28, జులై 2024, ఆదివారం

నామినేటెడ్ పదవుల్లో ఆ సామాజిక వర్గాలకే ప్రాధాన్యత

 బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట 

బిసిలకు ప్రాముఖ్యత, రెడ్లకు ప్రాతినిధ్యం 

ఎస్ సి లకు సామాజిక న్యాయం  


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


చిత్తూరు జిల్లా కూటమి నేతల్లో నామినేటెడ్ పదవులు ఎవరిని వరిస్తాయన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్య మంత్రి చంద్రబాబు స్వంత జిల్లా కావడంతో పలువురు నేతలు తమకంటే తమకు పదవులు వస్తాయని  ప్రచారం చేసుకుంటున్నారు.  అయితే చంద్రబాబు కులాల మధ్య సమతూకం పాటిస్తారని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి, బి సిలకు  అసెంబ్లీ ఎన్నికలలో  ప్రాతినిధ్యం లేదు. జిల్లా నుండి ముగ్గురు కమ్మ ఎం ఎల్ ఏ లు, ఒక రెడ్డి, ఇద్దరు ఎస్ సి ఎం ఎల్ ఏ లు ఉన్నారు. బలిజ, బిసి లకు స్థానం కల్పించలేదు. కావున నామినేటెడ్ పదవుల్లో ఈ రెండు సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తారని భావిస్తున్నారు. తదుపరి ప్రాధాన్యత రెడ్డి సామాజిక వర్గానికి ఉంటుందని ఉహిస్తున్నారు. జిల్లా నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమరనాధ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని భావించినా, రాలేదు, కావున రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా సంతృప్తి పరచాల్చి ఉంటుంది. జిల్లాలో ఇద్దరు ఎస్ సి ఎం ఎల్ ఏ లు, ఎంపి  ఉన్నా, ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు.


రాష్ట్ర స్థాయి పదవులు దాదాపు 100 ఉన్నాయి. ఇప్పటికీ పదవులకు అర్హులైన వారి జాబితా సిద్ధం చేశారని తెలిసింది. వారం పది రోజుల్లో కొన్ని పదవుల నియామకాలు జరుగుతాయని సమాచారం. ఇందులో జిల్లాకు నాలుగు వరకు రావచ్చు. ఇందులో అన్ని వర్గాలకు అవకాశం ఉంటుంది. పని తీరు, విధేయత, భవిష్యత్తులో ఉపయోగం, సామర్థ్యాలు తదితర అంశాలను పరిగణించి పదవులు కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో పుంగనూరు నుంచి వైసిపి నేత డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎన్నికయ్యారు. మిగిలిన ఆరు స్థానాలలో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో చంద్రబాబు ( కుప్పం), గురజాల జగన్ మోహన్ నాయుడు ( చిత్తూరు) గాలి భాను ప్రకాష్ (నగరి) కమ్మ సామాజిక వర్గం. డాక్టర్ వి ఎం థామస్ ( జి డి నెల్లూరు ) డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ( పూతలపట్టు ) ఎస్సీ సామాజిక వర్గం. పలమనేరు నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎన్ అమరనాద రెడ్డి గెలిచారు. చిత్తూరు లోక్ సభ సభ్యునిగా దగ్గుమల్ల ప్రసాద రావు ( ఎస్సీ) ఎన్నికయ్యారు. బలిజ, బిసి సామాజిక వర్గం నుంచి ఒకరు కూడ లేరు. ఈ నేపథ్యంలో బలిజ, బిసి, రెడ్డి సామాజిక వర్గం నేతలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. బలిజ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మనోహర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ హేమలత, కాజూరు బాలాజీ లలో ఒకరికి అవకాశం ఉంటుందంటున్నారు. బిసి సామాజిక వర్గం నుంచి పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎదుర్కోవడానికి వీలుగా ఒక రెడ్డికి రాష్ట్ర పదవి అప్పగించాలని బాబు భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చిత్తూరు మాజీ ఎమ్మేల్యే సి కె జయచంద్రా రెడ్డి ( బాబు), పుంగనూరు అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయిన చల్లా రామచంద్రా రెడ్డి, పెనుమూరుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, గుడిపాలకు చెందిన పీటర్, మాజీ ఎం ఎల్ ఏ గాంధీ  కూడా పదవి ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, వై వి. రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కూడా రేసులో అన్నారు. జనసేన జి డి నెల్లూరు ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ కూడా రాష్ట్ర పదవి ఆశిస్తున్నారు. రాష్ట్ర పదవులు రాని వారికి జిల్లా స్థాయి పదవులు వరించే అవకాశం ఉంది. జిల్లా గ్రంథాలయ సంస్థ, కేంద్ర సహకార బ్యాంకు, సహకార ప్రింటింగ్ ప్రెస్, జిల్లా ప్రింటింగ్ ప్రెస్, మహిళా స్త్రీ సంక్షేమ శాఖా రీజనల్ కో అర్దినేటర్, కాణిపాకం, బోయకొండ గంగమ్మ పాలకమండలి చైర్మేన్లు  తదితర పదవులు ఉన్నాయి. నియోజక వర్గ స్థాయి నాయకులకు మార్కెట్ కమిటీలు, సింగిల్ విండో పదవులు కట్టబెడుతారని అంటున్నారు. ఇప్పటికే టిడిపి పార్టీ ప్రోగ్రామ్ కమిటీ పదవులు ఆశించే వారిలో అర్హుల జాబితా రూపొందించినట్టు సమాచారం. జనసేన, బిజెపి నేతలకు తగిన అవకాశాలు ఉంటాయి అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *