పుంగనురులో సీన్ తారుమారు
వైసిపి ప్రభుత్వంలో పుంగనూరుకు రాకుండా చంద్రబాబును అడ్డగింత
నేడు మిధున్, రామచంద్రా రెడ్డిలను అడ్డుకుంటున్న టిడిపి శ్రేణులు
నాడు చంద్రబాబు మీదనే హత్యాయత్నం కేసు
నేడు ఎంపి మిదున్ రెడ్డి మీద హత్యాయత్నం కేసు
నాడు ఏక పక్షంగా కేసులు
నేడు ఇరు వర్గాల మీద కేసులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
సంవత్సరం రోజులు కూడా తిరగకుండానే పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి తరుమారయ్యింది. గతంలో తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు, కార్యకర్తలు మీద కేసులను బనాయించి వేధించిన వైసీపీ నాయకులకు ప్రస్తుతం అదే పరిస్థితి వచ్చింది. నాడు ఏక పక్షంగా టిడిపి నేతల మీదనే కేసులను నమోదు చేశారు. నేడు ఇరువర్గాల మీద కూడా కేసులు నమోదయ్యాయి. గురువారం పుంగనూరులో జరిగిన సంఘటనల మీద ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పుంగనూరు పోలీసులు కేసులను నమోదు చేశారు. వైసీపీకి చెందిన రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడు రెడ్డప్పతో సహా 34 మంది మీద హత్యాయత్నం కింద కేసులను నమోదు చేశారు. అలాగే మాజీ ఎంపీ రెడ్డప్ప ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది మంది నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.
గత సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగు నీటి ప్రాజెక్టుల సందర్శనకు చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా మదనపల్లి సమీపంలోని అంగళ్ళలో తొలుత చంద్రబాబు నాయుడును అడ్డుకొని, అక్కడ రాళ్లతో అయన మీద దాడి చేశారు .తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల వాహనాలను ధ్వంసం చేశారు. చంద్రబాబు రాక కోసం కట్టిన స్వాగత తోరణాలు, కటౌట్లను దగ్ధం చేశారు. అలాగే పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు నాయుడు రాకూడదని వైసిపి నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఆయన చిత్తూరుకు రావడానికి పుంగనూరు బైపాస్ రోడ్డు చేరుకోగానే అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి, చంద్రబాబు పుంగనూరు పట్టణంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పోలీసులకు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఒక పోలీసు వాహనం కూడా దగ్ధమైంది. టిడిపి శ్రేణులు కూడా గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు టిడిపి నాయకులు రెచ్చగొట్టి మెల్లిగా జారుకున్నారు. ఇంత జరిగినా, అంగళ్లు, పుంగనూరులో టిడిపి నాయకుల పైన హత్యయత్నం కేసులను నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పుంగనూరు టిడిపి ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జి గంటా నరహరి, పలమనేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, మదనపల్లి టిడిపి ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావుతో పాటు 317 మంది మీద కేసులను నమోదు చేశారు. 12 విడుదలగా ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. ఇందులో 81 మంది అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. చివర్లో చల్లా బాబు తదితరులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అంతకుముందు సుమారుగా నెల రోజులపాటు చంద్రబాబు నాయుడుతప్ప, మిగిలిన టిడిపి అగ్ర నేతలు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెలరోజుల తర్వాత బెయిల్ రావడంతో టిడిపి నేతలు తిరిగి తమ నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఇప్పట్లో ఆంగ్లంలో పుంగనూరు సంఘటనలో సుమారు వెయ్యి మంది మీద కేసుల నమోదు అయ్యాయి. ఒక దశలో చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన ఉండగా, వస్తే చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు ఎస్పీలను, డిఐజిలను మేనేజ్ చేసి టిడిపి నాయకుల మీద మాత్రమే కేసులను బనాయించారు. టిడిపి కార్యకర్తలు నాయకులు అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సంవత్సరం రోజులు తిరగకుండానే పుంగనూరులో పరిస్థితి తారుమారైంది. రెండు పర్యాయాలు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించడానికి ప్రయత్నించగా, టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో రెండుసార్లు రామచంద్ర రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. గురువారం పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి పుంగనూరు చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే పుంగనూరుకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆయన బాధితులు భారీగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో ఎనిమిది మంది టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు. మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దగ్దం అయ్యింది. మరో 10 వాహనాలు వరకు ధ్యంసమయ్యాయి. ఈ విషయాల మీద పుంగనూరు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి పోలీసులు కేసులను నమోదు చేశారు. వైసిపి పార్టీ తరఫున రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 34 మంది మీద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అలాగే 9 మంది టిడిపి నేతలు మీద కూడా కేసులు నమోదయ్యాయి.