19, జులై 2024, శుక్రవారం

రణరంగంగా మారిన పుంగనూరు

 గాల్లో నాలుగు రౌండ్ల పోలీస్  కాల్పులు 

టియర్ గ్యాస్ ప్రయాగం 

మాజీ ఎంపి రెడ్డెప్ప స్కార్పియో దహనం

10 కార్లు, 10 స్కుటర్ల ధ్యంసం

8 మంది టిడిపి కార్యకర్తలకు గాయాలు  

పుంగనురులో పోలీస్ 30 యాక్టు అమలు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

రాజంపేట పార్లమెంటు సభ్యుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం పుంగనూరు పట్టణంలో అడుగుపెట్టడంతో పుంగనూరు రణరంగంగా మారింది. అగ్నిగుండం అయ్యింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ టిడిపి శ్రేణులు భారీగా మిథున్ రెడ్డి బస చేసిన  చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టారు. టిడిపి నేతలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయగా, వైసీపీ కార్యకర్తలు పథకం ప్రకారం కర్రలు, రాళ్లతో టీడీపీ నేతల మీద విరచుక పడ్డారు. ఈ దాడిలో 8 మందికి పైగా టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు పుంగనూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును ఆందోళనకారులు తగుల పెట్టారు. మరో పది కార్లను వాహనాలను ధ్వంసం చేశారు. ఇందులో రాజంపేట ఎంపి మిదున్ రెడ్డి కారు కూడా ఉంది. 10 ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.  ఈ సందర్భంగా పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి పరిస్థితిని అందుకు చేయడానికి ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు. పుంగనూరులో మిథున్ రెడ్డి ఉన్నంతవరకు పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆయన పుంగనూరు నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయినా ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ 30 యాక్ట్ ను అమలు చేస్తున్నారు. 


గత పది రోజుల కిందట పుంగనూరు పట్టణంలో సెటిల్ కోర్టును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని పరిశీలించడానికి రాజంపేట శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గురువారం గుట్టు చప్పుడు కాకుండా ఉదయం 9 గంటలకు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు. పట్టణంలోని పాత్రికేయులకు మాత్రం మిథున్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నారని స్థానిక వైసీపీ నేతలు సమాచారం ఇచ్చారు. మిథున్ రెడ్డి పుంగునూరు కొత్తఇండ్లలోని సూర్యా నగర్ లోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిలో ఉన్నారని తెలియగానే, టిడిపి శ్రేణులు ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నాయి. టిడిపి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి,  మాజీ కౌన్సిలర్ మన్యం శ్రీకాంత్ ఆధ్వర్యంలో వందలాది మంది టిడిపి కార్యకర్తలు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఎంపీ మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెలుపలకు వచ్చిన మాజీ ఎంపి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో పరిస్థితి అదుపు తప్పింది. టిడిపి కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలు విసరగా, పథకం ప్రకారం తెచ్చుకున్న దుడ్డు కర్రలు, రాళ్లతో వైసిపి కార్యకర్తలు విరచుకుపడ్డారు. ముందు జాగ్రత్తగా కుప్పం తదితర ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలను పిలిపించుకున్నారు. వారికి దొడ్డు కర్రలను, రాళ్ళను సమకూర్చారు. ఇంటి ఒకటి, రెండు అంతస్తుల నుంచి వైసీపీ  కార్యకర్తలు టిడిపి శ్రేణుల మీద రాళ్ల వర్షం కురిపించాయి. దుడ్డు కర్రలను విసిరి తీవ్రంగా గాయపరిచారు. సుమారు 8 మంది టీడీపీ కార్యకర్తలు ఈ దాడుల్లో గాయపడినట్లు సమాచారం. వైసిపి కార్యకర్తలు రాళ్లు, కర్రలు వాడడం, టిడిపి కార్యకర్తలు గాయపడంతో పుంగనూరులో పరిస్థితి ఒక్క సారిగా అదుపు తప్పింది. అక్కడే ఉన్న మాజీ ఎంపీ రెడ్డప్ప స్కార్పియో వాహనాన్ని దగ్ధం చేశారు. మిధున్ రెడ్డితో పాటు వచ్చిన పది కార్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సుమారు 10 ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ గొడవల్లో ఇద్దరు విలేకరులు కూడా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చుట్టుపక్కల కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసుకుని బతుకు జీవుడా అంటూ పారిపోయారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు  చేయడానికి విఫల ప్రయత్నం చేశారు. పోలీసు ఫోర్సు తక్కువగా ఉండటంతో ఆందోళనకారులను అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని పుంగనూరు వదిలి వెళ్లాల్సిందిగా పోలీసులు కోరారు. ఇందుకు మిథున్ రెడ్డి అంగీకరించలేదు. పోలీసులు పలు దపాలుగా నచ్చచెప్పడంతో,  ఎట్టికేలకు సాయంకాలం మూడున్నర గంటల ప్రాంతంలో మిథున్ రెడ్డిని పుంగనూరు వదిలి వెళ్లారు. దీంతో పుంగనూరులో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన పుంగనూరుకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  వీడియో పుటేజిని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరి మీద కేసులు నమోదు కాలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ 30 యాక్ట్ ను అమలు చేస్తున్నారు 

పరిస్థితి అదుపులో ఉంది: జిల్లా ఎస్పి 

ఈ విషయమై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ  చందోలు 'ప్రభ న్యూస్ బ్యూరో' తో మాట్లాడుతూ..  పుంగనూరులో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నామని, దాని ప్రకారం కేసుల నమోదు చేయడం జరుగుతుందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృత్తం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు.

పో రై గంగ 1 మాజీ ఎంపి రెడ్డెప్ప ఇంటి వద్ద ఉద్రిక్తత 

గంగ 2 మోహరించిన పోలీసులు 

గంగ 3 తగలబడుతున్న మాజీ ఎంపి స్కార్పియో

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *