జిల్లా పరిషత్తులో సస్పెన్షన్ల భయం
కొనసాగుతున్న విచారణలు
పలు కీలక ఫైళ్ల గల్లంతు
పుంగనురులో నలుగురి సస్పెన్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లా పరిషత్తు సిబ్బందిని, మండల పరిషత్ అధికారులను సస్పెన్షన్ల భయం వెంటాడుతోంది. జిల్లా పరిషత్తులో గతంలో జరిగిన అవకత కారణంగా ఎవరి మీద వేటు పడుతుందోనని సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. అందుకు తగిన విధంగా జిల్లా పరిషత్తులో పలు విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విచారణలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఎక్కడ అవకతవకలు వెలుగులోకి వస్తాయో, ఎవరిమీద వేటుపడుతుందో తెలియక గతంలో జిల్లా పరిషత్తులో పని చేసిన అధికారులు, ప్రస్తుతం మండలంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
వైసీపీ పాలనలో జిల్లా పరిషత్తులో అవినీతి, అక్రమాలు పతాక స్థాయికి చేరాయి. సీనియార్టీని తొక్కిపెట్టి, బైరెడ్డిపల్లికి చెందిన ఎంపీడీవోను జిల్లా పరిషత్ సీఈవో గా నియమించి, వైసిపి నాయకులు చక్రం తిప్పారు. నిధులను తమకు అనుకూలంగా విడుదల చేయించుకున్నారు. ఇందులో భారీ ఎత్తున అవినీతి, అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. ఆయన తర్వాత ఒక్కొక్కటిగా అవినీతి భాగవతాలు వెలుగులోకి వస్తున్నాయి. పుంగనూరు మండల పరిషత్తులో సాధారణ నిధులలో 1.37 కోట్ల రూపాయలు స్వాహా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికలకు ముందే ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఈ విషయం వెలుగులోకి వస్తే మాజీ మంత్రికి ఇబ్బంది అవుతుందని, అవినీతిని తొక్కిపెట్టినట్లు సమాచారం. ఇందుకు సంబందించి ఎం పి డి ఓ తో సహా నలుగురిని ఇటివల సస్పెండ్ చేశారు. అలాగే జిల్లా పరిషత్ నిధులను పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలకు మాత్రమే విడుదల చేశారు. అక్కడే భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లా పరిషత్తులో సీఈఓ తమకు అనుకూలంగా ఉన్న అధికారులను నియమించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీంతో పలు విభాగాల్లో అవినీతి, అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అకారణంగా సిబ్బందికి సస్పెండ్ చేయడం, జీతాలు నిలుపుదల చేయడం, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా, సెలవులు ఇవ్వకుండా వేధించడం వంటి విషయాల మీద జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విచారణ జరుపుతున్నారు. అలాగే బి ఆర్ జి ఎఫ్ నిధుల దుర్వినియోగం మీద జిల్లా ఆడిట్ అధికారి సురేష్ రెడ్డి తన బృందంతో విచారణలు నిర్వహిస్తున్నారు. 15 రోజులైనా ఈ విచారణ ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు.. ఇందుకు జిల్లా పరిషత్తులో కీలకమైన ఫైళ్లు అదృశ్యమైనట్లు తెలిసింది. ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో వెతికి పట్టడం జిల్లా పరిషత్ అధికారులకు కష్ట సాధ్యమవుతుంది. రికార్డుల గురించి ఇప్పటికే పలువురికి నోటీసులను జారీ చేశారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ సిసిగా పనిచేసిన సురేంద్ర రెడ్డి దగ్గర పలు ఫైళ్ళు ఉన్నట్లు తెలిసింది. దీంతో జిల్లా పరిషత్ సీఈవో గ్లోరియా నోటీసును ఇచ్చి జిల్లా పరిషత్తు ఫైళ్లను తమకు స్వాధీనం చేయాల్సిందిగా కోరారు. దీంతో సురేంద్ర రెడ్డి తన వద్దనున్న 150 ఫైళ్ళను జిల్లా పరిషత్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంకా జిల్లా పరిషత్ సిబ్బందికి సంబంధించిన పలు ఫైళ్ళు కనిపించడం లేదని సమాచారం. ఇప్పటికే గతంలో ఏఓగా పనిచేసిన బాలాజీ కి కూడా ఈ విషయమై నోటీసులు జారీ చేశారు. జిల్లా పరిషత్తులో విచారణ జరుపుతున్న కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఇందులో ఆడిట్ అధికారులు కూడా భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. కావున పలు మండలాల్లో కూడా ఈ విషయమై విచారణ కొనసాగించే అవకాశం ఉంది. మండలాల్లో నిధుల విడుదల, వ్యయానికి సంబంధించిన విచారణలు జరిగితే నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జిల్లా పరిషత్ సిబ్బంది, మండలాల్లో ఉన్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
పో రై గంగ 1 జిల్లా పరిషత్