పాపం .... కాంట్రాక్టు అధ్యాపకులు
ఊరించి, రెగ్యులర్ చేయని వైసిపి ప్రభుత్వం
రెన్యువల్ కూడా చేయని కూటమి ప్రభుత్వం,
రెండు నెలలుగా జీతాలు లేక ఇక్కట్లు
నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్న పాలకులు
ఆశగా ఎదురు చూస్తున్నకాంట్రాక్టు అధ్యాపకులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు పరిస్థితి ధమనీయంగా మారింది. గత ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్ చేస్తామని జీవో కూడా తీసుకుని వచ్చి, చివరకు చేయకండా దిగిపోయింది. 70 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం వారిని రెన్యువల్ కూడా చేయలేదు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులకు గత రెండు నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు, అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంటాక్ట్ లెక్చరర్లకు వారి పదవీ కాలాన్ని రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ విషయమై పలుమార్లు ఆ సంఘ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసినా, నేడు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో తమను ఎప్పుడు రెన్యువల్ చేస్తారు ? జీతాలు ఎప్పుడు వస్తాయి ? అని కాంటాక్ట్ లెక్చర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో 29 జూనియర్ కళాశాలలు, రెండు ఒకేషనల్ జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ఇందులో చిత్తూరులోని పిసిఆర్, కుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మాత్రం నలుగురు, ఐదు మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నారు. మిగిలిన అన్ని కాలేజీల్లో ఒకరు ఇద్దరు మాత్రమే రెగ్యులర్ అధ్యాపకుల పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 81 మంది వరకు రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా, 282 మంది కాంటాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. జూనియర్ కళాశాలలన్నీ కాంట్రాక్టు లెక్చరుల మీదనే ఆధారపడి పనిచేస్తున్నాయి. వారు లేకుంటే కళాశాలలు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. గత 20 ఏళ్లుగా కాంటాక్ట్ అధ్యాపకులను రెన్యువల్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. విద్యా సంవత్సరం చివరిలో ఒకరోజు వారు ఆబ్సెంట్ అయినట్లు వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఆదేశాలను ఇచ్చి, మే నెల నుంచి తిరిగివాలని ఉద్యోగంలో తీసుకుంటున్నట్లు ఆదేశాలు ఇవ్వడం పరిపాటిగా వస్తుంది. గతంలో ఒక నెల రోజులు జీతం ఇవ్వని పరిస్థితి ఉండేది. ఈ విషయమై అధ్యాపక సంఘాలు పోరాటంతో 2019లో అప్పటి టిడిపి ప్రభుత్వం అధ్యాపకులకు మినిమం టైస్ స్కేల్ ఇచ్చింది. ప్రతి ఏటా 10 రోజుల విరామంతో 12 నెలలు జీతం ఇచ్చేలా జీవోను జారీ చేసింది. తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలు చేస్తూ వచ్చింది. ఒక్కొక్క సంవత్సరం పది నెలలకు, ఇంకొక సంవత్సరం 11 నెలలకు జీతాలను మాత్రం ఇచ్చారు. కాంట్రాక్ట్ అధ్యాపక యూనియన్ల పోరాటం ఫలితంగా పది రోజుల విరామంతో 12 నెలల జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఇటీవల ప్రభుత్వం డిగ్రీ కళాశాలల అధ్యాపకులను రెన్యువల్ చేస్తూ ఒక నెల విరామం ప్రకటించింది. జూనియర్ కళాశాలలో మాత్రం మే, జూన్ నెలలో కూడా అధ్యాపకులు పనిచేశారు. పరిక్ష తప్పిన విద్యార్థులకు పాఠాలు చెప్పడం, ప్రశ్నాపత్రాలు దిద్దడం, కళాశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఇంటింటికి తిరిగి విద్యార్థులను చేర్పించడం తదితర కార్యక్రమాలను చేశారు. వారు మే నెల నుంచి పనిచేస్తున్నా, ఇప్పటివరకు రెన్యువల్ ఉత్తర్వులు అందుకోలేదు. రెన్యువల్ అయితే తప్ప వారికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం 2014 సంవత్సరానికి ముందు కాంట్రాక్టు అధ్యాపకులుగా చేరిన వారందరిని రెగ్యులర్ చేస్తామని జీవోను కూడా తీసుకుని వచ్చింది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి, గవర్నర్ కు పంపి. జి ఓ ను విడుదల చేసింది. ఈ లోపు ఎన్నికలు రావడంతో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయకనే వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటివరకు కాంటాక్ట్ లెక్చరర్ల విషయంలో తమ విధానాన్ని ప్రకటించలేదు. గతంలో వైసీపీ ఇచ్చిన రెగ్యులరైజేషన్ జీవోను అమలు చేస్తున్నది, లేనిది స్పష్టం చేయలేదు. ఆ విషయం అలా ఉన్న కనీసం వారిని రెన్యువల్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులు మానసిక వేదనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం రెన్యూవల్ విషయంలో నేడు రేపు అంటూ కాలయాపన చేస్తుంది. రెన్యువల్ అయితే తప్ప వారికి జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అయోమయ పరిస్థితిలో జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు కొట్టుమిట్టాడుతున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం తమను రెగ్యులర్ చేయాలని అధ్యాపక సంఘ నాయకులు కోరుతున్నారు. అంతకంటే ముందుగా తమను రెన్యువల్ చేసి, జీతాలను అందజేసి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు.