అంతిమ యాత్రకూ అవస్థలు ఎన్నో ....
జీడి నెల్లూరులో శ్మశానం కూడా లేదు
నీవా నదిలోనే అంత్యక్రియలు
నదికి వెళ్ళడానికి దారి కూడా లేదు.
చికెన్ వ్యర్థాలతో కంపుకోడుతున్న దారి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
మనిషి తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లుకు ఎదురైనా, మరణించిన తర్వాత ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో సేద తీరాలని కోరుకుంటాడు. ఆటంకాలు లేకుండా అంతిమయాత్ర జరగాలని, ప్రశాంతమైన ప్రదేశంలో సమాధి చేయాలని కోరుకుంటారు. అయితే, నియోజకవర్గ కేంద్రమైన గంగాధర నెల్లూరులో మరణించే వారికి ఈ అవకాశం లేదు. నియోజకవర్గ కేంద్రం అయిన గంగాధర నెల్లూరులో మృతులను సమాధి చేయడానికి ప్రత్యేక శ్మశానం అంటూ ఏదీ లేదు. నీవా నదిలోనే మృతులను ఖననం చేస్తున్నారు. నీవా నదికి వరదలు వస్తే ఇక కననం చేయడానికి ప్రత్యామ్నాయం లేకుండా, సొంత పొలాల్లోనే ఖననం చేయాల్సిన పరిస్థితి. పోనీ నీవా నదిలోకి వెళ్లే దారి అయినా సరిగా ఉందా, అంటే అది లేదు. నీవా నదిలోకి దిగడానికి కూడా సరైన రహదారి లేదు. ఎలాగో నదిలోకి దిగుదామనుకున్నా చికెన్ వ్యర్థాలతో కంపు కొడుతుంది. అడుగుపెట్టడానికి కూడా వీలు లేకుండా చికెన్ వ్యర్థాలతో నీవానది నిండిపోయింది. ఆ కంపును భరిస్తూ శవానికి అంతిమ సంస్కారం చేయాల్సిన పరిస్థితి. తిరిగి అదే కంపులో ఇంటికి చేరుకోవాలి.
ఓ మనిషి మరణానంతరం తన మృతదేహ దహన క్రియలు కూడా ప్రశాంతంగా జరుపుకొని పరిస్థితుల్లో గంగాధర నెల్లూరు ప్రజలు ఉన్నారు. గంగాధర నెల్లూరులో దహన సంస్కారాలు నిర్వహించాలంటే పెద్ద సాహసం చేయాలి. చికెన్ వ్యర్ధాలతో దుర్గంధ భరితంగా నీవా నది పరిసర ప్రాంతం కంపుకొడుతోంది. గంగాధర నెల్లూరుకు కూత వేటు దూరంలో ఉన్న నీవా నదిలో చికెన్ వ్యర్ధాలు భారీగా పడవేయడంతో ఆ ప్రాంతం మొత్తం దుర్గంధ భరితంగా మారింది. నీవా నది సమీప ప్రాంతంలోకి వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఓ మనిషి కడసారి దహన క్రియలను సైతం గౌరవప్రదంగా చేసుకునే విధంగా అవకాశం లేదు. గంగాధర నెల్లూరులో ఇప్పటివరకు ప్రత్యేకమైన స్మశానానికి స్థలం కేటాయించకపోవడంతో గత ఎన్నో ఏళ్లుగా నీవా నదిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే నీవా నదిలోకి వెళ్లడానికి రోడ్డు లేక మృతదేహాలను తరలించడంలో ఇక్కట్లు పడుతున్నారు. గంగాధర నెల్లూరులో ఇటివల ఒక వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించడానికి తీసుకొని వెళ్తుండగా స్వర్గ రథం వెళ్లలేక చికెన్ వ్యర్థ పదార్థాల కుప్పలో కూరుకు పోయింది. నానా అవస్థలు పడిన కుటుంబ సభ్యులు శవాన్ని ఆ వాహనం నుండి వేరుచేశారు. రధం వెళ్ళడానికి వీలులేకపోవడంతో చేసేదేమీ లేక, చెత్తను తరలించే వాహనంలో మృతదేహాన్ని తరలించారు. ఎలాగో ఖననం చేశారు. ఇప్పటికైనా మానవత్వంతో అధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓ వ్యక్తి మృతి చెందితే అంతిమయాత్రకి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని వేడుకొంటున్నారు. ప్రత్యక స్మశాన వాటికను ఏర్పాటు చేయాలనీ మనవి చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, చికెన్ వ్యర్ధాలను నీవా నదిలో వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పో రై గంగ 1 చికెన్ వ్యర్థాలతో నిండిన నీవా నది.
గంగ 2 స్వర్గారోహణ రధం నుండి మృతదేహాన్ని చెత్త వాహనంలోకి తరలిస్తున్న దృశం.