పుంగనురులో ఉద్రిక్త పరిస్థితి వెనుక .....
నేతిగుట్లపల్లిలో రిజర్వాయర్ నిర్మాణం
191 ఎకరాల భూసేకరణ
రైతులకు అందని నష్ట పరిహారం
నిర్మాణం పూర్తయినా నెరవేరని లక్ష్యం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పుంగనూరు ప్రజల వ్యతిరేకతకు గత ప్రభుత్వ విధానాలే కారణమని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం పాలనలో పుంగనూరులోని నేతిగుంట్లపల్లిలో బ్యాలెన్స్ రిజర్వాయర్ ను ప్రభుత్వం నిర్మించింది. ఇందుకుగాను సుమారు 1000 మంది రైతులకు సంబంధించిన 171 ఎకరాలను సేకరించారు. భూసేకరణ జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించలేదు. ప్రాజెక్టులు మాత్రం పూర్తయ్యాయి. బిల్లులను కాంట్రాక్టర్లు తీసుకున్నారు. దీంతో భూములు కోల్పోయిన రైతులు పుంగనూరు మండలంలో తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఎప్పుడు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఎప్పుడు పుంగనూరుకు వచ్చినా, అడ్డుకొని తమ నిరసన తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.
వైసిపి ప్రభుత్వం హయంలో 2022లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు బ్యాలెన్స్ రిజర్వాయర్లను ప్రారంభించారు. కురబలకోట మండలం ముదివేడు, పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి, సదం మండలం ఆవులపల్లి రిజర్వాయర్లను నిర్మించనున్నట్లు 2021 మార్చి 23వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేసింది. ఎందుకు 1554.21 కోట్లతో అంచనాలను ప్రతిపాదించింది. అయితే అంచనాలకు మించి 2144. 50 కోట్ల రూపాయలతో గుత్తేదారులు ఈ పనులను దక్కించుకున్నారు. పుంగనూరు మండలం మిట్ట చింతావారి పల్లె గ్రామంలోని నేతిగుట్లపల్లెలో 198 కుటుంబాలకు చెందిన 171 ఎకరాలను 2022 మే నెలలో భూసేకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు నీటిని తీసుకురావాలని భావించింది. దీని ద్వారా 70,000 ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వస్తుందని, మరో 40,000 ఎకరాల భూమి స్థిరీకరణ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులను మూడింటిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెందిన సంస్థ నిర్మించినట్లు సమాచారం. అయితే వీటిని నిర్మాణం పూర్తయి ప్రభుత్వం తరఫున వారికి రావలసిన బిల్లులను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని సమాచారం. నష్ట పరిహారం విషయంలో పలుమార్లు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసినా, ఇదిగో అదిగో అంటూ దాటవేశారు. రైతులకు నష్టపరిహారం అందలేదు. దీంతో నేతిగుట్లపల్లి రైతులు తీవ్ర అశాంతితో ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి మంత్రి ప్రతిపాదించడంతోనే నేతిగుట్లపల్లిలో బాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మించినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి స్వార్థం కోసం ఈ రిజర్వాయర్ ను ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. నిర్మించినా లక్ష్యం నెరవేరలేదు. ఇందుకు గండికోట నుంచి నీళ్లు రావాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాలేరు నగరి, హంద్రీ నీవా సుజల స్రవంతి పనులు దాదాపుగా స్తంభించాయి. ఐదు శాతం కూడా జరగలేదని తెలుస్తోంది. దీంతో భూములు ఇచ్చినా, లక్ష్యం నెరవేరకపోవడం, రైతులకు రావాల్సిన నష్టపరిహారం అందకపోవడంతో రైతులు పెద్దిరెడ్డి మీద వ్యతిరేకత పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యతిరేకత కారణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు పుంగనూరుకు వచ్చినా, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిలను గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించే వరకు పుంగనూరులో అడుగు పెట్టనివ్వమని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పుంగనూరు నియోజకవర్గాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన జాగీరులాచూశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను, బీసీ నేత రామచంద్ర యాదవ్ ను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. రామచంద్ర యాదవ్ సమావేశాలను అడ్డుకున్నారు. ఆయన ప్రజలకు పంచడానికి తీసుకువచ్చిన చీరలను స్వాధీనం చేసుకున్నారు. పలు మార్లు దాడులు చేశారు. ఈ విషయాల మీద కూడా రామచంద్ర యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ యాత్ర వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పుంగునూరు నియోజకవర్గంలో అడ్డుకున్నారు. వారిని నానా దుర్భాషలాడి, బట్టలు ఇప్పించి, టిడిపి జెండాలను తొలగించారు. నియోజకవర్గంలో ఎవరైనా పెద్దిరెడ్డికి ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద కేసులను బనాయించి వేధించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో టిడిపి అగ్రనేతలైన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లను నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వలేదు. ప్రభుత్వం మారడంతో భాధిత కుటుంబాలు ఒక్కసారిగా ఇళ్ల నుండి వెలుపలికి వస్తున్నాయి. తమను ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం మీద తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు.
పో రై గంగ 3 పుంగనురులో ఉద్రిత వాతావరణం