బోగస్ పించనుదారులపై ప్రభుత్వం దృష్టి
జిల్లాలో పదివేల వరకు బోగస్ పింఛన్లు
ఆధార్ కార్డుతో పుట్టిన తేదీ మార్పు
వికలాంగుల పేరుతో భారీగా బోగస్
భూస్వాములకు పింఛన్లు
ఒకే ఇంట్లో పలువురికి పింఛన్లు
ఏరివేతకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
నూతన ప్రభుత్వం బోగస్ సామాజిక పింఛన్ల మీద దృష్టిని కేంద్రీకరించింది. వైసిపి ప్రభుత్వ పాలనలో భారీగా బోగస్ పింఛన్లను నమోదుచేసినట్లు పాలకులు భావిస్తున్నారు. అర్హత లేకపోయినా, వికలాంగుల కేటగిరిలో భారీగా బోగస్ ఉన్నట్లు భావిస్తున్నారు. డాక్టర్లకు డబ్బులు ఇచ్చి భారీగా నకిలీ దృవీకరణ పత్రాలను సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. అలాగే భూస్వాములకు పింఛన్లు ఎవ్వడమే కాకుండా, ఒకే ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా పలువురికి పింఛన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. మరికొందరు ఆధార్ కార్డుతో పుట్టిన తేదీని మార్పు చేసి, చిన్న వయస్సులోనే పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
చిత్తూరు జిల్లాలో మొత్తం 2,71,696 మందికి రూ.181 కోట్లను పెన్షన్ ల కింద జూలై 1న పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్ ల మొత్తాన్ని పెంచి జూలై 1నుండి మూడు రోజులు పాటు లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సామాజిక భద్రత పెన్షన్ ల పెంపు హామీ అమలులో భాగంగా మొదటి కేటగిరి లోని వృద్దాప్య, వితంతు, ఒంటరి మహిళ తదితర వర్గాల వారికి పెన్షన్ లను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇందులో 11 కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచి, జూలై 1 వ తేదీన రూ.4 వేలతో పాటు ఏఫ్రిల్, మే జూన్ మాసాలకు సంబందించి పెరిగిన ఫించను సొమ్ము నెలకు రూ.1,000 ల చొప్పున మూడు మాసాల అరియర్స్ కలుపుకుని మొత్తం రూ.7,000 లను పంపిణీ చేశారు. రెండవ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు, నాలుగవ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన ఫించను సొమ్ము పంపిణీ చేశారు. వృద్ధాప్య పెన్షన్ కింద 1,45,035 మందికి రూ.101.52 కోట్లు, నేతన్న పెన్షన్ కింద 2,572 మందికి రూ.1.80 కోట్లు, వితంతు పెన్షన్ కింద 59,993 మందికి రూ.42 కోట్లు,
వికలాంగుల పెన్షన్ కింద 35,803 మందికి రూ.21.48 కోట్లు అందచేశారు. అభయహస్తం కింద 11,311 మందికి రూ.56.56 లక్షలు, కల్లు గీత కార్మికులు 561 మందికి రూ.39 లక్షలు, హిజ్రాలు 32 మందికి రూ.2.24 లక్షలు, pఒంటరి మహిళల పెన్షన్ కింద 5,761 మందికి రూ.4.03 కోట్లు అందచేశారు. మత్స్యకారులు 249 మందికి రూ.17.43 లక్షలు, డప్పు కళాకారులు 6,290 మందికి రూ.4.40 కోట్లు, చర్మకారులు 796 మందికి రూ.55.72 లక్షలు, కళాకారుల పెన్షన్ కింద 70 మందికి రూ.4.90 లక్షలు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ కింద 61 మందికి రూ.3.05 లక్షలు పంపిణీ చేశారు. డి ఎం హెచ్ ఓ కింద 2,740 మందికి రూ.3.57 కోట్లు, సి కె డి యు ప్రైవేట్ కింద 254 మందికి రూ.25.40 లక్షలు, సి కె డి యు ప్రభుత్వం కింద 168 మందికి రూ.16.80 లక్షలు అందచేశారు.
పించనుదారులు భారీగా ఉండటం, పింఛను మొత్తాలను భారీగా పెంచడంతో ప్రభుత్వం మీద భారీగా భారం పడుతుంది.కావున బోగస్ పించనుదరులను గుర్తించి తొలగించడం ద్వారా కొంత భారం తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టిడిపి వర్గాల ద్వారా ప్రాథమికంగా విచారణ జరిపించారు. ఇందులో గత ప్రభుత్వం అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. వికలాంగుల కోటాలో అనర్హులు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. కాసులకు కక్కుర్తి పడిన డాక్టర్లు 5,10 శాతం అంగవైకల్యం ఉన్నా, 80,90 శాతం ఉన్నట్లు దృవీకరణ పత్రాలను జారీచేశారు. కొందరు రాజకీయనాయకులు డాక్టర్ల మీద వత్తిడి తెచ్చి, బోగస్ వికలాంగ దృవీకరణ పత్రాలు పొందినట్లు విమర్శలు ఉన్నాయి. డాక్టర్లు జరిచేసినట్లు కొందరి నకిలీ దృవీకరణ పత్రాలను సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయి. కొందరు ఆధార్ కార్డులలో పుట్టిన తేదీని మార్పు చేసినట్లు గుర్తించారు. జిల్లాలో 10 వేలకు పైగా బోగస్ పించనుదారులు ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిని ఎరివేయడానికి పంచాయతీల వారీగా టిడిపి నేతల నుండి తొలుత సమాచారాన్ని సేకరించి, అనంతరం ప్రభుత్వ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి అనర్హులను తొలగించడానికి చర్యలు తీసుకోనున్నారు. దీంతో ఇప్పుడే నకిలీ పించనుదారులలో గుబులు ప్రారంభం అయ్యింది.