ప్రభుత్వ ఉద్యోగులకూ పండగ వచ్చింది
చాలా ఏళ్ల తరువాత ఒకటోతారీఖున జీతాలు
ఉదయం నుండి పడుతున్న జీతాలు
జీతం పడినట్లు ఫోన్ ద్వారా సమాచారం
పండుగ చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కూడా ఒకటవ తేదీనే పండగ వచ్చింది. వీరందరికీ వారి వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ అయినట్లు వారి మొబైల్ ఫోన్లకు సమాచారం అందుతుంది. అలాగే ఔట్సోర్సింగ్ సిబ్బంది, కాంటాక్ట్ సిబ్బంది కూడా జీతాలు పడుతున్నట్టు సమాచారం వస్తుంది. దీంతో జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఒకటవ తేదీన జీతాలను అందుకుంటున్నారు. వారి ఆనందం వర్ణణాతీతం.
చిత్తూరు జిల్లాలో సోమవారం 37 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంటాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా మరో ఎనిమిది వేలమంది ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రభుత్వ ఉద్యోగాలను చేసి పదవీ విరమణ చేసిన పెన్షనర్లు 10 వేల మంది ఉన్నారు. మొత్తం 55 వేల మంది ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందని ద్రాక్షగా మారాయి. పదవ తారీకు నుంచి 20వ తారీకు వరకు ఎప్పుడైనా జీతాల జమయ్యే పరిస్థితి ఏర్పడింది. 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష్యకట్టిన జగన్మోహన్ రెడ్డి పిఆర్సి పేరుతో వారి జీతాలలో కోత విధించారు. మామూలుగా పిఆర్సి జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగడం ఆనవాయితీ. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో పీఆర్సీలో జీతాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పిఆర్సి వద్దని పాత జీతాలనే అమలుచేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేశారు. అలాగే సకాలంలో వేతనాలను చెల్లించాలని, తమ మీద కక్ష్యపూరిత వైఖరిని విడనాడాలని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలను చేశారు. ఏం చేసినా, వైసీపీ పాలనలో ఒకటవ తారీఖున జీతాలు అన్నది కలగా మిగిలింది. జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగినా, ఇంక్రిమెంట్లు వచ్చినా, పండగ చేసుకునే పరిస్థితి ఉండేది. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో జీతాలు పడితే పండగ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా, ఎలాగో ఒకటవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పింఛన్దారులకు జీతాలను అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పించను దారులు పండుగ చేసుకుంటున్నారు.