కేంద్ర బడ్జెట్ కు మిశ్రమ స్పందన
కూటమి పార్టీలలో హర్షాతిరేకాలు
కమ్యునిస్టుల నిరాశ
వేతన జీవులపైన భారం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పట్ల తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ను 48.21 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టడం గతంలో ఎన్నడూ జరగలేదని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా వర్ణిస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్దపీట వేయడం, అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలను కేటాయించడం పట్ల రాష్ట్ర ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. పోలవరానికి నిర్మాణానికి సహాయం అందజేస్తామని ప్రకటించడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు ఆనందంతో ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా నిధులను కేటాయించడం పట్ల రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో రాయలసీమ సస్యశ్యామలంగా కాగలరని భావిస్తున్నారు. పారిశ్రామిక రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పరిశ్రమలు వస్తాయని, తద్వార్ధవ నిరుద్యోగ నిర్మూలన జరిగి యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ బడ్జెట్ పట్ల కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. గతంలో తమ బడ్జెట్ని కాపీ కొట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి నిధులను గ్రాంట్ గా కాకుండా రుణంగా అందజేయడం పట్ల సిపిఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడంతో నిరాశకుగురవుతున్నారు. ఇతర రాష్ట్రాలలో పర్యాటక ప్రాంతాలకు భారీగా నిధులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బంగారం, వెండి, సెల్ ఫోన్ లపైన కష్టం డ్యూటీని తగ్గించడం ద్వారా ఉత్పత్తుల ధరలు తగ్గి ఇవి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. మూడు రకాల క్యాన్సర్ మందులపైన జిఎస్టిని పూర్తిగా తొలగించారు. సోలార్ ఉత్పత్తులు పైన కూడా కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో సామాన్య ప్రజలకు కూడా సోలార్ ఉత్పత్తులు అందు అందుబాటులోకి రాగలరని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు : టిడిపి ఎంపి
2024 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం చేయనున్నట్లు నిర్మలా సీతరామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేయడం అభినందనీయం. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందిచనున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేయడం ఎన్ డి ఏ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 2024-25 బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల రూపాయిల నిధులు కేటాయించడం స్ఫూర్తిదాయకం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడమే కాక.., కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక స్థానాన్ని కల్పించడం ప్రధానినరేంద్ర మోడీ ప్రజా పాలనకు నిదర్శనం. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు.., విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయించడం.., హైదరాబాద్ - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వడం, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేయడం శుభ పరిణామం. విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామనడం.., రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం హర్షదాయకం.
గంగ 1 చిత్తూరు పార్లమెంట్ సభ్యులుదగ్గుమళ్ళ ప్రసాదరావు
భారత దేశ పురోగతి, అభివృద్ధి బడ్జెట్: బిజెపి
రానున్న కాలంలో వికసిత భారత్ వైపు అడుగులు వేయడం ఖాయం. మోదీ 3.0 ఆలోచనలు భారత్ జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకు పోతున్నదానికే నిదర్శనం ఈ గొప్ప బడ్జెట్. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకుంటాం అన్న విధంగానే అమరావతికి 15000వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి నిధులు, కారిడార్ ఏర్పాటు, నగరాలు అభివృద్ధి, ఇలా అనేక రంగాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ కు ధన్యవాదములు.
గంగ 2 :భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు యస్. జగదీశ్వర నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు.
ప్రజలను తీవ్ర నిరాశ పరచిన బడ్జెట్ : సిపిఎం
మాటలు ఘనం నిధులు నిల్ అన్నట్లుగా కేంద్ర బడ్జెట్ ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలనంతరం ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలుకు నిధులు కేటాయిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. ఆర్థికమంత్రి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పేరు పలుసార్లు ప్రస్తావించారు. కానీ నిధులు కేటాయింపు నిరాశ కలిగించింది. చెప్పిన మాటల్లో కూడా స్పష్టత లేదు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రజల్ని మోసగించడానికి కేంద్రం ప్రయత్నించింది. రాజధాని అమరావతికి 15 వేల కోట్ల రూపాయలు పలు ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తామని మంత్రి పేర్కొనటం వల్ల రాస్ట్రానికి, రాజధానికి మేలు జరగదు. 15 వేల కోట్ల రూపాయలు నేరుగా గ్రాంటుగా ప్రకటించాలి. వివిధ సంస్థల ద్వారా అప్పుగా ఇప్పించడం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి అవగాహన ఉన్నా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం. పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప వాటికి నిధుల ప్రస్తావన లేదు. ఆర్థిక మంత్రి ప్రస్తావించిన రెండు పారిశ్రామిక కారిడార్లకూ నిధుల గురించి ప్రస్తావన లేదు. పోలవరానికి 12 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా బడ్జెట్‌లో స్పందన లేదు. నిర్వాసితుల్ని గాలికొదిలేశారు. ప్రత్యేక హోదా ఊసే లేదు. రైల్వే జోన్, కడప ఉక్కు, మెట్రో, విద్య, వైద్య సంస్థలు తదితర చట్టబద్ధమైన హామీలు బడ్జెట్‌లో చోటు చేసుకోలేదు. గత పది సంవత్సరాల నుండి విభజన చట్ట ప్రకారం నిధులు కేటాయించకుండా బిజెపి నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్‌లోనూ ఆశించిన రీతిలో కేటాయింపులు లేవు. పుణ్యక్షేత్రాల టూరిజం, వరద నివారణ చర్యలు తదితర విషయాల్లో అనేక రాష్ట్రాలకు నిధులు కేటాయించినా, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రంపైనా, బిజెపిపైనా రాజకీయ ఒత్తిడి తేవాలి.
