కుప్పంలో టిడిపి మెజారిటీ ఎందుకు తగ్గింది ?
పార్టీ నాయకులలో అంతర్మధనం
కుప్పం పర్యటనలో ఆరాతీసిన భువనేశ్వరి
మెజారిటీ పెంచుకోవడానికి వ్యూహరచన
రెండు గ్రామాల దత్తత, మూడు నెలలకు ఒకసారి పర్యటన
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం వీచింది. కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఇదివరకు ఎన్నడూ గెలవని అసెంబ్లీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అయితే కుప్పం నియోజకవర్గంలో మాత్రం మెజారిటీ అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదు. గత ఎన్నికలతో పోల్చితే 17వేల ఓట్ల మెజారిటీ మాత్రమే టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పెరిగాయి. వైసీపీ అభ్యర్థికి 4,500 ఓట్లు మాత్రం తగ్గాయి. ఈ విషయాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు సైతం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోం.ది నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలు నారా భువనేశ్వరి ఈ విషయం మీదనే దృష్టిని సారించినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గం నాయకులలో ఈ విషయం మీద అంతర్మధనం కొనసాగుతోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కుప్పం పెట్టని కోట. నియోజకవర్గంలో ఇప్పటివరకు వేరే పార్టీ గెలువలేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. 1983, 1985 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగస్వామి నాయుడు విజయం సాధించారు. 1989 నుంచి కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు శకం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి శాసనసభ్యులుగా 8 పర్యాయాలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేయగా 6,918 ఓట్ల మెజారిటీ లభించింది. 1994లో మెజారిటీ 56,588కి పెరిగింది. 1999లో మెజారిటీ 65,687కు పెరిగి, 2004లో మెజారిటీ 59, 558కి తగ్గింది. 2009లో మెజారిటీ 46,066 కు తగ్గి, 2014 ఎన్నికలలో ఆ మెజారిటీ కాస్త 47,121కి చేరి, 2019 ఎన్నికల్లో 30,722 ఓట్ల మెజార్టీకి తగ్గింది. తిరిగి 2024లో చంద్రబాబు నాయుడు మెజారిటీ 48,006కు పెరిగింది. ఈ పెరగడం 17,284 ఓట్లు మాత్రమే. చంద్రబాబు నాయుడు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అన్ని వర్గాలను సమీకరించారు. చంద్రబాబు నాయుడు మూడు నెలలకు మారు నియోజకవర్గంలో పర్యటించి, ప్రజలను కలుసుకున్నారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైంది. కుప్పంలో భారీ ఎత్తున బల ప్రదర్శన జరిగింది. టిడిపి అగ్రనేతలు, నారా కుటుంబ సభ్యులు అందరూ పాదయాత్ర ప్రారంభంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా తరచుగా నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇంత జరిగిన చంద్రబాబు నాయుడుకు అనుకున్న విధంగా మెజారిటీ పెరగలేదు 2019 ఎన్నికలలో 30, 722 ఓట్లు రాగా, ఈ ఎన్నికలలో 48 వేల ఓట్లమెజార్టీగా లభించింది. ఈ మెజారిటీ పట్ల ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర మొత్తం కూటమి గాలి వీస్తే, కుప్పంలో తనకు మెజారిటీ ఎందుకు తగ్గిందో అర్థం కాలేదన్నారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజులు పాటు పర్యటించిన నారా భువనేశ్వరి కూడా కుప్పం నియోజకవర్గంలో మెజార్టీ తగ్గడం పట్ల ఆరాతీశారు. తిరిగి మెజారిటీ సాధించడానికి చేపట్టాల్సిన చర్యలను స్థానిక నాయకులతో చర్చించారు. గతంలో టిడిపిలో ఉండి పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని కూడా పార్టీలోకి చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. తాను మూడు నెలలకు ఒకసారి గొప్ప నియోజకవర్గంలో పర్యటించి, పార్టీ సిద్దకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చిన ఒక గ్రామాన్ని, ఒక వార్డును ఆమె దత్తత తీసుకున్నారు. వాటిని ఆదర్శప్రాయంగా అభివృద్ధి చేస్తానని ఆమె ఇచ్చారు.
గతంలో తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పీఏ గా ఉండిన పిఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, స్థానిక నాయకులు మునిరత్నం, చంద్రశేఖర్ లు చాలా కీలకంగా వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలోని గతంలో ఎన్నికలు జరిగాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మండలానికి ఇన్చార్జిగా వ్యవహరించి పూర్తిస్థాయిలో ఎన్నికలను తన భుజస్కందాల మీద ఏచుకొని నడిపేవారు. ఈ ఎన్నికలలో స్థానిక నేతలను కాదని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఆయన స్థానికేతరుడు కావడంతో నియోజకవర్గం మీద పట్టు సాధించలేకపోయారని, అందరిని కలుపుకొని పోలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శాంతిపురం మండలం ఇన్చార్జి గా ఉన్న గౌని వారి శ్రీనివాసులు స్థానంలో కొత్తగా వచ్చిన సురేష్ బాబును నియమించారు. గతంలో పిఎస్ మనోహర్ రామకుప్పం భాధ్యతలు నిర్వహించేవారు. అందరూ సమిష్టిగా పనిచేసే చంద్రబాబు నాయుడుకు భార్య మెజారిటీని రప్పించేవారు. అయితే గత ఎన్నికల్లో నియోజకవర్గంలో సమన్వయం లోపించిందని పలువురు భావిస్తున్నారు. పాత నాయకులను పక్కన పెట్టడం, కొత్తగా వచ్చిన క్యాడర్ ను పగ్గాలు ఇవ్వడం కారణంగా నియోజకవర్గంలో మెజారిటీ తగ్గిందని తెలుస్తోంది. అలాగే వైసిపి పార్టీకి చెందిన అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్ స్థానికుడు,బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయన మీద అంత వ్యతిరేకత కనిపించలేదని తెలుస్తోంది. 2019 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి 73,923 ఓట్లు రాగా, ఈ ఎన్నికలలో 69,424 ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం 4,500 ఓట్లు మాత్రమే వైసిపి పార్టీకి తగ్గాయి. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో లక్ష ఓట్లు రాగా, ఈ ఎన్నికలో 1.21 లక్షల ఓట్లు వచ్చాయి. 17,284 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఆశించిన స్థాయిలో వైసిపికి ఓట్ల తగ్గలేదు. అలాగే తెలుగుదేశం పార్టీకి పెరగలేదు. ఈ విషయాల మీద కుప్పం నియోజకవర్గంలో అంతర్మధనం కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి భరత్ స్థానికంగా అందుబాటులో ఉండడం, కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో 46,000 దొంగ ఓట్లు ఉన్నాయని వైసిపి నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇందులో సుమారు 15 వేల ఓట్లను తొలగించడం జరిగింది. ఈ ఓట్ల తొలగింపు కూడా టిడిపి మెజార్టీని తగ్గించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అయితే అందులో సగం మెజార్టీ కూడా రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులలో ఆత్మ విమర్శ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఇందుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. వీటి మీద అధ్యయనం చేసి కుప్పం నియోజకవర్గంలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు తీసుకొనున్నారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల నారా భువనేశ్వరి పర్యటన నాంది వాచకంగా చెప్పవచ్చు.