పటివరకు ఒకసారి కూడా నిండింది లేదు. ఇలా కాంట్రాక్టర్లకు లబ్ధిని చేకూర్చడానికి ఇరిగేషన్ శాఖ పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరం వరల్డ్ బ్యాంక్ నిధులతో చిత్తూరు జిల్లాలో 30 పనులను చేపట్టారు. ఒక పని పూర్తయింది. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఈ పనుల అంచనా వ్యయం 30.65 కోట్ల రూపాయలు. ఈ పనులు పూర్తి అవుతే 5,987 ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. జీకా పథకం కింద చిత్తూరు జిల్లాలో 45 పనులు చేపట్టారు. వీటి అంచనాలయం 155.82 కోట్ల రూపాయలు. ఈ పథకం కింద 23,063 ఎకరాలు భూమి స్థిరీకరణ జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఇంత డబ్బులు వ్యయం చేసిన అదనంగా ఒక ఎకరా కూడా సాగులోకి వచ్చే అవకాశం లేదు. అలాగే సాధారణ రాష్ట్ర పథకం కింద చిత్తూరు జిల్లాలో 474.34 కోట్ల రూపాయలతో 19 పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే కొత్తగా 18,734 ఎకరాలు సాగులోకి వస్తుందని, 10,050 ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్ సి పి నిధుల కింద చిత్తూరు జిల్లాలో 12.39 కోట్ల రూపాయల వ్యయంతో 42 పనులు ప్రతిపాదించారు. ఇవి పూర్తి అయితే, 7,088 ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. జిల్లా ఖనిజ నిధి కింద 2.53 కోట్ల రూపాయలతో మూడు పనులను ప్రారంభించారు. ఇందువల్ల 490 ఎకరాల భూమి స్థిరీకరణ అవుతుందని పేర్కొన్నారు. ఇలా అదనంగా భూమి సాగులోకి రాకపోవడంతో ఇరిగేషన్ శాఖ అధికారులకు పనితీరు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా రైతులకు ఉపయోగపడే విధంగా అదనంగా భూమి సాగులోకి వచ్చే విధంగా ప్రతిపాదన రూపొందించి అమలు చేస్తే బాగుంటుందని జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుకుంటున్నారు.