26, జులై 2024, శుక్రవారం

ప్రజాస్వామ్యానికి పాతర, నామినేషన్ల జాతర

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఎన్నికలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు 

గత 5 సంవత్సరాలుగా నామినేటెడ్ పాలకమండలి 

జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి, ప్రింటింగ్ ప్రెస్ లకు కూడా 

కూటమి ప్రభుత్వమైనా ఎన్నికలు జరిపేనా ?


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


సహకార స్ఫూర్తికి అనుగుణంగా ఏర్పాటు అయిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది. సహకార సంఘాలకు అయిదు  సంవత్సరాలకు ఒక మారు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ప్రభుత్వం ఎన్నికల విషయం పక్కన పెడుతోంది. ఇందులో సభ్యులుగా కూడా కానీ వ్యక్తులను నామినేషన్ మీద చైర్మన్, డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. అలాగే జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి, జిల్లా సహకార  ప్రింటింగ్ ప్రెస్,  ప్రాథమిక సహకార కేంద్రాలలో కూడా ఇదే వ్యవహారం కొనసాగుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, ఎన్నికలు పెట్టడం లేకపోతే కొనసాగుతున్న కార్యవర్గాన్ని రెన్యువల్ చేయడం లేక చైర్మన్, డైరెక్టర్లు పోస్టులను నామినేట్ చేయడం జరుగుతుంది. ఇలా జరగడం కారణంగా సహకార స్ఫూర్తిని ప్రభుత్వం దెబ్బతీస్తోంది. బ్యాంకులో అవినీతి, అవకతకలకు ఆస్కారం కలుగుతోంది.


చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 1919 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రస్తుతం 40 శాఖలు, 76 ప్రాథమిక సహకార సంఘాల ద్వారా బ్యాంకు కార్యకలాపాలను సాగిస్తోంది.  గ్రామీణ అభివృద్ధిలో ముఖ్యపాత్రను వహిస్తోంది. ఈ బ్యాంకు ప్రధానంగా చెరకు, వేరుశనగ, వరి తదితర వ్యవసాయ పంటలకు మైనర్ నీటిపారుదల ,వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యానవనాలు, పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపకం, సెరికల్చర్, చేనేత కార్మికులకు హ్యాండ్లూమ్, సిల్క్ వీవర్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తి కోసం బ్యాంకు రుణాలు అందజేస్తుంది. ఇవి కాకుండా క్రెడిట్ సొసైటీలు, ఎంప్లాయిస్ సొసైటీలు, షుగర్ ఫ్యాక్టరీలు, డైరీలకు కూడా రుణాలు అందజేస్తుంది. అంతేకాకుండా జిల్లాలోని స్వయం సహాయక బృందాలకు, రైతు సహకార బృందాలకు కూడా అందజేస్తుంది. చిత్తూరు జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎన్నికల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్నికల విషయంలో శ్రద్ధ చూపడం లేదు. ఎక్కువగా పాలకమండలని నామినేట్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సి ఉంది. 2005 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. తిరిగి 8 సంవత్సరాల తర్వాత 2013లో ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో కూడా అమాస రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2018 నుంచి రెండు సంవత్సరాలు పాటు పర్సన్ ఇంచార్జి కింద బ్యాంకు నడిచింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన ఎం. రెడ్డెమ్మను చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పాలకవర్గం గత ఎన్నికల వరకు కొనసాగింది. ప్రస్తుతం జిల్లా జాయింట్ కలెక్టర్ పర్సన్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎన్నికలతో జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ఎన్నికలు కూడా ముడివడి ఉన్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సుమారుగా నాలుగు లక్షల మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘాలలో సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం తొలుత సింగిల్ విండోలకు ఎన్నికలను నిర్వహిస్తుంది. సింగల్ విండోలలో అధ్యక్షుడు, డైరెక్టర్లు ఎన్నికవుతారు. సింగిల్ విండో అధ్యక్షులు కలిసి  జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ ను, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ను, జిల్లా సహకార ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ ఎన్నుకుంటారు. వీరి పదవి కాలం ఐదు సంవత్సరాలు. అయితే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పట్ల చూపే శ్రద్ధను ప్రాథమిక సహకార సంఘాల విషయంలో చూపడం లేదు. ప్రభుత్వం వారికి నచ్చిన వారిని సింగిల్ విండోలలో పర్సన్ ఇన్చార్జిలుగా నియమిస్తుంది. అలాగే జిల్లా స్థాయిలో రాజకీయ నాయకులను చైర్మన్ గా, డైరెక్టర్లుగా నియమిస్తుంది. ఇలా సహకార రంగ స్ఫూర్తికి నిదర్శనంగా ఏర్పాటైన జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మీద సింగల్ విండో సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. సింగిల్ విండోలలో సభ్యత్వాలను రెన్యువల్ చేయడం, కొత్తగా సభ్యత్వాలను చేర్పించి, ఎన్నికల నిర్వహించాలని కోరుతున్నారు. తద్వారా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, మార్కెటింగ్లో సొసైటీ, ప్రింటింగ్ ప్రెస్ లలో  ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన పాలకమండలి ఉండాలని భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *