ప్రభుత్వ కార్యాలయాలకు సూర్య వెలుగులు !
పిఎం సూర్య ఘర్ యోజన కింద ఏర్పాటు
జిల్లాలో ప్రభుత్య కార్యాలయాలకు ప్రతిపాదనలు సిద్దం
కార్యాలయాలకు భారీగా తగ్గనున్న విత్యుత్తు బిల్లులు
ఇళ్ళకు 90 శాతం రాయితీతో సూర్య ఫలకాలు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను సూర్య వెలుగులతో నింపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు సాంప్రదాయేతర ఇందన వనరుల అభివృద్ధి సంస్థకు ఆదేశాలను జారీ చేశాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సూర్య శక్తిని వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించి నివేదికను ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే అంచనాలను, ఒక్కొక్క కార్యాలయంలో ఎన్ని కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు అనే విషయాలను కూడా పంపాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్వే, చేసి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే ప్రాథమికంగా అంచనాలు పూర్తయ్యాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు. ప్రభుత్వం ఏజెన్సీని ఈ భాధ్యతలను అప్పగించనుంది.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద ప్రజల ఇళ్లకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సూర్య ఫలకాలను ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇలా చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి పెరగడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే లక్షలాది రూపాయల విద్యుత్ బిల్లును ఆదా చేయవచ్చు. సూర్య ఫలకాలను ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆయా ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకోవచ్చును. మిగులు విద్యుత్ ఉంటే, ఏపీ ట్రాన్స్ కో కొనుగోలు చేస్తుంది. ఇందుకుగాను ఏపీ ట్రాన్స్ కో యూనిట్ కు ధరను నిర్ణయించి వినియోగదారులకు చెల్లిస్తుంది. బిల్లు వేసే సమయంలో వినియోగించిన విద్యుత్తు నుండి ఏపీ ట్రాన్స్ కో కు సరపరా అయిన విద్యుత్తును మినహాయించుకుని బిల్లును వేస్తారు. ఇందువల్ల ప్రభుత్వ కార్యాలయాలకు భారీగా విద్యుత్ బిల్లులు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఎక్కువ ప్రభుత్వ కార్యాలయాలు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్లోనూ, మరికొన్ని కార్యాలయాలు పాత కలెక్టరేట్లోనూ ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా పరిషత్, చిత్తూరు మండల పరిషత్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, పశుసంవర్ధక శాఖ కార్యాలయం, నీటిపారుదల శాఖ కార్యాలయం, మున్సిపాలిటీ, ఆర్ టి సి కార్యాలయాలు వాటి సొంత స్థలాల్లో చిత్తూరు పట్టణాల్లో ఉన్నాయి. కొన్ని చిన్నాచితక ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. జిల్లాలో వందకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటి విద్యుత్ బిల్లి లక్ష రూపాయలు వస్తోంది. కొన్ని సందర్భాలలో వీటికి ఆ ప్రభుత్వ విభాగం బడ్జెట్ ని కేటాయించకపోవడంతో ట్రాన్స్ కో అధికారులు ఆ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చి విద్యుత్తును కూడా కట్ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం భారీగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ బిల్లుల బారినుండి కాపాడటానికి, సూర్య ఫలకాలను ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేసి వాడుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఘర్ యోజన పధకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గృహ వినియోగదారులకు 90 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లకు సబ్సిడీ ఉండదు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలు జరిగితే, భారీగా ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ బిల్లులు తగ్గటమే, కాకుండా ట్రాన్స్ కో కు భారీగా విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఆదనపు విద్యుత్తును ట్రాన్స్ కో కొనుగోలు చేస్తుంది. తద్వారా ట్రాన్స్ కో కు భారం తగ్గుతుంది. ఈ విషయమై సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ జిల్లా అభివృద్ధి అధికారి అబ్దుల్ గయాజ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ట్రాన్స్ కో, తాము కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా సర్వే పూర్తయిందని నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా సౌర్య ఫలకాల ఏర్పాటు జరుగుతుందని వివరించారు.
ఇళ్లకు 90 శాతం రాయితీ
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ వినియోగదారులు ఇళ్లమీద సూర్య ఫలకాలను అమర్చుకొని తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చును. ఆ విత్యుత్తును తామే వాడుకోవచ్చును. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తుంది. ఒక కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తికి 30,000 రూపాయలు, రెండు కిలోల వాట్ల విద్యుత్ ఉత్పత్తికి 60 వేల రూపాయలు, మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి 78 వేలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది. ఆసక్తి ఉన్న గృహ యజమానులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన వెబ్సైట్లోకి వెళ్లి తమ పేరును నమోదు చేసుకోవచ్చును. అలాగే సూర్య ఫలకాలను అమర్చి ఏజెన్సీల వివరాలు కూడా ఇందులో ఉంటాయి. తమకు నచ్చిన ఏజెన్సీని ఎంచుకోవచ్చును. ఈ వివరాలు ట్రాన్స్ కో విభాగానికి చేరుతాయి. ట్రాన్స్ కో విభాగం అధికారులు సాంప్రదాయేతర ఇందన వనరుల అభివృద్ధి సంస్థ అధికారులు కలిసి ఇళ్లమీద సూర్యఫలకాలను ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన ఇళ్లకు ప్రత్యేకమైన మీటర్లను విద్యుత్ శాఖ అధికారులు అమర్చుతారు. ఈ మీటర్ల ద్వారా ట్రాన్స్ కో ద్వారా ఎంత విద్యుత్తును వినియోగదారులు ఎంతవరకు ఉపయోగించుకున్నది తెలుసుకోవచ్చును. అలాగే సూర్య ఫలకాలను ద్వారా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును ట్రాన్స్ కో అధికారులు కొనుగోలు చేస్తారు. ఈ మీటర్ల ద్వారా తమ ఎంత ట్రాన్స్ కో ఎంత విద్యుత్తును వినియోగించుకున్నది తెలుస్తుంది. తద్వారా వినియోగదారులు ట్రాన్స్ కో కు సరఫరా చేసిన విద్యుత్తు యూనిట్లను తగ్గించి, వినియోగదారుడు వాడుకున్న విద్యుత్ కు బిల్లులను అందజేయడం జరుగుతుంది. తద్వారా విద్యుత్ వినియోగదారులకు భారీగా విద్యుత్ బిల్లులు ఆదా అవుతుంది. ఆసక్తిగల వినియోగదారులు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.
పో రై. గంగ 1& 2 పిఎం సూర్య ఘర్ యోజన