వరుస వలసలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉక్కిరిబిక్కిరి
ఇప్పటికే పుంగనూరు మున్సిపల్ చైర్మన్, 9 మంది కౌన్సిలర్లు సిద్దం
పులిచెర్ల జడ్పిటిసి, మండల పరిషత్ ఉపాధ్యక్షుల రాజీనామా
అదే బాటలో నలుగులు ఎంపిటిసి లు, ఏడుగురు సర్పంచులు
నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితి
ఇసుక నిల్వలు స్వాదీనం
రక్షణ కోసం కోర్టుకు వెళ్ళిన పెద్దిరెడ్డి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
పుంగనూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. రాజకీయంగా పెద్దిరెడ్డిని బలహీనపరచడానికి తెలుగుదేశం పార్టీ అన్ని మార్గాలను అన్వేశిస్తోంది. ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత పెద్దరెడ్డి మీద ముప్పేట దాడి ప్రారంభమైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా, వ్యాపార పరంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ముప్పేట దారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోకిరి బిక్కిరి అవుతున్నారు. అయన తన సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించలేని పరిస్థితి నెలకొంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఏకాకిని చేయడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీలో కీలక నేతలను, ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పుంగనూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఆలిం భాష, 11మంది కౌన్సిలర్లతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్ర రెడ్డిని కలిశారు. తాము వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అధిష్టానం నిర్ణయం కోసం వారు వేచి చూస్తున్నారు. ఈలోపు పులిచర్ల మండలానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు, పులిచెర్ల జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి వైసీపీ పార్టీకి, జడ్పిటిసి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు పులిచెర్ల మండల పరిషత్తు ఉపాధ్యక్షులు రాశీ ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్, మరో నలుగురు ఎంపిటిసి సభ్యులు రాజీనామాలను సమర్పించారు. వీరితోపాటు పులిచెర్ల మండలంలో ఏడుగురు సర్పంచులు కూడా వైసిపి పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గంలో మరి కొంతమంది వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టాన వర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు. అధిష్టానం అనుమతిస్తే పుంగనూరు నియోజకవర్గంలో దాదాపుగా వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారపరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దెబ్బతీయడానికి ములకలచెరువు మండలం రెడ్డివారిపల్లి ఇసుక డంపును ఇటీవల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుకను పాపాగ్ని నదిలో తవ్వి, తంబళ్లపల్లె మార్గంలోని రెడ్డివారిపల్లె సమీపంలో నిల్వ ఉంచారు. అందుకు సుమారుగా 100 టిప్పర్ల వరకు పనిచేశాయి. గండికోట జలాశయం నుంచి నీటిని పుంగనూరు బ్రాంచ్ కెనాన్ కు తరలించే పనులకు ఉపయోగించేందుకు, గాలేరు- నగరి కాలువతో హంద్రీ-నీవా కాలువను అనుసంధానం చేయడానికి పనుల కోసం ఈ ఇసుకను నిల్వ ఉంచారు. అయితే కొన్ని నెలలుగా పనులు జరగకపోవడంతో ఇసుక నిల్వలు అలాగే ఉండిపోయాయి. ప్రభుత్వం మారడంతో ఇసుక నిల్వల గురించి రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో 27,472 క్యూబిక్ మీటర్ల ఇసుకను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, మారిన నూతన విధానంలో ప్రజలకు పంపిణీ చేస్తుంది. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు 5 ప్లస్ 5 రక్షణ ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రక్షణను వన్ ప్లస్ వన్ కుదించింది. తిరిగి తనకు రక్షణ ఫైవ్ ప్లస్ ఫైవ్ కు పెంచాలని కోరుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టును ఆరశ్రమించారు. ఆయన సాధారణ ఎమ్మెల్యే కావున వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. తన నియోజకవర్ తన నియోజకవర్గంలో పర్యటించడానికి ఇబ్బందిగా ఉందని, తన మీద దాడులు జరిగే అవకాశం ఉందని, కావున 5 ప్లస్ 5 సెక్యూరిటీని కొనసాగించాలని ఆయన కోరుతున్నారు. కేసు పూర్తి అయ్యేవరకు 2 ప్లస్ 2 రక్షణను ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తంబళ్ళపల్లి మండలానికి చెందిన జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేశారు. తాను ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారులు కేసు నమోదు చేయకపోవడంతో జడ్జి రామకృష్ణ హైకోర్టులో కేసును దాఖలు చేశారు. అందులో జిల్లా జడ్జిని కూడా ప్రతివాదిగా జేస్తూ, జిల్లా జడ్జి కూడా తనుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు కాపీలను అందజేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో హైకోర్టు స్పందిస్తూ ఈ విషయం మీద వేదికను అందజేయాల్సిందిగా పోలీసు, న్యాయశాఖ అధికారులను కోరారు. మరోవైపు నేపాల్ లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించినవిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వాటిని నేపాల్ నుంచి తిరుపతికి తీసుకొని వస్తున్నారు. అక్రమ కలప రవాణా మీద, జడ్జి రామకృష్ణను వేధించిన విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసులు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వైసిపి అధికారాన్ని కోల్పోయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతికూల పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతంలో చేసిన పనులు ఒక్కొక్కటిగా కేసుల రూపంలో ముందుకు వస్తున్నాయి.