గంగ 3 వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి.
ఇది మోడీ కుర్చీని కాపాడుకునే బడ్జెట్ : కాంగ్రెస్
కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు వేసే రకంగా ఉంది. సామాన్యుల నడ్డి విరిచి ఉద్యోగాలు చేసుకొని కష్టపడి సంపాదించే వాళ్ళపైన అత్యధికంగా టాక్స్లు వేసి, అదాని అంబానీలకి ఊరట కలిపించే బడ్జెట్ ఇతర రాష్ట్రాలను పణంగా పెట్టి మిత్రపక్షాలను బుజ్జగించేందుకు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం. కాంగ్రెస్ మేనిఫెస్టోను, బడ్జెట్లను కాపీ పేస్ట్ చేశారు. బంగారు మీద వెండి మీద టాక్స్ లు తగ్గించడం హర్షదాయకం. కానీ సామాన్య మధ్యతరగతి ఉద్యోగస్తులు జీతాల మీద ఆధారపడి బతికే వాళ్ళ మీద ఉన్నది నడ్డి విరుస్తున్నారు. మొత్తానికి ఇది వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకునే దానికి వాళ్లు పెట్టుకున్న బడ్జెట్.
గంగ 4: టిక్కీ రాయల్, చిత్తూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
రాయలసీమకు గుర్తించడం అభినందనీయం: న్యాయవాది
కేంద్ర బడ్జెట్లో వెనుకబడిన జిల్లాలకు ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు నిధులను కేటాయించడం హర్షదాయకం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాయలసీమ జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం చొరవతో రాయలసీమ అభివృద్ధి చెందగలదని భావిస్తున్నాను. రాయలసీమ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. అమరావతికి పోలవరానికి ఆర్థిక సహాయం చేయడం శుభసూచకం.
గంగ 5; సంకు బాలయ్య, న్యాయవాది
వేతన జీవుల నడ్డి విరిచే బడ్జెట్: ఫార్మసీ ఉద్యోగి
కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ వేతన జీవులకు నిరాశను మిగిల్చింది. ఆదాయపన్ను స్లాబును ఏడు లక్షల రూపాయలకు పెంచుతారని ఎదురు చూశాం. అయితే మూడు లక్షల నుండి ఏడు లక్షల రూపాయల ఆదాయం నుంచి ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తేవడం, 5 శాతం పన్ను చాలా బాధాకరం. ఇది వేదన జీవులను దగా చేయడమే. ఆదాయ పన్ను స్లాబ్లను ఏడు లక్షల రూపాయలకు పెద్దాల్సిన అవసరం ఉంది.
గంగ6: ఎస్. యోషిత, ఫార్మసీ ఉద్యోగి
బంగారం ధర తగ్గనుంది. గృహిణి
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారు వెండి, ధరల మీద సుంకాలను తగ్గించడంతో వీటి ధరలు తగ్గనున్నాయి. అలాగే సెల్ ఫోన్లు ధరలు, లెదర్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గి, అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ మందులపై జిఎస్టిని తొలగించడం, ఎక్సరే మిషన్ల పైన జిఎస్టిని తగ్గించడం హర్షదాయకం. ఇదిగృహిణిలకు అనుకూలమైన బడ్జెట్.
గంగ 7: కె. శారద, గృహిణి
భారీ బడ్జెట్: కళాశాల ప్రధానోపాధ్యాయులు
కేంద్ర ప్రభుత్వం 48.21 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అభినందనీయం. ఈ బడ్జెట్లో గరీబ్ కళ్యాణ యోజన పథకకాన్నిమరో 5 ఏళ్లపాటుకు కొనసాగించడం చాల అవసరం. పేదలకు ఆకలి తీర్చడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. 80 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమాల కోసం ఐదు పథకాలను కొత్తగా ప్రవేశపెట్టడం మోడీకి యువత పైన ఉన్న విశ్వాసానికి నిదర్శనం. అలాగే ప్రధానమంత్రి అన్న యోజన పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించుకోవడం హర్షదాయకం. ఈ పథకాలకు భారీగా నిధులను కేటాయించడం చాలా అభినందనలు. అమరావతికి, పోలవరానికి అండగా నిలవడంతో రాష్ట్రం అభివృద్ధి పైపు పయనిస్తుంది. వేతన జీవులను మాత్రం నిరశాపరిశింది.
గంగ 8: బండారు శరత్ చంద్రశేఖర్, ప్రిన్సిపాల్, బొమ్మసముద్రం, జూనియర్ కళాశాల
వ్యవసాయ బడ్జెట్: రైతు
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయంలో ఉత్పత్తి, ఉత్పాదక ఉత్పాదక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని భావించడం మంచిది. సంపూర్ణ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ సేవలో అభివృద్ధికి చర్యలు తీసుకోవడం చాలా మంచిది. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు శ్రీకారం చుట్టిన ఉన్నారు. ఈ బడ్జెట్ రైతులు అనుకూల బడ్జెట్. దీనివల్ల వ్యవసాయం మరింత అభివృద్ధి చెంది, ఆహార ధాన్యాల్లో స్వయం సంవృద్దిసాధించగలం.
గంగ 9: వేణుగోపాల్ రెడ్డి, రైతు, పెడ్లిగుండ్లపల్లి