మామూళ్ల మత్తులో ఆహార భద్రత అధికారులు
అనుమతులు లేకుండానే హోటల్లు, బేకరీలు
మొక్కుబడిగా తనిఖీలు, పరిశుబ్రత పూజ్యం
కల్తీ నూనెలు, పాచిన పదార్థాలు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు పట్టణంలో ఆహార భద్రతా వ్యవస్థ నామమాత్రంగా మారింది. రోజురోజుకు పుట్టగొడుగుల్లా బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ళు పుట్టుకొని వస్తున్నాయి. వీటిని నియంత్రణ చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తనిఖీలు చేయడం లేదు. దీంతో నాసిరకం ఆహార పదార్థాలు, కల్తీ నూనెలు, పాచిపోయిన ఆహార పదార్ధాలను ప్రజలకు అంటగడుతున్నారు. వీటివల్ల ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని హోటళ్ళు, డాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల మీద సరైన నియంత్రణ లేకపోవడంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు అందితే, నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు.
జిల్లా కేంద్రమైన చిత్తూరులో హోటళ్ళు, డాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పాని-పూరి కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చిత్తూరు మీదుగా తిరుపతికి వెళ్లే యాత్రకులు, కాణిపాకం వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా చిత్తూరులో భోజనం చేయల్చిన పరిస్థితి. అలాగే చిత్తూరు పట్టణంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు భారీగా ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో పలువురు ఉద్యోగులు భోజనానికి హోటళ్ల మీదనే ఆధారపడుతారు. ఇదే అదునుగా జిల్లా కేంద్రంలో హోటళ్ళు, డాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు లెక్కకు మించి పుట్టుకు వస్తున్నాయి. వీటిని నియంత్రణ చేసే అధికార యంత్రాంగం కనపడడం లేదు. ఆహార భద్రతాధికారులు ఉన్నా, నామమాత్రంగా తనిఖీలతో సరిపడుతున్నారు. నెలనెలా టెన్షన్ గా మామూళ్ళు మాత్రం వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చిత్తూరు రాంనగర్ కాలనీలో ఒక బేకరీలో చిరుతిండి తిన్న ఒక చిన్నారికి వాంతులు, విరోచనాలు కావడంతో తల్లిదండ్రులు ఆహార భద్రత సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు ఆ బేకరీ ని తనిఖీ చేయగా, గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి అనుమతి లేకుండా బేకరీ నడుస్తున్నట్లు తేలింది. బేకరీ లోపల ఆహార పదార్థాలు కూల్లిపోయినవి, పాచిపోయినవి దర్శనమిచ్చాయి. బేకరి దోమల అడ్డగా ఉంది. ఈ బేకరి ఎక్కడో లేదు. ఆహార తనిఖి అధికారి కార్యాలయానికి సమీపంలోనే ఉంది. ఇది ఒక రాంనగర్ కాలనీలోని బేకరీలోనే జరుగుతుందనుకుంటే పోబాటే. చిత్తూరు పట్టణంలో అన్నిచోట్ల ఇదే తంతు జరుగుతోంది. ఆహార భద్రతాధికారులు నెలనెలా మామూళ్ళు వసూళ్ళు చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. బేకరీలు, హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను పరిశీలించి, తనిఖీలు చేయడం లేదు. వాటిలో ఉపయోగించే ఆహార పదార్థాలు, రసాయనాలు, నూనెల గురించి పరిశీలన చేయడం లేదు. చాలా చోట్ల బోర్డు కూడా లేకుండానే హోటళ్ళు నడుస్తున్నాయి. ఇక్కడ పరిశుభ్రత పూజ్యమనే చెప్పాలి. మురికి కాల్వల గట్ల మీద కూడా హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుస్తున్నాయి. మాంసాహార హోటళ్ళలో, చికెన్ పకోడీ కేంద్రాలలో భారీగా కల్తీ జరుగుతోంది. నాలుగైదు రోజుల క్రితం తెచ్చిన మాంసాన్ని కూడా ప్రిజ్ లో పెట్టి, రంగులు అద్ది, మెరుగులు దిద్ది ప్రజలకు విక్రమిస్తున్నారు. అందుకు వాడే నూనె కూడా నాణ్యమైనది కాకపోగా, వాడిన నూనెలే మళ్ళి, మళ్ళి వాడుతున్నారు. కల్తీ నూనెలు సైతం వాడుతున్నారు. నూనెను తరచుగా మార్చకుండా కాగిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడడం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆహార భద్రతాధికారులు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. వారి ఫోన్ నెంబర్లు కూడా నెట్ లో అందుబాటులో లేవు. వీరు కాకుండా చిత్తూరు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కూడా హోటళ్ళు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేసే అధికారం ఉంది. గత నెల రోజుల కిందట మున్సిపల్ కమిషనర్ నాలుగైదు హోటల్లను తనిఖీ చేశారు. అన్ని హోటళ్ళలో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని వండి, వడ్డిస్తున్నట్లు తేలింది. వారం రోజుల మాంసాన్ని కూడా నిల్వచేసి చెడిపోకుండా రసాయనాలు కలిపి వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు తేలింది. చిత్తూరు పట్టణంలో దాదాపుగా అన్ని హోటళ్ళలో ఇదే తంతు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు హోటళ్ళలో మాంసాహారం తినాలంటే భయపడుతున్నారు. ఇక రోడ్ సైడ్ చికెన్ పకోడా, పానీ పూరి సెంటర్లలో పరిశుభ్రత నామమాత్రంగా కూడా కనిపించదు. అయినా, ప్రజలు సాయంకాలాల్లో వీటి కోసం ఎగబడుతుంటారు. దీనిని వ్యాపారస్తులు తమకు అనుకూలంగా మార్చుకొని రెండు మూడు రోజుల నిల్వ ఉంచిన పదార్థాలను కూడా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. చాలాచోట్ల వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. మాంసాహారంలో రసాయనాలు కలిపి, రంగులు అద్ది వినియోగదారులకు అనుమానం రాకుండా సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా ఆహార భద్రతా సిబ్బంది, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా చిత్తూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు.